దళితులకు క్షమాపణలు చెప్పమంటే.. మా రక్తం కళ్ల చూస్తావా..?

చంద్ర‌బాబుపై మున్సిప‌ల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫైర్‌

మాపైనే రాళ్ళ దాడులు చేసి, రౌడీలు, గూండాలని ఎల్లో మీడియాలో రాతలు

ఎవరు ఎవరిపై దాడి చేశారో కాణిపాకంలో ప్రమాణం చేద్దామా..?

చంద్ర‌బాబు క్షమాపణలు చెప్పేంతవరకు నిరసనలు ఆగవు..

బాబే టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టి మాపై దాడి చేయించాడు

మరో కారంచేడు, చుండూరులా మారణహోమం సృష్టించాలని ప్రయత్నిస్తున్నాడు

ప్ర‌కాశం: ఎర్రగొండపాలెంలో శాంతియుత వాతావరణాన్ని చంద్రబాబు కలుషితం చేశాడని, దళితులను కించపరిచి తప్పించుకు తిరుగుతున్న చంద్ర‌బాబు క్ష‌మాప‌ణ‌లు చెప్పే వ‌ర‌కు నిర‌స‌న‌లు ఆగ‌వ‌ని మున్సిప‌ల్ శాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ హెచ్చ‌రించారు. రాళ్ల దాడికి పాల్పడ్డ వారి పేర్లు కూడా చెప్తామ‌ని, దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల‌న్నారు. నేషనల్‌ హైవేపై ట్రాఫిక్‌ కు అంతరాయం కల్పించినందుకు చంద్రబాబుపై చర్యలు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. ఎర్ర‌గొండ‌పాలెంలో చంద్ర‌బాబు సృష్టించిన అల‌జ‌డిపై మంత్రి ఆదిమూల‌పు సురేష్ మండిప‌డ్డారు. 

ఈ సంద‌ర్భంగా మంత్రి సురేష్ ఇంకా ఏం మాట్లాడారంటే.. 
ఎల్లో మీడియా- ఆంధ్రజ్యోతిలో కంటికి గాయమైన ఫోటో వేశారు. వాళ్ల జెండా కర్ర తిప్పుతుంటే.. వారికి గుచ్చుకుని అతనికి కంటికి గాయమైతే మేం రాళ్లు వేస్తే కంటికి దెబ్బతగిలింది అని మాపై అభాండాలు వేస్తున్నారు. మాపై రాళ్లు విసిరింది టీడీపీ నేత‌లు, ఆ విజువల్స్ అన్ని టీవీల్లో కనిపిస్తున్నాయి. మళ్లీ దొంగే దొంగా దొంగా.. అన్నట్లుంది. తిమ్మిని బమ్మిని చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. దళితులను మేము ఏమైనా అంటాం.. వాగుతాం.. కానీ, మీకు మేము క్షమాపణ చెప్పేది లేదన్న అహంకారం చంద్రబాబు, ఆయన కొడుకుది.. దళితులుగా మేం నిరసన వ్యక్తం చేస్తే మరో మారణ హోమం సృష్టిస్తాను అన్నట్లు చంద్రబాబు వైఖరి ఉంది.

మేం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రాంతానికి వచ్చి, వాహనం లోపల నుంచి చంద్రబాబు బయటకు వచ్చి దళితులకు వేలు చూపించి బెదిరించాడు. దళిత సంఘాల ప్రతినిధులను బెదిరిస్తూ.. టీడీపీ అల్లరిమూకలును రెచ్చగొట్టి రాళ్ల దాడి చేయించాడు. మేము క్షమాపణ కోరితో మా మీద రాళ్ల దాడి చేసి,  మా రక్తం కళ్లచూస్తారా..?. దళితులపై దాడులు చేయించడం, వారి రక్తాన్ని కళ్ళ చూడటం, దళితుల వ్యతిరేక భావజాలం చంద్రబాబు డీఎన్ఏలోనే ఉంది. 

