పోలవరం నిర్మాణం పూర్తి బాధ్యత కేంద్రానిదే..

సవరించిన అంచనా వ్యయాన్ని తక్షణమే ఆమోదించాలి

ఆర్ అండ్ ఆర్‌ ప్యాకేజీని వెంటనే విడుదల చేయాలి

లోక్‌సభ వైయస్‌ఆర్‌ సీపీ చీఫ్‌ విప్‌ మార్గాని భరత్‌

ఢిల్లీ: ఏపీకి దక్కాల్సిన హక్కులు, నిధులపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంట్‌లో పోరాటం చేస్తోందని, విభజన చట్టం ప్రకారం సవరించిన పోలవరం ప్రాజెక్టు అంచనాలను ఆమోదించాలని కేంద్రాన్ని కోరామని లోక్‌సభ వైయస్‌ఆర్‌ సీపీ చీఫ్‌ విప్‌ మార్గాని భరత్‌ తెలిపారు. పార్లమెంట్‌ ఆవరణలో ఎంపీలు మాగుంట శ్రీనివాసులురెడ్డి, నందిగం సురేష్, మాధవి, సత్యవతిలతో కలిసి మార్గాని భరత్‌ మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం సెక్షన్‌ 90లో పొందుపరిచిన అంశానికి వెంటనే ఆమోదం తెలపాలని కోరామన్నారు. గతంలో కూడా పోలవరం ప్రాజెక్టు అథారిటీ, సెంట్రల్‌ వాటర్‌ కమిషన్, మినిస్ట్రీ ఆఫ్‌ జలశక్తి కూడా సవరించిన పోలవరం అంచనా వ్యయానికి ఆమోదం తెలిపినా.. కేంద్రం ఎందుకు ఆమోదించడం లేదని ప్రశ్నించారు. 

పోలవరం ప్రాజెక్టులో అధిక ప్రాధాన్యతతో కూడుకున్న ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీకి ఆమోదం తెలిపితే నిర్వాసితులకు పూర్తి న్యాయం చేకూరుతుందని, ఈ అంశంపై పార్లమెంట్‌లో పోరాడుతున్నామన్నారు. కాఫర్‌ డ్యామ్‌ వద్ద 40 మీటర్లకు పైగా  నీరు  నిల్వ ఉందని, అది స్పిల్‌ వే ద్వారా డెల్టా ప్రాంతానికి పంపించడం జరుగుతుందన్నారు. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ విడుదల చేయడం వల్ల అక్కడున్న పేదవర్గాలను న్యాయం జరుగుతుందన్నారు. దీనిపై అన్ని రకాలుగా డిమాండ్‌ చేస్తున్నామని చెప్పారు. జాతీయ ప్రాజెక్టుగా గుర్తించిన పోలవరం నిర్మాణానికి కేంద్రం ముందుగా డబ్బులు ఇవ్వాల్సిందిపోయి.. రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు చేసి రీయింబర్స్‌మెంట్‌కు కేంద్రానికి పంపించే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌ అన్ని రకాలుగా నష్టపోయిందని, ప్రత్యేక హోదాపై చర్చకు ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభను స్తంభింపజేస్తున్నారన్నారు. గతంలో బీజేపీ నేతగా ఉన్న వెంకయ్యనాయుడు ఏపీకి 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారని గుర్తుచేశారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top