మాతృభాషా వికాసానికి కట్టుబడి ఉన్నాం

కన్నా, బాబు, ఈనాడు అధినేత మనవళ్లు ఇంగ్లిష్‌ మీడియంలో చదవడం లేదా

పనిచేసే వారి పిల్లలు ఆంగ్ల మాధ్యమంలో చదివితే తప్పా..?

నాడు – నేడు మొదలుపెడితే.. నారా లేడు అనే స్టేజీ వస్తుందని భయం

వచ్చే ఏడాది నుంచి ఒకటి నుంచి 5వ తరగతి సిలబస్‌ మార్పు

విద్యార్థులకు మెరుగైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం

సమ్మర్‌లో ఉపాధ్యాయులకు ఆంగ్లంలో ట్రైనింగ్‌ ఇవ్వనున్నాం

సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయం చరిత్రాత్మకం
 

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

 

సచివాలయం: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకం అని హర్షాతిరేఖాలు వ్యక్తం అవుతున్నాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. తెలుగు భాషా వికాసానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ఏర్పాటుపై విమర్శలు చేస్తున్న కన్నాలక్ష్మీనారాయణ, చంద్రబాబు, ఈనాడు అధినేతల మనవళ్లు ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లలో చదవడం లేదా అని ప్రశ్నించారు. పేదవాడికి మాత్రం ఉన్నత విద్య అందకూడదా.. అని నిలదీశారు. పాఠశాలల్లో నాడు – నేడు కార్యక్రమం మొదలుపెడితే ఇక నారా లేడు అనే స్టేజీ వస్తుందని భయపడుతున్నారన్నారు. పట్టణాల్లోనే కాదు.. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లను అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి స్పష్టం చేశారు. నవంబర్‌ 14వ తేదీన ప్రకాశం జిల్లా నుంచి నాడు – నేడు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రారంభిస్తారని చెప్పారు.

సచివాలయంలో మంత్రి ఆదిమూలపు సురేష్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘తెలుగుభాషకు అన్యాయం జరిగిందని ప్రతిపక్షాలు వితండవాదం చేస్తున్నాయి. సూటిగా ప్రశ్న వేస్తున్నాం.. గ్రామీణ ప్రాంతంలో చదువుకునే విద్యార్థుల సామర్థ్యాలను ప్రపంచ అవసరాలకు తీర్చిదిద్దే సమర్థవంతమైన సమాచార నైపుణ్యాలను అందించాలనే ఉద్దేశ్యం మీకు లేదా..?
గ్రామీణ ప్రాంతంలో సామర్థ్యానికి, నైపుణ్యానికి కొదవులేదు. కానీ, ఉద్యోగ అన్వేషణలో మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం, మారుతున్న కాలానికి అనుగుణంగా ఆంగ్ల మాధ్యమం పరిచయం చేయడం ఎంత అవసరమో చూస్తున్నాం. ఆంగ్ల భాష నైపుణ్యాలను విద్యార్థుల్లో పొంపెందించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక తీసుకువచ్చింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియం తీసుకువచ్చాం. పదో తరగతి పరీక్షలకు వెళ్లేవారు ఇబ్బంది పడకూడదని, 8 నుంచి స్టార్ట్‌ చేస్తున్నాం.

రాష్ట్రంలో విద్యను అభ్యసిస్తున్న వారి సంఖ్య మొత్తంగా పరిశీలిస్తే 70,90,217 మంది విద్యార్థులు అక్టోబర్‌ వరకు నమోదైతే.. వారిలో 44,21,529 మంది అంటే 62.3 శాతం ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్నారు. వారిలో సామాజిక వర్గాల వారీగా పరిశీలన చేస్తే ముఖ్యంగా ఎస్టీకి చెందిన విద్యార్థులు 33.23 శాతం, ఎస్సీకి 49.61 శాతం, వెనుబడిన వారు 62.5 శాతం, ఇతర కులాలు 82.6 ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్నారు. ఆంగ్ల మాధ్యమంలో స్కూళ్లు అందుబాటులో లేకపోవడం, ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లు కేవలం ధనికులకు మాత్రమే పరిమితమైపోయి.. గ్రామీణ ప్రాంతంలోని ఎస్సీ, ఎస్టీలు వెనబడ్డారని ప్రభుత్వం గుర్తించింది. మారుతున్న కాలానికి అనుగుణంగా పోటీ ప్రపంచంలో రాణించాలని, ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచాలని గొప్ప లక్ష్యంతో సీఎం వైయస్‌ జగన్‌ అసెంబ్లీలో అనేక చట్టాలు తీసుకువచ్చారు. స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతంలోని వారికి మెరుగైన శిక్షణ ఇవ్వాలంటే ఆంగ్ల మాధ్యమంలో చదవాల్సిన అవసరం.

