రెండేళ్ల వెన్నుపోటుపై నిర‌స‌న అన్నందుకే కేఎన్నార్‌పై సిట్ వేధింపులు 

డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ భాగంగానే అక్ర‌మ‌ లిక్క‌ర్ కేసులో విచార‌ణ 

స్ప‌ష్టం చేసిన వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి, మాజీ ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాదరెడ్డి

ప్రొద్దుటూరులోని త‌న క్యాంప్ కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి, మాజీ ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాదరెడ్డి

వైయ‌స్ జ‌గ‌న్ స‌న్నిహితులంద‌ర్నీ రెండేళ్లుగా వేధిస్తున్నారు

త‌ప్పుడు వాంగ్మూలాలు సృష్టించ‌డం మిన‌హా చేసిందేమీ లేదు

అక్రమ లిక్క‌ర్ కేసులో ఒక్క రూపాయి కూడా రిక‌వ‌రీ చేయ‌లేదు

వైయ‌స్ జ‌గ‌న్ ఆత్మ‌స్థైర్యం దెబ్బ‌తీయ‌డం చంద్రబాబుకి సాధ్యం కాదు

పీఏల ద్వారా ఆర్థిక లావాదేవీలు చేయ‌డం చంద్ర‌బాబుకి అల‌వాటు

ఆ లెక్క‌న రెండెక‌రాల‌తో మొద‌లుపెట్టి ల‌క్ష కోట్లు సంపాదించిన చంద్ర‌బాబునీ విచారించాలి

మాజీ ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాదరెడ్డి డిమాండ్ 

ప్రొద్దుటూరు: రెండేళ్ల వెన్నుపోటుపై నిర‌స‌న కార్య‌క్రమాల‌కు వైయ‌స్ జ‌గ‌న్ గారు పిలుపునివ్వ‌డంతో డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్‌లో భాగంగానే కేఎన్నార్‌ని అక్ర‌మ లిక్క‌ర్ కేసులో విచార‌ణ పేరుతో సిట్ వేధిస్తోంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి, మాజీ ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. ప్రొద్దుటూరులోని త‌న క్యాంప్ కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ అక్ర‌మ కేసులు, త‌ప్పుడు ప్ర‌చారాల‌తో వైయ‌స్ జ‌గన్ గారి ఆత్మ‌విశ్వాసాన్ని దెబ్బ‌తీయ‌డం చంద్ర‌బాబుకి సాధ్యం కాద‌ని చెప్పారు. 2007 నుంచి వ్యాపారాలు చేస్తూ ఇన్‌కం ట్యాక్సులు క‌ట్టే వ్య‌క్తి రూ. 19 కోట్లు లావాదేవీలు చేయ‌డం కూడా త‌ప్పేనా అని ప్ర‌శ్నించారు. ఆ లెక్క‌న తండ్రి ఖ‌ర్జూర నాయుడు ఇచ్చిన రెండెక‌రాల‌తో ల‌క్ష కోట్లు ఆస్తులు సంపాదించిన చంద్ర‌బాబుని కూడా విచారించాల‌ని డిమాండ్ చేశారు. ప‌చ్చ‌ళ్లు అమ్మిన రామోజీకి, సైకిల్‌పై తిరిగి కిరోసిన్ అమ్మిన రాధాకృష్ణ‌కి వేల కోట్ల ఆస్తులు ఎలా వ‌చ్చాయో కూడా విచార‌ణ చేస్తే వారి ఆర్థిక నేరాలు కూడా వెలుగులోకి వ‌స్తాయి కదా అని ప్ర‌శ్నించారు. వైయ‌స్ జ‌గ‌న్ గారికి సన్నిహితంగా ఉన్న ప్రతి ఒక్క‌ర్నీ వేధించ‌డానికి జ‌ర‌గని ఒక లిక్క‌ర్ కేసును సృష్టించి వేధించ‌డమే చంద్ర‌బాబు ప‌నిగా పెట్టుకున్నాడ‌ని, త‌ప్ప‌డు వాంగ్మూలాలు సృష్టించ‌డం మిన‌హా స్కాం జ‌రిగిన‌ట్టు ఒక్క రూపాయి అయినా రిక‌వ‌రీ చేశారా అని ప్ర‌శ్నించారు. వైయ‌స్ జ‌గ‌న్ గారి అపాయింట్‌మెంట్లు చూడ‌ట‌మే కేఎన్నార్ ప‌ని అని, చంద్ర‌బాబు మాదిరిగా పీఏ ద్వారా ఆర్థిక లావాదేవీలు జ‌ర‌ప‌డం వైయ‌స్ జ‌గ‌న్‌కి తెలియ‌ద‌ని రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద‌రెడ్డి ఎద్దేవా చేశారు. 
ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే....

