నంద్యాల జిల్లా: అమరావతి రాజధాని అంశంపై అసెంబ్లీలో ఎన్ని సార్లు తీర్మానాలు చేస్తారని, ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఇంకా ఎన్ని సార్లు మోసం చేస్తారని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ప్రశ్నించారు. బనగానపల్లె పట్టణంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అమరావతికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు కోల్పోయిన రైతులకు ముందుగా హామీ ఇచ్చిన ప్లాట్లను చూపించాలని, వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అమరావతి కోసం భూములు త్యాగం చేసిన రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇప్పటివరకు అమరావతిలో తాత్కాలిక నిర్మాణాలు మాత్రమే ఉన్నాయని, శాశ్వత భవనాల నిర్మాణం జరగలేదని తెలిపారు. అమరావతి రాజధాని ప్రజల కోసం కాకుండా, కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగపడుతోందని ఆరోపించారు.రాజధాని కోసం ప్రభుత్వ భూమి 30 వేల ఎకరాలు సరిపోతాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం కాగా, కూటమి ప్రభుత్వం లక్ష ఎకరాలకు పైగా భూములు సేకరించేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ అభివృద్ధి పేరుతో ఇతర ప్రాంతాలు వెనుకబడ్డాయని, మళ్లీ ఆ పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతోనే అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి కోసం తమ పార్టీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అవుకు మండల కన్వీనర్ కాటసాని తిరుపాల్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి సిద్దంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి అంబటి రవి కుమార్ రెడ్డి, నాయకులు డీవీ శేషి రెడ్డి, వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.