తాడేపల్లి: విజయవాడలో గాదె సాయికృష్ణ అనే యువకుడిని పోలీస్ స్టేషన్‌లో నిలువునా కొట్టి చంపిన ఉదంతం ఇవాళ కీలక మలుపు తిరిగిందని వైయస్ఆర్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన రిపోర్టు ఆధారంగా కృష్ణలంక సీఐ నాగరాజును ఏకైక నిందితుడిగా (Sole Accused) చూపిస్తూ పోలీసులు ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ (FIR No. 107/2026) నమోదు చేశారన్నారు. సాయికృష్ణ లాకప్ డెత్ ఉదంతంపై ఎట్టకేలకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కూటమి ప్రభుత్వ నేర అంగీకార పత్రమేనని ఆయన స్పష్టం చేశారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇది ప్రభుత్వం సుమోటోగా నమోదు చేసిన కేసు కాదని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన సుదీర్ఘ పోరాటం, నిన్న సాయంత్రం మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు స్వయంగా బాధితుల ఇంటికి వెళ్లి అరాచకాన్ని బట్టబయలు చేసిన తర్వాతే.. భయపడి పోలీసులు ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేశారని స్పష్టం చేశారు. వైయస్.జగన్ పర్యటన తర్వాతే ముఖ్యమంత్రి చంద్రబాబుకు బాధితులు గుర్తొచ్చారని, నేడు వారిని పిలిపించుకుని 'న్యాయం చేస్తాం' అని చెప్పడం కేవలం నష్టనివారణ చర్యల్లో భాగమేనని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన ఇంకా ఏమన్నారంటే... - కూటమి ప్రభుత్వ నేర అంగీకారం.. సాయికృష్ణ ఉదంతంపై కేసు నమోదు చేయడం ద్వారా పోలీస్ స్టేషన్‌లో ఒక యువకుడిని దారుణంగా కొట్టి చంపిన మాట నిజమేనని కూటమి ప్రభుత్వం అధికారికంగా ఒప్పుకుంది. మే 28వ తేదీనే నగర కమిషనరేట్‌లో బాధితుడి తల్లి, అడ్వకేట్ దుర్గ రాతపూర్వకంగా కస్టోడియల్ డెత్ జరిగినట్లు అనుమానం ఉందని ఫిర్యాదు ఇచ్చారు. ఆ రిసిప్ట్ ఇప్పటికీ మా వద్ద ఉంది. మరి ఆ రోజు నుంచి వైయస్ జగన్ గారు ఆ ఇంటికి వెళ్లేవరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని పరిపాలించడం లేదా? అప్పటివరకు మీ కళ్లు ఎందుకు మూసుకుపోయాయి? సాయికృష్ణను మార్కాపురం నుంచి పట్టుకుని వచ్చి, రెండు రోజుల పాటు ఒక హోటల్‌లో నిర్బంధించి చిత్రహింసలు పెట్టిన తర్వాతే సీఐ నాగరాజుకు అప్పగించారు. ఈ హత్య ఒక్క సీఐ మాత్రమే చేయలేదు.. కింద నుంచి పైవరకు అందరి పాత్ర ఉంది. శవాన్ని మాయం చేసి దహనం చేయడం వెనుక ఉన్నతాధికారుల హస్తం ఉంది. ఇప్పుడు కేవలం నాగరాజు ఒక్కడి మీదే నెపం నెట్టేసి కేసును క్లోజ్ చేయాలని చూస్తున్నారు. - దళిత యువకుడు 'క్రాంతి కుమార్' లైవ్ ఆత్మహత్య. కూటమి రాజ్యంలో పోలీస్ వ్యవస్థ ఎంత అరాచకంగా మారిందో చెప్పడానికి పేరుపోగు క్రాంతి కుమార్ అనే దళిత యువకుడి మరణమే సాక్ష్యం. సాయికృష్ణ ఉదంతం వెలుగులోకి వచ్చిన తర్వాత క్రాంతి కుమార్ వాట్సప్‌లో రికార్డ్ చేసిన సెల్ఫీ వీడియో బయటకు వచ్చింది. "నేను మాదిగ కులంలో పుట్టినందువల్లే సీఐ నాగరాజు నన్ను ఇంతలా వేధిస్తున్నాడు, కొడుతున్నాడు.. నేను బ్రతకలేకపోతున్నాను" అని లైవ్ వీడియోలో ఏడుస్తూ గుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్నాడు. క్రాంతి కుమార్ తండ్రి కమిషనరేట్‌లో తన కుమారుడు కనిపించడం లేదని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు, పైగా సదరు సీఐని