విజయవాడ: మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డిపై దుర్గమ్మ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రార్థించారు. ఆయన ద్వారా రాష్ట్రంలోని పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు నిరంతరం మేలు జరిగేలా అమ్మవారు ఆశీర్వదించాలని కోరుకున్నారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మహర్నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తన స్వగృహంలో వేద పండితులు, ఘనాపాఠీలకు ఘనంగా సత్కార కార్యక్రమం నిర్వహించారు. మల్లాది బాలా త్రిపుర సుందరమ్మ – మల్లాది వెంకట సుబ్బారావు ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 40 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం దాదాపు 40 సంవత్సరాలుగా తమ స్వగృహంలో దసరా సందర్భంగా వేద పండితులను, వేద పురుషులను సత్కరించడం ఆనవాయితీగా కొనసాగుతోందని మల్లాది విష్ణు తెలిపారు. ఈ ఏడాది కూడా సుమారు 50 మంది ఘనాపాఠీలు, వేద పండితులను ఘనంగా సత్కరించినట్లు పేర్కొన్నారు. వేదం అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనదని, వేదం ఉన్నచోట అమ్మవారు కొలువై ఉంటారని మల్లాది విష్ణు అన్నారు. వేద పండితులను గౌరవించడం ద్వారా అమ్మవారి ఆశీస్సులు అందరికీ లభిస్తాయని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి కనకదుర్గమ్మ ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మల్లాది విష్ణు ఆకాంక్షించారు. రాష్ట్రంలో పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ఎల్నినో వంటి ప్రకృతి వైపరీత్యాల ప్రభావం లేకుండా రాష్ట్రానికి మేలు జరగాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ విజయదశమి, దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.