తాడేపల్లి: రాయలసీమ అభివృద్దిపై చంద్రబాబుకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే పెద్ద మనుషుల రాసుకున్న శ్రీబాగ్ ఒడంబడికను ఇప్పటికైనా అమలు చేసి వెనుబాటుతనానికి గురైన రాయలసీమ ప్రాంతానికి న్యాయం చేయాలని మాజీ మంత్రి సాకె శైలజానాథ్ డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రుల ఐక్యత కోసం రాయలసీమ వాసులు చారిత్రక, వారసత్వ సంపద, సంస్కృతిని కోల్పోయరని.. దేశం కోసం రాయలసీమలో 40 శాతం భూభాగాన్ని త్యాగం చేశామని చెప్పారు. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం రాయలసీమ ప్రాంతానికి హక్కుగా దక్కాల్సిన హైకోర్టు, ఎయిమ్స్ ను అమరావతికి తరలించిన చంద్రబాబు రాయలసీమకి చెడ్డ బిడ్డగా మిగిలిపోయారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఎప్పుడు సీఎం అయినా రాయలసీమ ప్రాంతానికి నష్టమే తప్ప ఒరిగిందేమీ లేదని స్పష్టం చేశారు. దివంగత మహానేత వైయస్ఆర్, మాజీ సీఎం వైయస్ జగన్‌లు మాత్రమే రాయలసీమ స్థితిగతులను పూర్తిగా అర్థం చేసుకుని సాగునీటి ప్రాజెక్టులపై దృష్టిసారించారని సాకె వివరించారు. హంద్రీనీవా ప్రాజెక్టును 5 టీఎంసీలకే పరిమితం చేసి చంద్రబాబు తాగునీటి ప్రాజెక్టుగా చేస్తే, ఆ తర్వాత ముఖ్యమంత్రులుగా చేసిన వైయస్ఆర్, వైయస్ జగన్‌లు 50 టీఎంసీలకు పెంచి రాయలసీమ ప్రాంతానికి సాగునీటి అవసరాలను చాలా వరకు తీర్చారని వివరించారు. ఇకపై రాయలసీమ ప్రాంతానికి నష్టం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని కూటమి ప్రభుత్వాన్ని మాజీ మంత్రి సాకె శైలజానాథ్ హెచ్చరించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... ● రాయలసీమ గురించి ఆలోచించింది వైయస్సార్, జగన్‌లే: భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి రాయలసీమ ప్రజలు ఎన్నో త్యాగాలు చేస్తూ వస్తున్నారు. శ్రీబాగ్ ఒడంబడిక పేరుతో రాసుకున్న పెద్ద మనుషుల ఒప్పంద పత్రం ఇప్పటికీ అమలుకు నోచుకోక రాయలసీమ ప్రాంతం నష్టపోతూనే ఉంది. ఆనాడు కర్నూలు రాజధానిని సైతం రాయలసీమ ప్రాంతం త్యాగం చేసింది. మూడు రాజధానుల విషయంపై నాటి సీఎం వైయస్ జగన్ అసెంబ్లీలో మాట్లాడుతూ శ్రీబాగ్ ఒడంబడిక గురించి చాలా స్పష్టంగా వివరించారు. శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణన్ కమిటీ చెప్పిన విషయాలను అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు చక్కగా వివరించారు. దివంగత వైయస్ఆర్ తర్వాత రాయలసీమ ప్రాంతం గురించి గట్టిగా నిలబడే వ్యక్తిగా వైయస్ జగన్ ఎప్పటికీ ముందుంటారు. వారిద్దరే రాయలసీమలో సమగ్రంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై దృష్టిసారించి అభివృద్ధికి బాటలు వేశారు. ● రాయలసీమలో పుట్టినా రాయలసీమకు చంద్రబాబు అన్యాయం: రాయలసీమ ప్రాంతంలో పుట్టి, నాలుగు సార్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ఏనాడూ శ్రీబాగ్ ఒడంబడిక గురించి ఆలోచించలేదు. రాజధాని, విశ్వవిద్యాలయం, హైకోర్టు ఒకే చోట ఉండకుండా అన్ని ప్రాంతాల్లో ఉండేలా చూసి అన్ని ప్రాంతాలకు అభివృద్ధిని వికేంద్రీకరించాలని శ్రీభాగ్ ఒడంబడికలోని ముఖ్యమైన అంశం. రాజధాని, హైకోర్టులో ఒకదానిని కోరుకునే హక్కు రాయలసీమ ప్రాంతానికి ఇవ్వాలనేది ఆనాటి ఒప్పందం. ఇవన్నీ తెలిసిన వ్యక్తిగా, రాయలసీమ బిడ్డగా అన్ని ప్రాంతాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో నాటి సీఎం వైయస్ జగన్ మూడు రాజధానులకు శ్రీకారం చుట్టి కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేసి న్యాయ రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, ఉత్తరాంధ్రలో విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు హైకోర్టును కూడా అమరాతికి తరలించేసి తీవ్ర అన్యాయం చేశాడు. హంద్రీనీవా ప్రాజెక్టు దివంగత ఎన్టీఆర్ రూపకల్పన చేస్తే ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు రెండుసార్లు శంకుస్థాపన చేసి కేవలం 5 టీఎంసీలకు పరిమితం చేసి కేవలం తాగునీటి ప్రాజెక్టుగా మార్చేశాడు. 