ఆర్‌డ‌బ్ల్యూఎస్ కాంట్రాక్ట్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి 

 ధర్నా చేస్తున్న కార్మికులకు వైయ‌స్ఆర్‌సీపీ సంఘీభావం 

 ధర్నా చౌక్‌లో కార్మికులకు మద్దతు తెలిపిన దేవినేని అవినాష్, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు 

విజయవాడ: ఆర్‌డబ్ల్యూఎస్ (గ్రామీణ మంచినీటి సరఫరా) కాంట్రాక్ట్ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం విజయవాడ ధర్నా చౌక్‌లో చేపట్టిన ఆందోళనకు వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు సంఘీభావం తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు  దేవినేని అవినాష్ , మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ , మాజీ ఎమ్మెల్యే  మల్లాది విష్ణు ధర్నా శిబిరాన్ని సందర్శించి కార్మికులకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆర్‌డబ్ల్యూఎస్ కాంట్రాక్ట్ కార్మికులు ఎలాంటి అతిరథ మహారథ కోరికలు కోరడం లేదని, వారికి రావాల్సిన వేతనాలు సకాలంలో చెల్లించడం, ఈఎస్‌ఐ, పీఎఫ్ వంటి చట్టబద్ధ హక్కులు కల్పించాలని మాత్రమే కోరుతున్నారని అన్నారు. సంబంధిత శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ కార్మికులకు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. ఫోటోలకు ఫోజులు ఇవ్వడం కంటే కార్మికుల సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ సమస్యను పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

 దేవినేని అవినాష్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాలకు సురక్షితమైన తాగునీరు అందిస్తున్న కార్మికులే నేడు తమ హక్కుల కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి రావడం ప్రభుత్వ వైఫల్యమన్నారు. రెండు రోజులుగా ధర్నా చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం, శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ వారిని కలవకపోవడం దురదృష్టకరమన్నారు. జీతాలు లేకుండా ఎలా పనిచేయాలని కార్మికులు ప్రశ్నిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం వైయస్ జగన్ స్పందించాల్సిన పరిస్థితిని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు.

మాజీ ఎమ్మెల్యే  మల్లాది విష్ణు మాట్లాడుతూ, ఆర్‌డబ్ల్యూఎస్ కాంట్రాక్ట్ కార్మికులకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చిన్న కార్మికుల సమస్యలను కూడా పరిష్కరించలేని ప్రభుత్వం ప్రజల సమస్యలను ఎలా అర్థం చేసుకుంటుందని ప్రశ్నించారు. సంబంధిత శాఖకు మంత్రి అయిన పవన్ కళ్యాణ్ తన శాఖలోని కార్మికుల సమస్యలను కూడా పరిష్కరించలేకపోతున్నారని విమర్శించారు. గ్రామీణ ప్రాంతాలకు నిరంతరాయంగా తాగునీటి సరఫరా కొనసాగాలంటే ఈ కార్మికులకు ప్రభుత్వం వెంటనే అండగా నిలిచి వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు.

Back to Top