గత ప్రభుత్వం రూ.17 కోట్ల ఇచ్చి నారాయణ పుస్తకాలు మున్సిపల్‌ పాఠశాలలకు అందించారని మర్చిపోయారా..? పట్టణమే కాదు.. గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లు అందుబాటులో ఉంటాయి. రాష్ట్రంలో తమిళ, ఉర్దూ, కన్నడ, ఒరియా మీడియంలో కూడా పాఠశాలలు నడుస్తున్నాయి. తెలుగు భాషా వికాసానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.  

నాడు నేడు కార్యక్రమం మొదలుపెడితే నారా లేడు అనే స్టేజీకి వస్తాడనే భయపడుతున్నారు. నాడు – నేడు కార్యక్రమంతో ముందుకెళ్లి అక్కడితో ఆగకుండా కాంపిటేటివ్‌ పరీక్షలకు సంబంధించి విద్యార్థులను తర్ఫీదులు కూడా ఇస్తాం. విద్యా ప్రమాణాల్లో మార్పులు తీసుకురావాలని దార్శనికతతో సీఎం వైయస్‌ జగన్‌ ముందుకువెళ్తున్నారు. మొదట స్కూళ్లలో మౌలిక వసతులు పటిష్టం చేయనున్నాం. నవంబర్‌ 14న ప్రకాశం జిల్లా నుంచి నాడు – నేడు కార్యక్రమాన్ని సీఎం ప్రారంభిస్తారు. దశలవారీగా ఉన్నత ప్రమాణాలతో కూడిన కరికులం ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. వచ్చే ఏడాది నుంచి ఒకటి నుంచి 5వ తరగతి వరకు సిలబస్‌ మార్పు, మిగతా క్లాస్‌లకు కూడా మార్పు చేయడం జరుగుతుంది. విద్యార్థులు మెరుగైన విద్యను అభ్యసించి వారి నైపుణ్యాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని విద్యావ్యవస్థను అంచెలంచెలుగా తీసుకెళ్తున్నాం.

బోధన సిబ్బంది చాలా చోట్ల ఖాళీలు ఉన్నాయి. ఒకటి నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియం తీసుకువస్తున్నాం. ఉన్నటువంటి టీచర్లలో 98 వేల మందిని ఆంగ్ల మాధ్యమంలో బోధన కోసం నైపుణ్యం, టీచింగ్‌ మెటీరియల్‌ అందించాల్సిన అవసరం ఉంది. అందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. సమ్మర్‌లో జనవరి నుంచి మే వరకు టీచర్లకు ట్రైనింగ్‌ ఇవ్వనున్నాం. ఇఫ్లూ, రీజల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ బెంగళూరు, సత్యసాయి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హైయర్‌ లెర్నింగ్‌ నుంచి ట్రైనింగ్‌ ఇప్పిస్తాం.

ఇంగ్లిష్‌ మీడియంపై అనవసరపు విమర్శలు చేస్తున్న కన్నాలక్ష్మీనారాయణ, చంద్రబాబు, ఈనాడు అధినేత వారి మనవళ్లను తెలుగుమీడియంలో చదివిస్తున్నారా..? ఐఏఎస్‌ ఆఫీసర్ల పిల్లలు ఇంగ్లిష్‌ మీడియంలో చదువుతున్నప్పుడు వారి ఇంట్లో పనిచేసే వారి పిల్లల కోసం ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లు ఏర్పాటు చేయడం తప్పా..? ఇందులో రాజకీయం చేసి.. ప్రభుత్వంపై బురదజల్లాలని ప్రయత్నిస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు.

Read Also:  దేవాన్ష్‌ను ఇంగ్లీష్‌ మీడియంలో ఎందుకు చేర్పించావు బాబూ?

తాజా వీడియోలు

Back to Top