నిరసన తెలిపే హక్కు లేదా..
దళితులకు నిరసన తెలిపే హక్కు, అధికారం లేదనే అహంకారం చంద్రబాబులో కనిపిస్తోంది. చంద్రబాబు అక్కడ ఏమాత్రం ఆగడానికి అవకాశమే లేకపోయినా కావాలని వాహనం ఆపి టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టాడు. మళ్లీ మరో కారంచేడు, చుండూరు లాంటి మారణహోమం సృష్టించాలని చంద్రబాబు కుట్ర పన్నుతున్నాడు. ఒక కుట్రతో ముందస్తు పథకం ప్రకారమే చంద్రబాబు ఇలాంటి దాడిచేయించాడు. దారి మధ్యలో ఒక గంటసేపు వాహనం ఆపి అందర్నీ కూడేసుకుని రాళ్లు, రాడ్లు తీసుకుని మా మీద దాడిచేశారు. ముగ్గురు మా పార్టీ కార్యకర్తలు గాయపడ్డారు.. కంబంపాడు దళిత సర్పంచ్‌ ఆదాం, జడ్పీటీసీ కో ఆప్షన్‌ సభ్యుడు షాబిర్‌ భాషాతో పాటు మరొకరికి తలలు పగిలి కుట్లు పడ్డాయి. చంద్రబాబు ఎర్రగొండపాలెం రావడానికి భయపడి.. ముందే పథకం ప్రకారం అందర్నీ పోగేసుకున్నాడు

క్షమాపణ చెప్పే వరకూ వదిలేది లేదు
దళితులపై తండ్రీకొడుకులు అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు.. చంద్రబాబు పర్యటనకు ఒక రోజు ముందే మేం నిరసనకు పిలుపునిచ్చాం. శాంతియుతంగా నిరసన తెలుపుతున్నాం. క్షమాపణ చెప్పండి.. మీ వాఖ్యలను వెనక్కు తీసుకోండి.. అని నల్ల బెలూన్లు, చొక్కాలతో నిరసన తెలియజేశాం. గతంలో చంద్రబాబు చేసిన వాఖ్యలకు ఇప్పటి వరకూ క్షమాపణ చెప్పలేదు కాబట్టే, ఈ రోజు ఆయన తనయుడు లోకేశ్‌ దళితులు ఏం పీకారు..  అంటూ మాట్లాడాడు. ఈ దేశానికి అత్యంత ప్రజాస్వామ్యయుత రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్‌ ఒక దళితుడే అన్నది తెలుసుకో లోకేశ్.. అవకాశాలు ఇస్తే.. దళితులు అద్భుతాలు చేయగలరని మా నాయకుడు సీఎం వైయ‌స్ జగన్ ఎంతో మంది దళితులకు అవకాశం ఇచ్చారు. దళితులు శుభ్రంగా ఉండరని, మురికి వాడల్లో ఉంటారని ఆనాడు నీ క్యాబినెట్‌ సహచరులు మాట్లాడినా.. నువ్వు ఖండించలేదు. ఈ రోజు నీ కొడుకు రెండాకులు ఎక్కువ చదివి దళితులు ఏం పీకారు.. అని  అంటున్నాడు. మాకు అంగబలం, అర్ధబలం లేకపోవచ్చు...కానీ మేం ఏం పీకుతామో, మా తడాఖా ఏమిటో ఎన్నికల్లో చూపిస్తాం.. మాకు ఏ బలం లేకపోయినా.. ఓటు బలం ఉందని మర్చిపోవద్దు చంద్రబాబూ..

పచ్చ మీడియా పిచ్చి రాతలు
చంద్రబాబుపై రాళ్ల దాడి అంటూ పచ్చ మీడియా తప్పుడు రాతలు రాసింది. దాడి జరిగింది మాపైన.. గాయపడింది మావారైతే.. పచ్చ మీడియా తప్పుడు రాతలు రాస్తోంది. నువ్వు ఎన్నిసార్లు రాళ్ల దాడిచేసినా, మా రక్తం కళ్లచూసినా..  క్షమాపణలు చెప్పే వరకూ నిన్ను వదిలిపెట్టం బాబూ.. క్షమాపణ చెప్పమని అడగడం తప్పా.. అడిగితే నువ్వు చేసే పని ఇదా.. నువ్వు ఎన్ని బెదిరింపులు చేసినా మేం భయపడం,  వెనుకాడేది లేదు. నిన్న మీడియా వారే.. నన్ను, నా క్యాంపు ఆఫీసును, ఇంటిని వారు తగలబెడతారట అని ప్రశ్నించారు. నేను అందుకే నా ఇల్లు, ఆఫీసు కాదు.. నన్నే తగులబెట్టండని చెప్పాను. దానికి నేను రౌడీయిజం చేశానంటూ నాపై అభాండాలు వేస్తున్నారు. మీకు ఎల్లో చానళ్లు ఉండొచ్చు.. దళిత వ్యతిరేక భావజాలానికి వత్తాసు పలికే దళిత నాయకులు మీ పార్టీలో ఉండొచ్చు. మీ మీడియాలో మమ్మల్ని రౌడీలుగా, గూండాలుగా చిత్రీకరించవచ్చు.. కానీ వాస్తవాన్ని ఎవరూ వక్రీకరించలేరు. తెలుగుదేశం శ్రేణులు మా ఆఫీసుపైన ఎలా రాళ్ళ దాడి చేస్తున్నాయో.. వీడియోను మీడియాకు విడుదల చేసిన మంత్రి సురేష్.. వీడియో చూసైనా..  నా గురించి మాట్లాడుతున్నవారు వాస్తవాలు తెలుసుకోండి. నా గురించి మాట్లాడుతున్న టీడీపీ నాయకులను అడుగుతున్నా.. చంద్రబాబు, లోకేశ్‌ దళితులను అవమానించారా.. లేదా.. మీ ఆత్మ సాక్షిని అడగండి. వాళ్లన్న మాటలకు మేం క్షమాపణ అడగడం కూడా తప్పా.. దళితులుగా మేం క్షమాపణ కూడా అడగకూడదా..?  మమ్మల్ని నిత్యం అత్మన్యూనత భావంలోకి నెట్టేస్తుంటే మేం చూస్తూ ఊరుకోవాలా..?