పాల‌న‌లో విఫ‌ల‌మై డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్‌

పాల‌నా ప‌రంగా చంద్ర‌బాబు రెండేళ్ల‌లో పూర్తిగా విఫ‌ల‌మ‌య్యాడు. ప్ర‌భుత్వంపై ఎక్క‌డ చూసినా ప్ర‌జ‌ల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్తం అవుతోంది. రెండేళ్ల వెన్నుపోటుపై నిర‌స‌న కార్య‌క్ర‌మాల‌కు మాజీ ముఖ్య‌మంత్రి వైయస్ జ‌గ‌న్ గారు పిలుపునిచ్చారు. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌జ‌ల దృష్టిని మ‌ళ్లించ‌డానికి చంద్ర‌బాబు డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్‌కి తెర‌లేపాడు. ప్ర‌జ‌లు త‌న పాల‌నా వైఫ‌ల్యాల గురించి చ‌ర్చించ‌కుండా త‌ల్లి చెల్లి, గొడ్డ‌లి పార్టీ, వివేకా మ‌ర్డ‌ర్‌, లిక్క‌ర్ కేసు, తిరుమ‌ల ల‌డ్డూ అంటూ డైవ‌ర్ష‌న్ రాజ‌కీయం చేస్తున్నాడు. పాత‌దే అయిన అక్ర‌మ లిక్క‌ర్ కేసును కొత్త కోణంలో చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. ఎలాగైనా వైయ‌స్ జ‌గ‌న్ గారిని అక్ర‌మంగా జైలుకు పంపాల‌నుకున్న చంద్ర‌బాబు కుట్ర‌లు ఫ‌లించ‌కపోవ‌డంతో అక్ర‌మ లిక్క‌ర్ కేసును డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్‌కి వాడుకుంటున్నాడు. ప్ర‌జ‌ల హృద‌యాల్లో గొప్ప స్థానం సంపాదించుకున్న‌ వైయ‌స్ జ‌గ‌న్ గారిని నేర చ‌రిత్ర క‌లిగిన వాడిగా చిత్రీక‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. అనుకూల అధికారుల‌తో ఒక సిట్ ను ఏర్పాటు చేసి స‌రైన ఆధారాలు లేక‌పోయినా అక్ర‌మ లిక్క‌ర్ కేసును సృష్టించి అందులో మిథున్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి, రాజ్ కేసిరెడ్డి, ధ‌నుంజ‌య్‌రెడ్డి, కృష్ణ‌మోహ‌న్‌రెడ్డి వంటి వారిని వేధించారు. వైయ‌స్ జ‌గ‌న్ గారి పేరు చెప్పాల‌ని ఒత్తిడి చేసినా స‌ఫ‌లం కాలేదు. ఈ అక్ర‌మ లిక్క‌ర్ కేసుల్లో అంద‌రికీ న్యాయ‌స్థానాలు బెయిల్ మంజూరు చేసింది కూడా. దీంతో వైయ‌స్ జ‌గ‌న్ గారిని అక్ర‌మంగా అరెస్ట్ చేయాల‌ని అమిత్‌షా ని క‌లిసినా ఆయ‌న కూడా స‌సేమిరా అన‌డంతో ఆ ప్ర‌య‌త్నం కూడా బెడిసికొట్టింది. 

2007 నుంచి కేఎన్నార్ ఇన్‌కం ట్యాక్స్ చెల్లిస్తున్నాడు 

కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాటైన కొత్త‌లో లిక్క‌ర్ కుంభ‌కోణంలో ల‌క్ష కోట్లు దోచుకున్నార‌ని ప్ర‌చారం చేశారు. త‌ర్వాత రూ. 30 వేల కోట్లు అన్నారు. చివ‌రికి రూ.3 వేల కోట్లేన‌ని మాట‌మార్చారు. కానీ రెండేళ్లుగా విచార‌ణ జ‌రుపుతున్న సిట్, త‌ప్పుడు వాంగ్మూలాలు సృష్టించ‌డం మిన‌హా కుంభ‌కోణం జ‌రిగిన‌ట్టు ఒక్క ఆధారం కూడా సేక‌రించ‌లేకసోయింది. ఏ ఆధారం లేక‌పోయినా త‌ప్పుడు కేసులు పెట్టి ఆయ‌న వ్య‌క్తిత్వాన్ని హ‌న‌నం చేయాల‌ని కుట్ర చేస్తున్నారు. అందులో భాగంగానే వైయ‌స్ జ‌గ‌న్ గారి వ్య‌క్తిగ‌త స‌హాయ‌కుడు కేఎన్నార్‌ని కూడా కేసులోకి లాగి మీడియా ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించ‌డం ద్వారా దుష్ప్ర‌చారం చేసే కుట్ర‌కు తెర‌లేపారు. కేఎన్నార్ కేవ‌లం వైయ‌స్ జ‌గ‌న్ గారి అపాయింట్మెంట్లు మాత్ర‌మే చూస్తాడు. కానీ లిక్క‌ర్ కేసులో సిట్ విచార‌ణ పేరుతో త‌ప్పుడు ప్ర‌చారం మొద‌లుపెట్టారు. వైయ‌స్ జ‌గ‌న్ గారికి దగ్గ‌ర‌గా ఎవ‌రున్నా అంద‌ర్నీ అనుమానించి లిక్క‌ర్ కేసులో చేర్చి విచార‌ణ పేరుతో వేధించ‌డం, మీడియాలో త‌ప్పుడు ప్ర‌చారం చేసి వ్య‌క్తిత్వ హ‌న‌నం చేయ‌డమే రెండేళ్లుగా జ‌రుగుతున్న కార్య‌క్ర‌మం. 2007 నుంచి కేఎన్నార్ ఇన్‌కం ట్యాక్స్ చెల్లిస్తున్నాడు. అలాంటి వ్య‌క్తి రూ. 19 కోట్లు లావాదేవీలు జ‌రిగినంత మాత్రాన ఆయ‌న్ను లిక్క‌ర్ కేసులో చేర్చ‌డం హాస్యాస్ప‌దం. 

