దాడులకు భయపడం.. ప్రజాక్షేత్రంలోనే ఎదుర్కొని గుణపాఠం చెబుతాం

 వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్త దామును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్‌కుమార్

చిత్తూరు జిల్లా: పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండలం గొందివాల్లూరులో దాడిలో గాయపడిన వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్త దామును ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్‌కుమార్ ఆదివారం చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో పరామర్శించారు. మండల కన్వీనర్ ధనుంజయరెడ్డితో కలిసి దాము ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితుడి కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన డాక్టర్ సునీల్‌కుమార్.. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అలజడి సృష్టించి, ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయాలనే ఉద్దేశంతో కూటమి నాయకులు కుట్రలు, పన్నాగాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఇలాంటి దాడులకు వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు ఎవరూ భయపడరని స్పష్టం చేశారు. ప్రజాక్షేత్రంలోనే ఈ అరాచకాలను ఎదుర్కొని, ప్రజాస్వామ్య పద్ధతిలో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.

Back to Top