మ‌హానాడు కాదు.. ద‌గా నాడు, పీడ‌నాడు

 ప్ర‌జ‌ల‌కు ఏం చేశామో టీడీపీ చెప్పుకోలేక‌పోయారు 

తండ్రీకొడుకుల‌కు జ‌గ‌న్‌ని తిట్ట‌డానికే స‌రిపోయింది

కార్య‌క‌ర్త‌లే చంద్ర‌బాబు, లోకేష్‌ల ప్ర‌సంగాలు చూడ‌లేక‌పోయారు
 
వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నంద‌మూరి లక్ష్మీ పార్వతి

హైద‌రాబాద్‌లోని త‌న నివాసంలో మీడియాతో మాట్లాడిన ల‌క్ష్మీ పార్వ‌తి

హైద‌రాబాద్‌:  కడపలో మహానాడు పెట్టినంత మాత్రాన కడప ప్రజలంతా టీడీపీకే ఓట్లు వేస్తారని తండ్రీకొడుకులు భ్రమ పడుతున్నారు. చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ మహానాడును భ్రష్టుపట్టించారు. ప్రజలకు ఏం చేయాలో చర్చించాల్సి పోయి జగన్ ను తిట్టడానికే మ‌హానాడును వాడుకున్నారు. తండ్రీకొడుకులు ఇద్ద‌రూ ఒక‌ర్నొక‌రు పొగుడుకోవ‌డంతో వ‌చ్చినోళ్లంతా విసిగిపోయారు. తండ్రి సూపర్ సిక్స్ అంటే కొడుకు లోకేష్ పేరు మార్చి ఆరు సూత్రాలు అంటున్నాడు. చంద్రబాబును ఎన్టీఆర్ ఎన్నెన్ని తిట్టిందీ రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ తెలుసు. అధికారంలోకి వ‌స్తే చంద్ర‌బాబును అండ‌మాన్ జైలుకి పంపుతాన‌ని ఎన్టీఆర్ శ‌ప‌థం చేశారు. చంద్రబాబును జామాత ద‌శ‌మ గ్ర‌హం అన్నారు. చంద్ర‌బాబు ప్ర‌మాణ స్వీకారం త‌ర్వాత ఆశీర్వాదం కోసం ఎన్టీఆర్ వ‌ద్ద‌కు వ‌స్తే క‌నీసం తలుపు కూడా తీయ‌లేదు. అలాంటిది ఏఐ టెక్నాలజీ ద్వారా ఎన్టీఆర్ వీళ్లను పొగిడినట్లు చెప్పుకోవ‌డం చంద్ర‌బాబు పనికిమాలిన రాజకీయానికి పరాకాష్ట. ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచి ఆయ‌న చావుకి చంద్ర‌బాబు కార‌ణ‌మ‌య్యాడు. ఈ తతంగ‌మంతా చూసి టీడీపీ జెండాలు, కరపత్రాలను వారి పార్టీ వారే తగలపెట్టుకున్నారు. ప్ర‌జ‌ల‌కిచ్చిన హామీల‌ను అమ‌లు చేయడంలో ఘోరంగా విఫ‌ల‌మైన ప్ర‌భుత్వం, నాడు- నేడు పేరుతో జగన్ స్కూల్స్ ను అభివృద్ధి చేస్తే మేమే చేశామని చంద్రబాబు, లోకేష్ చెప్పుకోవ‌డం మ‌రీ ఘోరం.  అది మహానాడు కాదు. వెన్నుపోటు నాడు.. పీడ నాడు. 

ఎన్టీఆర్ వార‌సుడు లోకేష్ ఎప్ప‌టికీ కాలేడు

తెలుగు సాంప్ర‌దాయం ప్ర‌కారం కూతురు కొడుకైన లోకేష్ ఏ విధంగా ఎన్టీఆర్ కి వారసుడు అవుతారు. నందమూరి కుటుంబం నుంచి వ‌చ్చిన వారే ఎన్టీఆర్ వారసుడుగా ఉంటారు. నారా కుటుంబం నుంచి వ‌చ్చిన లోకేష్ వారసుడు ఎప్ప‌టికీ కాలేడు. చంద్ర‌బాబు అవినీతి రాజ‌కీయానికి మాత్ర‌మే లోకేష్ వార‌సుడు. రాష్ట్రంలో జ‌రుగుతున్న అరాచ‌కాల‌కు, అఘాయిత్యాల‌కు లోకేష్ ర‌చించిన రెడ్ బుక్ రాజ్యాంగ‌మే కార‌ణం. ఇలాంటి ద‌గుల్బాజీ రాజ‌కీయం చేసేవారు ప్ర‌పంచంలో ఈ తండ్రీకొడుకులు త‌ప్ప ఇంకొక‌రు ఉండ‌రు. అవినీతితో కోట్లు సంపాదించ‌డం, వ్య‌వ‌స్థ‌ల‌ను మేనేజ్ చేయ‌డంలో మాత్రం ఈ తండ్రీకొడుకుల‌ను మించిన వారు ఉండ‌రు. తండ్రీకొడుకులు రాష్ట్రానికి పట్టిన పీడ. అమ‌రావ‌తి పేరుతో అడ్డ‌గోలుగా సంపాదిస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేస్తున్నారు. రెడ్ బుక్ పాల‌న చూసి పారిశ్రామికవేత్త‌లు రాష్ట్రంలో అడుగుపెట్ట‌డానికే వ‌ణికిపోతున్నారు. ముంబై నుంచి సినిమా యాక్ట‌ర్ ను పిలిచి ఆమెను అడ్డం పెట్టి జిందాల్ కంపెనీ రాకుండా త‌రిమేశారు. 

