అటానమస్‌ కాలేజీల్లో పరీక్షల విధానంలో మార్పులు

మంత్రి ఆదిమూలపు సురేష్‌

సొంతంగా ప్రశ్నాపత్రాలు తయారు చేసుకునే విధానం రద్దు

అడ్మిషన్ల ప్రక్రియలో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్లు కచ్చితంగా పాటించాలి

ఆన్‌లైన్‌ పద్ధతిలో అడ్మిషన్లు జరిగేలా చర్యలు 

ప్రభుత్వ కాలేజీల్లో ఈ ఏడాది అదనంగా 50 వేల అడ్మిషన్లు 

సచివాలయం: అటానమస్‌ కాలేజీల్లో పరీక్షల విధానంలో మార్పులు తెచ్చినట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు. శుక్రవారం సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పోటీ ప్రపంచంలో తట్టుకునేలా నైపుణ్యానికి పెద్దపీట వేస్తున్నామని, విద్యార్థుల్లో స్వయంప్రతిపత్తి కలిగించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విద్యార్థులు తమకు నచ్చిన కోర్సుల్లో చేరేందుకు పరిధులు దాటి ఆన్‌లైన్‌ క్లాస్‌లు,ఆఫ్‌లైన్‌ క్లాస్‌లు క్రోడికరిస్తూ విధానంలో మార్పులు తెస్తున్నామన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పులు జరగాలని అన్నారు. డిగ్రీ కోర్సులు కూడా పూర్తిగా పారదర్శకంగా, జవాబుదారితనంతో నిర్వహించాలి. అడ్మిషన్లు కూడా పారదర్శకంగా రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్లు పాటించాలన్నారు.

కొన్ని అటానమస్‌ కాలేజీల్లో అక్రమాలు జరిగినట్లు మా దృష్టికి వచ్చినట్లు తెలిపారు. అటానమస్‌ కాలేజీల్లో పరీక్షల విధానంలో మార్పులు తెస్తున్నట్లు చెప్పారు. సొంతంగా ప్రశ్నాపత్రాలు తయారు చేసుకునే విధానం రద్దు చేసినట్ల తెలిపారు. ప్రతి డిగ్రీలో కూడా అప్రెంటిషిప్‌ విధానాన్ని తీసుకువస్తున్నామన్నారు.’అన్ని కాలేజీలకు జేఎన్‌టీయూ తయారు చేసిన ప్రశ్నాపత్రాలే ఉంటాయని, వాల్యూయేషన్‌ బాధ్యత జేఎన్‌టీయూకే అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో 109 అటానమస్‌ కాలేజీలు ఉన్నాయని చెప్పారు. జెఎన్‌టీయూ కాకినాడ పరిధిలో 31 కాలేజీలు ఉన్నాయని తెలిపారు. జెఎన్‌టీయూ అనంతపురం పరిధిలో 21 కాలేజీలు ఉన్నాయని చెప్పారు. 

గత ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్వీర్యం చేసిందని విమర్శించారు. పూర్తిగా కార్పొరేట్, ప్రైవేట్‌ వ్యక్తులకు లబ్ధి చేకూర్చేలా చంద్రబాబు ప్రభుత్వం పని చేసిందన్నారు. ప్రభుత్వ రాయితీలను వినియోగిస్తూ, రిజర్వేషన్లు పాటించకుండా, ఏకపక్షంగా అడ్మిషన్లు చేసుకున్నారని తెలిపారు. ఈ విద్యాసంవత్సరంలో ఆన్‌లైన్‌ పద్ధతిలో కూడా అడ్మిషన్లు చేపట్టామన్నారు. ఎల్లోమీడియాలో ప్రైవేట్‌ విద్యా సంస్థలతో కుమ్మక్కై అడ్మిషన్ల వ్యవస్థలో ప్రభుత్వం విఫలమైందని తప్పుడు కథనాలు రాయించారు. ఇలాంటి కథనాలను నమ్మాల్సిన అవసరం లేదని, వాస్తవాలు గమనించాలన్నారు., గతేడాదితో పోల్చితే 2.20 లక్షల నుంచి 2.70 లక్షల అడ్మిషన్లు పెరిగాయన్నారు. అంటే 50 వేల అడ్మిషన్లు ప్రభుత్వ కాలేజీల్లో పెరిగాయని వివరించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన విద్యార్థులకు మంచి మంచి కాలేజీల్లో అడ్మిషన్లు దొరికాయన్నారు. అక్రమ మార్గంలో అడ్మిషన్లు జరగకుండా పక్కాగా చర్యలు తీసుకున్నామన్నారు. అటానమీ అన్న ముసుగులో కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. తూతూమంత్రంగా వ్యవహరించి వారే ప్రశ్నా పత్రాలు తయారు చేసుకునేవారు. వారే వాల్యూయేషన్‌ చేసుకునే వారు. విద్యా రంగంలో పారదర్శకతను తీసుకువచ్చేందుకు అటానమస్‌ కాలేజీల్లో ప్రశ్నాపత్రాల తయారు చేసే విధానాన్ని రద్దు చేశామన్నారు. అవినీతి, అక్రమాలను కూకటి వేళ్లతో పెకిలించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ప్రభుత్వం ఇస్తున్న స్కాలర్‌షిప్‌లను ఇకపై పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తూ వ్యవస్థాగత మార్పులు తీసుకువస్తున్నామని చెప్పారు. విద్యా ప్రమాణాలు పెంచడమే సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి లక్ష్యమని మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. 

తాజా ఫోటోలు

Back to Top