తాడేపల్లి: ధాన్యానికి మద్దతు ధర పెంపు కేవలం 3 శాతం అనేది దారుణమని ఏపీ అగ్రి మిషన్ మాజీ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి మండిపడ్డారు. పంటలకు మద్దతు ధరపై తాజాగా 2025-26 సీజన్‌కు సంబంధించి కేంద్రం చేసిన ప్రకటనపై ఏపీ అగ్రి మిషన్ మాజీ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి స్పందించారు. ఈ మేరకు ఆయన మీడియాకు ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో ఎంవీఎస్ నాగిరెడ్డి ఏమన్నారంటే... `ఏపీలో అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యేది వరి పంట, దీనికి ఈ సారి మద్దతు ధరను క్వింటాకు రూ. 69 (కిలోకి 69 పైసలు) మాత్రమే పెంచడంపై రైతాంగం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ధాన్యానికి మద్దతు ధర పెంపు కేవలం 3 శాతం అనేది దారుణం, మిగిలిన పంటలకు 5 నుంచి 10 శాతం పెంచారంటే ఉత్పత్తి వ్యయం పెరిగిందని కేంద్రం ఒప్పుకున్నట్లే కదా, మరి ధాన్యం విషయంలో కూడా ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది కదా, కానీ క్వింటాకు రూ. 69 మాత్రమే పెంచడం ఎంతవరకు సమంజసం, గతంలో ఏపీలో సాగు సమ్మె జరిగినప్పుడు కేంద్రం నుంచి వచ్చిన కమిటీ ఇక్కడ ప్రత్యక్షంగా పరిశీలించి ధాన్యం ఉత్పత్తి వ్యయం ఎక్కువగా ఉందని రిపోర్ట్ కూడా అందజేసింది. అందుకే రైతులు నష్టపోతున్నారని వారు స్పష్టంగా తమ నివేదికలో పేర్కొన్నారు. ఒక్క ధాన్యం విషయంలోనే కాదు మిగిలిన వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో కూడా కేంద్రం తన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి అని కోరుతున్నాను. మద్దతు ధరలు కనుక లేకపోతే యావత్ రైతాంగం అంతా తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేయబడతారు. ఈ విషయంలో పాలకులు, మేధావులు వెంటనే తిరిగి ఆలోచించాలి` అని నాగిరెడ్డి కోరారు.