రాజమండ్రి: రాజకీయాల కోసం చంద్రబాబు తిరుమల శ్రీవారిని అడ్డం పెట్టుకున్నారని మాజీ ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా హిందువుల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీశారని దుయ్యబట్టారు. కల్తీ నెయ్యి వ్యవహారంపై టీటీడీ ఈవో సాక్షిగా నిజాలు బట్టబయలయ్యాయని తెలిపారు. సీఎంకు ఇచ్చిన నివేదికలో ఒకలా.. షోకాజ్ నోటీసుల్లో మరోలా ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం రాజమంత్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జూలైలో రిపోర్టు వస్తే రెండు నెలల వరకు ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. కేసులు ఎందుకు నమోదు చేయలేదని, అరెస్ట్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైన సందర్భంగా విపరీతంగా ప్రచారం చేసుకుంటూ.. ప్రతి ఇంటా స్టికర్ వేస్తున్నారని, అసలు ఈ ప్రభుత్వం ఏ మంచి పని చేసిందని తమది మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటోందని మాజీ ఎంపీ మార్గాని భరత్ సూటిగా ప్రశ్నించారు. అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైన ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రజల దృష్టి మళ్లించేందుకు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని, ఇప్పుడు కూడా టీటీడీ ప్రసాదం లడ్డూ తయారీలో జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యి వాడారని ఏకంగా సీఎం చంద్రబాబు దారుణ ఆరోపణలు చేశారని ఆయన దుయ్యబట్టారు. ఈ విషయంలో నిజానిజాలు నిగ్గు తేలాలన్న ఆయన, సుప్రీంకోర్డు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి సూటిగా ‘సూపర్‌సిక్స్ ప్రశ్నలు’ సంధించిన మాజీ ఎంపీ, దమ్ముంటే వాటికి సమాధానం చెప్పాలని సవాల్ చేశారు. 1). లడ్డూ తయారీలో వినియోగించిన నెయ్యికి సంబంధించి, టీటీడీ ఈఓ శ్యామలరావు గత జూలైలో మీడియాతో మాట్లాడుతూ, నెయ్యిలో వనస్పతి వంటి వెజిటబుల్ ఫ్యాట్ కలిసిందని చెప్పారు. రెండు నెలల తర్వాత సీఎం చంద్రబాబు, దారుణ ఆరోపణల తర్వాత, మళ్లీ మీడియాతో మాట్లాడిన టీటీడీ ఈఓ, నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపినట్లు ఎన్‌డీడీబీ నివేదిక ఇచ్చిందని తెలిపారు, అంత బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మీరు మాటెలా మార్చారు?. 2). ఎన్‌డీడీబీ రిపోర్టును పబ్లిక్ డొమెయిన్‌లో పెట్టకుండా, అది టీడీపీ ఆఫీస్‌కు ఎలా చేరింది. టీటీడీ స్వతంత్య్ర ప్రతిపత్తితో పని చేసే సంస్థ అని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. మరి ఎన్‌డీడీబీ రిపోర్ట్‌ను టీడీపీ ఆఫీస్‌లో ఎలా రిలీజ్ చేశారు? దీనికి మీ సమాధానం ఏమిటి?. 3). గత జూలై 23న ఎన్‌డీడీబీ రిపోర్ట్ ఇస్తే దాన్ని దాదాపు రెండు నెలలు ఎందుకు బయటపెట్టలేదు?. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారన్న నివేదిక వచ్చినా, సరఫరా చేసిన సంస్థపై కేసు ఎందుకు నమోదు చేయలేదు?. ఎవరిపైనా చర్యలు ఎందుకు తీసుకోలేదు?. 