కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి

జూనియర్‌ న్యాయవాదులకు నెలకు రూ.10 వేల స్టైఫండ్‌ వెంటనే అమలు చేయాలి

న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం నంద్యాల‌లో వైయ‌స్ఆర్‌సీపీ లీగల్‌ సెల్‌ రిలే నిరాహార దీక్ష

 సంఘీభావం తెలిపిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి

నంద్యాల: కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాల‌ని నంద్యాల నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు ఎం.ప్రతాప్‌రెడ్డి డిమాండ్ చేశారు. న్యాయవాదుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నంద్యాలలో వైయ‌స్ఆర్‌సీపీ లీగల్‌ సెల్‌ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. నంద్యాల టూ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ సమీపంలో నంద్యాల నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు ఎం.ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన దీక్షకు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు.

ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు జూనియర్‌ న్యాయవాదులకు ప్రతి నెల రూ.10 వేల స్టైఫండ్‌ను వెంటనే అమలు చేయాలని న్యాయవాదులు కోరారు. వృత్తిలోకి కొత్తగా వచ్చిన న్యాయవాదులు ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన హామీని ఆలస్యం చేయకుండా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. జూనియర్‌ న్యాయవాదుల నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక ట్రైనింగ్‌ అకాడమీని ఏర్పాటు చేసి వృత్తిపరమైన శిక్షణ అందించాలని కోరారు.

న్యాయవాదుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి

న్యాయస్థానాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంతో పాటు ప్రతి కోర్టులో ప్రజలకు ఉచిత న్యాయసేవలు అందుబాటులో ఉండేలా లీగల్‌ కియోస్క్‌లను ఏర్పాటు చేయాలని కోరారు. మరణించిన న్యాయవాదుల కుటుంబాలకు రూ.10 లక్షల డెత్‌ బెనిఫిట్‌ను వెంటనే మంజూరు చేయాలని, ప్రతి న్యాయవాదికి ఇంటి స్థలం కేటాయించి ప్రత్యేకంగా ‘అడ్వకేట్స్‌ కాలనీ’ ఏర్పాటు చేయాలని కోరారు. న్యాయవాదులు, వారి కుటుంబాలకు ప్రభుత్వ ఆధ్వర్యంలో సమగ్ర హెల్త్‌ స్కీమ్‌ను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి

రాయలసీమ ప్రాంత న్యాయవాదుల ఆకాంక్షలకు అనుగుణంగా కర్నూలులో హైకోర్టును వెంటనే ఏర్పాటు చేయాలని దీక్షలో ప్రధానంగా కోరారు. ఈ అంశంపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుని కార్యాచరణ ప్రారంభించాలని కోరారు. అదే విధంగా నంద్యాల జిల్లా కోర్టును కర్నూలు యూనిట్‌ నుంచి విడదీసి ప్రత్యేక జిల్లా జడ్జి డివిజన్‌ యూనిట్‌గా ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.

ఎన్‌రోల్‌మెంట్‌ ఫీజు పెంపుతో యువ న్యాయవాదులపై భారం

కొత్త న్యాయవాదుల ఎన్‌రోల్‌మెంట్‌ ఫీజును రూ.750 నుంచి రూ.22,500కు పెంచడం వల్ల వృత్తిలోకి అడుగుపెడుతున్న యువ న్యాయవాదులపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకుని యువ న్యాయవాదులకు ఊరట కల్పించాలని కోరారు. న్యాయవాదుల సంక్షేమం కోసం చేస్తున్న డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి పరిష్కరించాలని వైయ‌స్ఆర్‌సీపీ లీగల్‌ సెల్‌ కోరింది. న్యాయవాదుల హక్కుల పరిరక్షణ కోసం చేపట్టిన రిలే నిరాహార దీక్షకు న్యాయవాదులంతా సంఘీభావంగా నిలవాలని పిలుపునిచ్చింది. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేసింది.


 

Back to Top