నెల్లూరు: శ్రీశైలం ప్రాజెక్టులో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ రాష్ట్ర అవసరాలకు వినియోగించుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి కాకాణి మండిపడ్డారు. శ్రీశైలం నుంచి సోమశిల, కండలేరు జలాశయాలకు నీటిని ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ను వినియోగించి వెంటనే నీటిని తరలించకుండా ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందని నిలదీశారు. శ్రీశైలంలో సుమారు 71 శాతం మేర నీరు అందుబాటులో ఉన్నా, ఆ నీటిని వినియోగించుకోకపోవడం వెనుక ప్రభుత్వ ఉద్దేశమేంటని ప్రశ్నించారు. మరోవైపు తెలంగాణ శ్రీశైలం నీటిని విస్తృతంగా వినియోగించుకుంటున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాకాణి అన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం చంద్రబాబు ఏపీ రైతుల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారా అని నిలదీశారు. నెల్లూరు జిల్లాలో జలాశయాలు అడుగంటిపోయే పరిస్థితి ఏర్పడిందని, మొదటి పంటకే సాగునీటి కొరత రావడంతో రైతాంగం ఆందోళనకు సిద్ధమవుతోందని తెలిపారు. శ్రీశైలం నీటిని సమర్థంగా వినియోగించి నెల్లూరు, రాయలసీమ రైతులకు సాగునీరు అందించాలని మాజీ మంత్రి కాకాణి స్పష్టం చేశారు.