చంద్ర‌బాబు ల‌క్ష కోట్ల ఆస్తులు ఎలా కూడబెట్టాడు? 

ఎల్లో మీడియా చేస్తున్న ప్ర‌చారం ప్ర‌కారం చంద్ర‌బాబుకి ఆయ‌న తండ్రి ఖ‌ర్జూర నాయుడు కేవ‌లం రెండెక‌రాల పోలం ఇస్తే, నా ద‌గ్గ‌ర ల‌క్ష కోట్ల ఆస్తులు ఉన్నాయ‌ని ఎలా చెప్ప‌గ‌లిగాడు?  ప‌చ్చ‌ళ్లు అమ్ముకున్న రామోజీరావు వేల కోట్ల ఆస్తుల‌కు ఎలా అధిప‌తి అయ్యాడు?   సైకిల్ మీద తిరుగుతూ కిరోసిన్ అమ్ముకున్న‌ ఏబీఎన్ రాధాకృష్ణకి ఈరోజు టీవీ, పేప‌ర్‌కి అధిప‌తి ఎలా అయ్యాడు?  హైద‌రాబాద్‌లో అంత భారీ ఆస్తులు, వ్యాపారాలు ఎలా చేస్తున్నాడు?  టీవీ5 నాయుడు జీవితం ఎలా ప్రారంభమైంది? ఇలా చెప్పుకుంటూ పోతే చంద్ర‌బాబు బినామీలుగా ఎంతోమంది హైటెక్ సిటీ చుట్టూ భారీగా ఆస్తులు కూడ‌బెట్టారు. వారంద‌ర్నీ ఇదే విధంగా సిట్ అధికారులు ప్ర‌శ్నించ‌గ‌ల‌రా? 
పీఏలో ద్వారా ఆర్థిక లావాదేవీలు చేసే సంస్కృతి చంద్ర‌బాబుకే ఉంది. త‌న పీఏ శ్రీనివాస‌రావు ద్వారా అమ‌రావ‌తిలో రూ.2 వేల కోట్లు స్కామ్ చేశాడు. అందుకు సంబంధించిన వివ‌రాల‌ను నాడు అసెంబ్లీలో ఆధారాల‌తో స‌హా బ‌య‌ట‌పెట్ట‌డం జ‌రిగింది. ఇన్ని ఆర్థిక నేరాల‌కు పాల్ప‌డిన వ్య‌క్తులను విచారించ‌కుండా వైయ‌స్ జ‌గ‌న్ గారి వ్య‌క్తిత్వాన్ని హ‌న‌నం చేయాల‌ని చూడ‌టం సిగ్గుచేటు. చిల్ల‌ర ఆరోప‌ణ‌ల‌తో కేసుల పేరుతో వేధించి వైయ‌స్ జ‌గ‌న్ గారిని భ‌య‌పెట్టాల‌ని చూడ‌టం హాస్యాస్ప‌దం. ఆయ‌న ఆత్మ‌విశ్వాసాన్ని ఎవ‌రూ దెబ్బ‌తీయ‌లేరు. ధైర్యానికి వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌తిరూపం. చంద్ర‌బాబు నాయుడి మాదిరిగా భ‌య‌ప‌డే ప్ర‌స‌క్తే ఉండ‌దు. ఆయ‌న త‌ల‌లో వున్న తెల్ల వెంట్రుక కూడా త‌ప్పుడు కేసుల‌కు భ‌య‌ప‌డ‌దని రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద‌రెడ్డి హెచ్చ‌రించారు.

Back to Top