2004లో వైయస్ఆర్ ముఖ్యమంత్రి అయ్యాక హంద్రీనీవా ప్రాజెక్టు సాగునీటి అవసరాలకు ఉపయోగపడే విధంగా దాని సామర్థ్యాన్ని 50 టీఎంసీలకు పెంచారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక గాలేరు-నగరిని హంద్రీనీవాలో కలపడం ద్వారా అనంతపురం నుంచి ప్రవహించే నీటి ఒత్తిడిని తగ్గించి ఉమ్మడి అనంతపురం జిల్లాకు నీరు అందించడంతోపాటు మిగత రాయలసీమ ప్రాంతాలకు గాలేరు-నగరి ద్వారా నీటిని తరలించే ప్రయత్నం చేశారు. అందుకుగాను వైయస్ఆర్‌సీపీ హయాంలో మొదలుపెట్టిన పనులను చంద్రబాబు సీఎం అయ్యాక పక్కనపెట్టేశాడు. చంద్రబాబు సీఎం అయితే రాయలసీమకు నష్టం అనే భావన రాయలసీమ ప్రజల్లో నెలకొంది. ఇప్పటికైనా శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం ఈ ప్రాంతానికి సాగు నీటిని అందించాలి. ● సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలి: చంద్రబాబు సీఎం అయ్యాక పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించి రాయలసీమ వాసులకు తీవ్ర ద్రోహం చేస్తున్నాడు. ఆల్మట్టి - బుక్కపట్నం లింక్ కెనాల్ గురించి చంద్రబాబు ఎందుకు ఆలోచించడం లేదో చెప్పాలి. రాయలసీమ ప్రాంతంలో సాగుకి యోగ్యమైన భూమి 98.95 లక్షల ఎకరాలుంటే అన్ని ప్రాజెక్టులు పూర్తయినా 30 శాతం భూమికి కూడా నీరందని పరిస్థితి నెలకొంది. అనంతపురం జిల్లాకు 430 టీఎంసీల నీరు అవసరం ఉంటే వర్షపు నీటితో కలిపి 70 టీఎంసీలు కూడా అందడం లేదు. ఇప్పటికీ నికరజలాల కేటాయింపుపై స్పష్టత లేదు. రాయలసీమ నుంచి హైకోర్టు, విశ్వవిద్యాలయం, రాజధాని, ఎయిమ్స్ వంటి ప్రాజెక్టులను అమరావతికి తీసుకెళ్లిపోయారు. దానికి చంద్రబాబు ఏం సమాధానం చెబుతారు. ఆంధ్రుల ఐక్యత, వైభవం కోసం ఆలోచించిన రాయలసీమ ప్రాంతం సాంస్కృతిక, చారిత్రక వైభవాన్ని కోల్పోయింది. అందుకే శ్రీబాగ్ ఒడంబడికను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. 87 ఏళ్లయినా పెద్ద మనుషుల ఒప్పందం అమల్లో ఉంది. ఒప్పందంలో ఉన్న అంశాలను అమలు చేయాలి. శాసనసభలో ప్రాతినిథ్యం గురించి కూడా చంద్రబాబు సమాధానం చెప్పాలి. సొంత ఇష్టాఇష్టాలను పక్కనపెట్టి రాయలసీమకు న్యాయం చేయాలి. రాయలసీమకు ముద్దు బిడ్డగా చెప్పుకోవడం కాకుండా చెడ్డ బిడ్డగా మారకుండా చూసుకోవాలి. ● ఆంధ్రుల ఐక్యత కోసం ఇన్నాళ్లూ సర్దుకుపోయాం: నీటి పారుదల రంగం గురించి కూడా కీలకమైన ప్రకటనలు చేశారు. కోస్తాంధ్ర ప్రాంత స్థాయిలో రాయలసీమ నెల్లూరు జిల్లాలు వ్యవసాయకంగా ఆర్థికంగా అభివృద్ధి చెందేలా నీటిలో ప్రయారిటీ ఇవ్వాలని చెప్పారు. కృష్ణా, తుంగభద్ర, పెన్నా నది నీళ్లలో ఈ ప్రాంత తాగునీటి అవసరాలు తీరిన తర్వాతనే సాగునీటి అవసరాల గురించి ఆలోచించాలని వివరించారు. ఒక వేళ భవిష్యత్తులో ఏదైనా వివాదం తలెత్తితో రాయలసీమ తాగునీటి అవసరాలను తీర్చేవిధంగా ఉండాలని స్పష్టంగా రాసుకున్నారు. అనంతపురంలో ఆంధ్రవిశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని సూచించారు. రాయలసీమ సంస్కృతి కలిగిన భూభాగంలో 40 శాతం ఈ ప్రాంతం కోల్పోయింది. మద్రాసు, చెన్నపట్నం, హోసూరు, కోలారు, తుముకూరు, కృష్ణగిరి, బల్లారి, బెంగళూరు ప్రాంతాలను రాయలసీమ ప్రాంతం కోల్పోయింది. అందుకే శ్రీబాగ్ ఒడంబడిక గురించి మాట్లాడకుండా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు గురించి మాట్లాడటంలో అర్థమే ఉండదు. ఆంధ్రుల ఐక్యత అని అన్నీ సర్దుకుంటూ పోయాం. చారిత్రక, సాంస్కృతిక నేపథ్యం ఉన్న ప్రాంతం మా రాయలసీమ. రాయలసీమ ప్రాంతానికి ఎగువన మద్రాసు రాష్ట్రంలో సిద్దేశ్వరం ప్రాజెక్టును నిర్మించి రాయలసీమ తాగునీటి అవసరాలను తీరుస్తామని ప్రకటించారు. కానీ మద్రాసు వారికి వాటా ఇవ్వాల్సి వస్తుందన్న కారణం చూపించి రాయలసీమ దిగువన సాగర్ డ్యామ్ నిర్మించారు. దీంతో హక్కుగా నీటి పొందాల్సిన రాయలసీమ వాసులు వరద జలాల మీద ఆధారపడాల్సిన దుస్థితి కల్పించారు.