విరాళాల పేరుతో న‌ల్ల‌ధ‌నాన్ని మార్చుకుంటున్నారు

మ‌హానాడులో వ‌చ్చిన కార్య‌క‌ర్త‌ల క‌న్నా పోలీసులే ఎక్కువ క‌నిపిస్తున్నారు. చంద్ర‌బాబు ఏడాది పాల‌నపై ఇంటింటికీ వెళ్లి ప్ర‌జ‌ల‌ను క‌ల‌వ‌గ‌లిగే ధైర్యం టీడీపీ నాయ‌కుల‌కు ఉందా?  వైయ‌స్ జ‌గ‌న్ అభివృద్ధిలో రాష్ట్రాన్ని దేశంలోనే మొద‌టిస్థానంలో నిలిపారు. జ‌గ‌న్ పాల‌న‌ను చాలా రాష్ట్రాలు ఆద‌ర్శంగా తీసుకున్నాయి. మ‌న‌సా వాచ క‌ర్మ‌ణా జగన్ మేనిఫెస్టో అమలు చేసి చూపించారు. కరోనాలో ప్రజలను ఆదుకున్న తీరు చూసి ప్ర‌ధాని మోడీ స‌హా జగన్ ను ప్రపంచమే మెచ్చుకుంది. అధికారంలోకి రావాల‌నుకుంటే పాల‌న‌తో ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకోవాలి. అంతే త‌ప్ప ఊర్ల‌కు ఊర్ల‌ను బెదిరించి, ద‌ళితుల‌ను ఊరి నుంచి త‌ర‌మేస్తున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా వారికి తోడ‌య్యాడు. వీరు ముగ్గురూ క‌లిసి రాష్ట్రాన్ని స‌ర్వ‌నాశ‌నం చేశారు. చంద్ర‌బాబు రాజ‌కీయవేత్త కానేకాదు. ప‌ద‌వుల కోస‌మే లోకేష్ ను పొగుడుతున్నారు త‌ప్ప‌, ఆశ‌యాలు లేని వారంటే ఎవ‌రికీ న‌చ్చ‌దు. పేద‌ల కోసం ఎన్టీఆర్ ఎన్నో సంక్షేమ ప‌థ‌కాలు అందించారు. ఆయ‌న సంపూర్ణ మ‌ద్య‌పాన నిషేధం విధిస్తే, చంద్ర‌బాబు ఊరూరా మ‌ద్యం ఏరులై పారిస్తున్నారు. ఆయ‌న పేరును వాడుకుని ప్ర‌జల‌ను మోస‌గిస్తున్నారు. అవినీతితో సంపాదించిన న‌ల్ల ధ‌నాన్ని మ‌హానాడులో విరాళాల పేరుతో మార్చుకుంటున్నాడు. ఎన్టీఆర్ ట్ర‌స్టు పెట్టి విదేశాల నుంచి విరాళాలు తీసుకుంటున్నాడు. బ్లాక్ మ‌నీని వైట్‌గా మార్చుకుంటున్నాడు. డ‌బ్బు సంపాదించ‌డంలో చంద్ర‌బాబుకి ఉన్న అతితెలివి ఎవ‌రికీ ఉండ‌దు. రెండెకరాల‌తో మొద‌లైన చంద్రబాబుకి ఇన్ని ల‌క్ష‌ల కోట్ల ఆస్తులు ఎలా వ‌చ్చాయి? అవినీతి చేయ‌కుండానే దేశంలోనే రిచెస్ట్ సీఎంగా ఎలా ఎదిగాడు? ఇదే విష‌యాన్ని చంద్ర‌బాబు తోడ‌ళ్లుడు ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు కూడా చెప్పారు. చంద్ర‌బాబు ఎంత‌టి అవినీతి ప‌రుడో ప్ర‌జ‌లంద‌రికీ తెలుసు.

Back to Top