కాణిపాకంలో ప్రమాణం చేద్దామా..?
నేను ఒక మంత్రిగా, ఎమ్మెల్యేగా కాదు.. ఒక దళితుడిగా మిమ్మల్ని క్షమాపణ చెప్పమని నిరసనలో పాల్గొన్నాను. దళితులను కించపరిచి ఒక దళిత నియోజకవర్గంలోకి చంద్రబాబు వస్తుంటే క్షమాపణ చెప్పి రావాలని దళిత సోదరులంతా కోరారు. వారి నిరసనకు,  నేను శాంతియుతంగా మద్దతు తెలిపాను..  చంద్రబాబు కాన్వాయ్‌లో ఉన్న ఎన్‌ఎస్‌జీ కమాండెంట్స్ .. మా శ్రేణులపైకి రావడమేమిటి ..? టీడీపీ శ్రేణులను ఉసిగొల్పుతూ ఆయన ఎందుకు ముందుకు వచ్చాడు..? కళ్లు లేని కబోదిలా, చెవిటి వారిలా ఎల్లో పత్రికలకు వాస్తవాలు కనిపించవు, వినిపించవు. దళితుల మీద దాడి చేసిన చంద్రబాబుకు వత్తాసుపలకడానికి ఎలా మనసు వచ్చింది..?  ఎవరు ఎవరిపై దాడి చేశారో.. కాణిపాకం వినాయకుడు వద్ద ప్రమాణం చేద్దామా..? రాళ్లు వేసింది ఎవరు..? దాడి చేసింది ఎవరు..? నిజం నిప్పు లాంటిది ఎప్పుడో ఒకసారి మిమ్మల్ని దహించివేస్తుంది. మీరు క్షమాపణ చెప్పేంతవరకూ ఈ నిరసనలు ఆగవు.. ఇది ఎర్రగొండపాలెంతో ఆగిపోదు...ప్రతి ఎస్సీ నియోజకవర్గంలోనూ ఇలానే నిరసనలు చేస్తాం. మేం క్షమాపణ చెప్పేది లేదనేదే మీ భావజాలం అయితే మీకు ఎలా బుద్ధి చెప్పాలో కూడా మాకు తెలుసు. మీరు రాళ్ల దాడి చేసి, తలలు పగులకొడితే మేం బెదిరేది లేదు...మేం పోరాడుతూనే ఉంటాం. మా జగనన్న మాకు సాధికారత, ఆత్మగౌరవం ఇచ్చారు. మీరు దళితుల మధ్య విభేదాలు సృష్టిస్తూ కులాలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో దళితులు మీకు గట్టి సమాధానం చెబుతారు.

జనం రాకనే బాబు డైవర్షన్ పాలిటిక్స్
ఎర్రగొండపాలెం వచ్చి చంద్రబాబు మాట్లాడింది నేషనల్‌ హైవే నడిబొడ్డున. మీరు ఎక్కడ స్టేజ్‌ కట్టుకున్నారు..? ఎందుకు అక్కడకు వెళ్లలేదు..? అక్కడకు వెళితే అన్నీ కాళీ కుర్చీలు దర్శనమిస్తాయని, తనకు తెలిసిన విద్యతో ఇరుకు సందుల్లో మీటింగు పెట్టుకుని మమ్మల్ని రెచ్చగొట్టి, ఎల్లో మీడియాలో హైలెట్ కావాలని చూశారు. ఆయన చేసిన ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసులపైన ఉంది. నేను కుప్పిగంతులు వేయడం కాదు చంద్రబాబూ.. జగన్మోహన్‌రెడ్డి గారి ముందు నీ కుప్పిగంతులు చెల్లవు. మేం కూడా ఆవేశపడి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది.

Back to Top