రక్షించారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు, కమిషనరేట్ అధికారులు కళ్లు మూసుకోబట్టే.. ఇవాళ ధైర్యం వచ్చి సాయికృష్ణను లాకప్ డెత్ చేసి చంపేశారు. - సాయికృష్ణ బ్రతికే ఉంటే కోర్టులో హాజరుపర్చండి.. బొలిశెట్టికి అంబటి సవాల్! నేను నవీన్ రెడ్డి మృతదేహాన్ని చూపించి ఫేక్ ప్రచారం చేస్తున్నానని ఎమ్మెల్యే బొలిశెట్టి అంటున్నారు. సాయికృష్ణ గనుక నిజంగా బ్రతికే ఉంటే.. రేపు జూన్ 29న హైకోర్టులో ప్రవేశపెట్టండి, అప్పుడు నాది తప్పు అని ఒప్పుకుంటాను. నాపై ఇప్పటికే 36 కేసులు పెట్టారు, 18 రోజులు జైల్లో పెట్టారు.. మీ కేసులకు భయపడేది లేదు. ధైర్యం ఉంటే తాడేపల్లిగూడెంలో నాపై కేసు పెట్టండి, నేనే కోర్టుకు, పోలీస్ స్టేషన్‌కు వచ్చి సమాధానం చెబుతాను. సాయికృష్ణ కుటుంబం పవన్ కళ్యాణ్, జనసేన గెలుపు కోసం కష్టపడి పనిచేసిన కుటుంబం. మీ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తను పోలీసులు చంపేస్తే పలకరించడానికి వెళ్లని జనసేన నేతలు.. రాజీ కోసం బాధిత కుటుంబానికి రూ. 10 లక్షలు, రూ. 25 లక్షలు ఇస్తామని బేరాలు పెడతారా? ఈ బేరసారాల విషయాన్ని మీ పార్టీకి చెందిన నవరంగ్ అనే వ్యక్తి బయటపెడితే సమాధానం చెప్పలేక మాపై బురద జల్లుతారా? - చితాభస్మం ఇవ్వలేని చంద్రబాబు.. ఈ కేసులో ఏ-1 మీరే. ఒక తల్లి ఆర్ద్రత, ఆవేదన చూసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి అండగా నిలబడింది. "నా బిడ్డ ఆఖరి కార్యక్రమం చేసుకుంటాను.. దోశెడు చితాభస్మం ఇప్పించండి" అని ఆ తల్లి విజయలక్ష్మి వేడుకుంటోంది. కనీసం గుప్పెడు చితాభస్మం కూడా ఇప్పించలేని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ కుటుంబానికి అండగా ఉంటానని అబద్ధాలు చెబుతున్నారు. సాయికృష్ణ లాకప్ డెత్ దారుణ హత్య కేసులో ఏ-1: నారా చంద్రబాబు నాయుడు (ముఖ్యమంత్రి), ఏ-2: అనిత (హోంమంత్రి), ఏ-3: హరీష్ కుమార్ గుప్తా (డీజీపీ), ఏ-4: రాజశేఖరబాబు (పోలీస్ కమిషనర్), ఏ-5 మాత్రమే నాగరాజు (కృష్ణలంక సీఐ), వీరితో పాటు లాఠీలు తెచ్చిన వారు, కొట్టిన వారు, శవాన్ని మాయం చేసిన పోలీసులందరినీ నిందితులుగా చేర్చాల్సిందే. - సాయికృష్ణ, క్రాంతి కుమార్ మరణాలపై సీబీఐ (CBI) విచారణ జరగాలి. వ్యక్తులుగా సాయికృష్ణ బంధువులు నవరంగ్, నాగేశ్వరరావు, న్యాయవాది దుర్గలు చేసిన న్యాయపోరాటం చాలా గొప్పది. వారు గొంతెత్తి పోరాడబట్టే ఈ రోజు క్రాంతి కుమార్ ఉదంతం కూడా బయటపడింది. చంపేసి రౌడీ అని ముద్రవేయడం చంద్రబాబుకు అలవాటుగా మారింది. గతంలో వంగవీటీ మోహన్ రంగాను చంపేసి కూడా ఈనాడే, ఆంధ్రజ్యోతి పత్రికలు రౌడీ అని ముద్రవేశాయి. కుళ్లిపోతున్న పోలీస్ వ్యవస్థను గాడిలో పెట్టాలన్నదే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం..అందుకే పేరుపోగు క్రాంతి కుమార్ ఆత్మహత్య, గాదె సాయికృష్ణ లాకప్ డెత్.. ఈ రెండు మరణాలపై తక్షణమే సీబీఐ (CBI) విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం. ఒక ఐపీఎస్ అధికారి లేదా కమిషనర్ పరిధిలో జరిగే విచారణతో నిజాలు బయటకు రావు. సీబీఐ విచారణ వేసే వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బాధితుల పక్షాన నిలబడి న్యాయస్థానాల్లో, ప్రజా క్షేత్రంలో తన పోరాటాన్ని ఆపదని అంబటి రాంబాబు హెచ్చరించారు.