నెల్లూరు: విద్యార్థుల సమస్యలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించిన వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడంపై మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ నేత డాక్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. విద్యార్థి విభాగం అధ్యక్షుడు అశ్రిత్‌తో పాటు పలువురు నాయకులను హౌస్ అరెస్ట్ చేయడంపై వైయస్ఆర్‌సీపీ శ్రేణులు ఆందోళన చేపట్టగా, కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సంఘీభావం తెలిపారు. అనంతరం రోడ్డుపై నిరసన వ్యక్తం చేస్తూ విద్యార్థుల తరఫున వైయస్ఆర్‌సీపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో తమ సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసేందుకు వెళ్లిన విద్యార్థి నాయకులను అడ్డుకోవడం, అరెస్టులు చేయడం ఏమిటని ప్రశ్నించారు. డీఎస్సీ వ్యవహారం, ఉద్యోగ భృతి, వసతి దీవెన వంటి అంశాలపై విద్యార్థులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు వినతిపత్రం ఇవ్వడం కూడా నేరంగా మారిందా అని కాకాణి నిలదీశారు. విద్యార్థుల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం వారిని పోలీసులతో అడ్డుకోవడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, ప్రశ్నించే గొంతులను అణచివేయడం ద్వారా సమస్యలు పరిష్కారం కావని కాకాణి పేర్కొన్నారు. డీఎస్సీ వ్యవహారంలో నష్టపోయిన అభ్యర్థులు, ఉద్యోగ భృతి కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు, వసతి దీవెన కోసం ఎదురుచూస్తున్న విద్యార్థుల సమస్యలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందేనని స్పష్టం చేశారు.