కరోనాతో వైయ‌స్ఆర్‌సీపీ కార్పొరేటర్ క‌న్నుమూత‌

ప‌లువురు నేత‌లు సంతాపం
 

వైయ‌స్ఆర్ జిల్లా: కరోనా మహమ్మారి వైయ‌స్ఆర్ సీపీ కార్పొరేట‌ర్‌ను  బలి తీసుకుంది. వైయ‌స్సార్‌జిల్లా కేంద్రం కడప 22వ డివిజన్‌ కార్పొరేటర్‌ బోలా పద్మావతి(61) కరోనాతో కన్నుమూశారు. వారం రోజులుగా కరోనాతో ఇబ్బంది పడుతున్న ఆమె రిమ్స్‌లో చికిత్స పొందుతూ  తుది శ్వాస విడిచారు. కడప మున్సిపల్‌ చరిత్రలో ఆరు పర్యాయాలు కాంగ్రెస్‌ తరపున కౌన్సిలర్‌గా ఎన్నికైన ఆమె 2004కు ముందు ఇన్‌చార్జి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా పనిచేశారు.

2005లో కడప నగరపాలక సంస్థగా ఆవిర్భవించినప్పటి నుంచి వరుసగా మూడు సార్లు కార్పొరేటర్‌గా గెలుపొందారు. ఇందులో ఒకసారి కాంగ్రెస్‌ తరుపున, రెండుసార్లు వైయ‌స్సార్‌సీపీ తరుపున కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసేవారు. వైయ‌స్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పిలుపు మేరకు అనేక దీక్షలు, ధర్నాలు, ఆందోళనల్లో పాలు పంచుకున్నారు. తద్వారా పార్టీ బలోపేతానికి ఇతోదికంగా కృషి చేశారు. ఇందువల్లే బోలా పద్మావతి ఇన్నిసార్లు ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యారని చెప్పవచ్చు. బెస్త సంఘం జిల్లా అధ్యక్షురాలిగా ఉన్న ఆమె ప్రస్తుతం ఆ సంఘానికి గౌరవాధ్యక్షురాలిగా ఉన్నారు.  

పలువురి నివాళి 
కార్పొరేటర్‌ బోలా పద్మావతి మృతిపట్ల డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, మేయర్‌ సురేష్‌బాబు సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె మరణం వైయ‌స్సార్‌సీపీకి తీరనిలోటన్నారు. వైయ‌స్సార్‌సీపీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు జి. గరుడాద్రి ఆమె మృతికి సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.   

ఎంపీ దిగ్భ్రాంతి 
కార్పొరేటర్‌ బోలా పద్మావతి మృతి పట్ల కడప ఎంపీ వైయ‌స్‌ అవినాష్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రెండు, మూడు రోజులుగా రిమ్స్‌లో ఆమెకు మెరుగైన వైద్యం అందించడానికి వైద్యులతో పలుమార్లు సంప్రదింపులు జరిపినా ఫలితం లేకుండా పోయిందని ఆవేధన వ్యక్తం చేశారు. సీనియర్‌ నాయకురాలైన బోలా  పద్మావతి మృతి పార్టీకి తీరనిలోటన్నారు. ఆమె మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు. వారి కుటుంబానికి పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని చెప్పారు.  

Back to Top