4). అలాగే, ఎంతో ప్రతిష్టాత్మకమైన టీటీడీలో వినియోగించిన నెయ్యిపై ఎన్‌డీడీబీ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెల్లడైతే, సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు?. ఘజియాబాద్ ల్యాబ్ నుంచి మరో రిపోర్ట్‌ను ఎందుకు కోరలేదు? 5). నెయ్యి కల్తీ అని రిపోర్ట్ వచ్చిన నాలుగు ట్యాంకర్లు తిప్పి పంపామని టీడీడీ ఈఓ ప్రకటించగా, ఆ నెయ్యిని వాడారని సీఎం తెలిపారు. ఇందులో ఎవరిది నిజం?. ఎవరిది అబద్ధం?. ఇలా ఎందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు ఎలా దెబ్బ తీస్తున్నారు?. వారికి మీరిచ్చే సమాధానం ఏమిటి?. 6). సీఎం చంద్రబాబు ఆరోపించినట్లుగా, లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగితే, ఆ లడ్డూలు తయారు చేసే వారికి ఏ మాత్రం అనుమానం రాలేదా? వారు ఆ మాత్రం గుర్తు పట్టలేరా?. బడి పిల్లలకు రోజుకో మెనూతో మంచి పౌష్టికాహారం అందిస్తూ అమలు చేసిన గోరుముద్దపై, దాదాపు రూ.7 వేల కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం, ఇంత పవిత్రమైన లడ్డూ తయారీలో కల్తీని ఎలా సహిస్తుంది?. ప్రభుత్వానికి దమ్ముంటే, వీటికి సమాధానం చెప్పాలని మాజీ ఎంపీ సవాల్ చేశారు. అదేపనిగా గత మా ప్రభుత్వంపైనా, జగన్‌గారిపైనా దారుణ ఆరోపణలు చేస్తున్న సీఎం చంద్రబాబు, ఆచార, వ్యవహారాల్లో ఎప్పుడూ అపచారాలు చేశారన్న మార్గాని భరత్.. కాళ్లకు బూట్లు వేసుకుని చంద్రబాబు పూజలో పాల్గొన్న ఫోటోలు చూపారు. శ్రీవారి ఆలయం ఎదుట ఉన్న చారిత్రక వెయ్యి కాళ్ళ మండపం కూల్చింది మీరు కాదా?. ఆనాడు ఆ చర్యను స్వామీజీలు ప్రశ్నించింది వాస్తవం కాదా?., పుష్కరాల పేరుతో ఆలయాలు కూల్చింది వాస్తవం కాదా? అని గుర్తు చేసిన మాజీ ఎంపీ, అసలు హిందూ ధర్మం ఇదేనా? ప్రశ్నించారు. అతి పవిత్రమైన స్వామి వారి ప్రసాదంపై ఇంత దుర్మార్గమైన ఆరోపణ చంద్రబాబు తప్ప, వేరెవ్వరూ చేయలేరన్న మార్గాని భరత్, హెరిటేజ్ సూపర్ మార్కెట్‌లో కూడా ఆవు నెయ్యి. తక్కువ ధరకే అమ్ముతున్నారని, మరి దాంట్లో కూడా జంతువులు కొవ్వు కలిపారా? అని నిలదీశారు. ఈ విషయంపై విచారణ జరిపించాలని కోరుతూ, శ్రీ వైయస్ జగన్, ప్రధానమంత్రి, సీజేఐకి లేఖ రాయడంతో, భయపడిన సీఎం చంద్రబాబు, సిట్ ఏర్పాటు చేశారని మాజీ ఎంపీ తెలిపారు. తను స్వయంగా ఏర్పాటు చేసిన సిట్, తనకే వ్యతిరేకంగా రిపోర్ట్ ఇస్తుందా? అని ప్రశ్నించారు. అందుకే సిట్ విచారణపై తమకు నమ్మకం లేదని స్పష్టం చేశారు. తమ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్, సామాన్యులను కూడా ఎంపీలను చేశారని ప్రస్తావించిన మార్గాని భరత్, తాను ఎంపీ అవుతానని ఆర్.కృష్ణయ్య ఎప్పుడూ ఊహించి ఉండరని అన్నారు. అలాంటి కృష్ణయ్య ఇంత దారుణంగా వ్యవహరిస్తారని అనుకోలేదని, సంతలో పశువుల్లా ఎంపీలను సీఎం చంద్రబాబు కొంటున్నారని ఆక్షేపించారు. ఇది పూర్తిగా దిగజారిన చంద్రబాబు రాజకీయాలకు పరాకాష్ట అని అభివర్ణించారు.