శృతి మించిన కూటమి ఎమ్మెల్యేల అరాచకాలు 

అయినా ఏ ఒక్కరి పైనా నమోదు కాని కేసులు 

మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ ఆక్షేపణ  

వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌.

ఆ ఎమ్మెల్యేలను కాపాడుతున్న సీఎం చంద్రబాబు..

దీంతో రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయి..

మహిళలు, ఉద్యోగులు, ప్రతిపక్ష నాయకులపై దాడులు..

సీఎం తీరుపై సాకే శైలజానాథ్‌ ఫైర్‌

తాడేపల్లి: టీడీపీ కూటమి ఏడాది పాలనలోనే ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నాయకుల అరాచకాలు శృతి మించి పోయాయని మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ ఆక్షేపించారు. గతి తప్పి వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేలను సీఎం చంద్రబాబు కాపాడుతున్నారన్న ఆయన, దీని వల్ల రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు పాలనపై పట్టు పూర్తిగా కోల్పోయారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సాకే శైలజానాథ్‌ తెలిపారు.

ప్రెస్‌మీట్‌లో సాకే శైలజానాథ్‌ ఇంకా ఏం మాట్లాడారంటే..:

సుపరిపాలన అర్థాన్నే మార్చారు:

సీఎం చంద్రబాబు తన 14 నెలల పాలనలో విపక్షంపై దాడులు, యథేచ్ఛగా దోపిడి, అంతులేని అవినీతి వంటి వాటితో సుపరిపాలనకు అర్థాన్నే మార్చేశారు. అసలు సుపరిపాలన అంటే దాడులు, దోపిడీలు, అత్యాచారాలా?. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో అవే కళ్లకు కనిపిస్తున్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన ఎక్కడా జరగడం లేదు. విచ్చలవిడితనం పెరిగిపోయింది. వ్యవస్థలను ప్రణాళికా బద్ధంగా నాశనం చేస్తున్నారు. రెడ్‌ బుక్‌ పేరుతో దౌర్జన్యాలు చేస్తున్నారు. 

చంద్రబాబు ప్రచారం చేసుకునే సుపరిపాలన అంటే దళితుల మీద దాడులు, మహిళల మీద అత్యాచారాలు, ఉద్యోగులకు వేధింపులే కావొచ్చు. ఇసుక, మట్టి, మద్యం, మైనింగ్‌లో విచ్చలవిడి దోపిడీని కూడా సుపరిపాలన అని చెప్పుకుంటున్నారు. ఫొటోలు, వీడియోలతో ప్రచార ఆర్భాటాలు తప్పించి సగటు పేదవాడికి ఎక్కడా మేలు చేసిన దాఖలాలు కనుచూపు మేరలో చూద్దామన్నా కనిపించడం లేదు. 

నిస్సిగ్గుగా సొంత ప్రచారం:

నిజానికి తన ప్రమేయం లేకుండా జరిగిన వాటిని కూడా సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకుంటున్నారు. స్వర్ణ చతుర్భుజి పేరుతో ఆనాడు ప్రధాని వాజ్‌పేయి దేశంలోని నాలుగు మెట్రో నగరాలు కలుపుతూ నిర్మించిన జాతీయ రహదారి కూడా తన సలహాయే అని ఏ మాత్రం సిగ్గు లేకుండా చంద్రబాబు చెప్పుకుంటున్నారు. పబ్లిసిటీ పిచ్చి ఇలాగే తలకెక్కితే కృష్ణా నదికి వరదలు కూడా తానే తెచ్చానని చెప్పుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదేమో!. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో సా. 6 గం. తర్వాత పెరిగిన 12.5 శాతం (48 లక్షల) ఓట్లపై చంద్రబాబుకు కూడా ఎక్కడో అనుమానం ఉండి ఉంటుంది. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని భావించి పాలన గాలికొదిలేశాడు. విచ్చలవిడి దోపిడీకి తెర ఎత్తాడు.

రెచ్చిపోతున్న కూటమి ఎమ్మెల్యేలు:

గతంలో ఏనాడూ రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తలేదు. కూటమి ప్రభుత్వం కొలువు దీరాక పదేళ్ల క్రితం పెట్టిన సోషల్‌ మీడియా పోస్టులపై కూడా వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలను అరెస్టు చేసి వేధిస్తున్నారు. బెయిల్‌ రాకుండా పీటీ వారెంట్లతో రాష్ట్రమంతా జైళ్లకి తిప్పారు. టీడీపీ శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌ రెడ్డి అటవీ శాఖ అధికారులను బంధించి, దారుణంగా తిట్టి, హింసించి వేధించాడు. ఆ ఎమ్మెల్యే మీద కేసు పెట్టడానికి శాంతి భద్రతల విభాగాన్ని పర్యవేక్షించే చంద్రబాబు ఎందుకు వెనుకాడుతున్నారు?  అంటే, చంద్రబాబు ప్రోత్సాహంతోనే ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయని అర్థం చేసుకోవాలా?

టీడీపీకే చెందిన అనంతపురం అర్బన్‌ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్, జూనియర్‌ ఎన్టీఆర్‌ తల్లిని దారుణంగా తిట్టి అవమానపరిస్తే ఇంతవరకు ఆయన మీద చర్యల్లేవు. ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ కేజీబీవీ మహిళా ప్రిన్సిపాల్‌ను వీడియో కాల్స్‌ చేసి మానసికంగా వేధిస్తే ఆయన మీదా చర్యల్లేవు. మహిళలను వేధిస్తే అదే వారికి ఆఖరి రోజు అవుతుందని చెప్పే చంద్రబాబు, ఈ హెచ్చరికలు టీడీపీ వారికి వర్తించవని చెప్పాలనుకుంటున్నారా? మంత్రి అచ్చెన్నాయుడి అవినీతికి సహకరించ లేదని ఏపీ ఆగ్రోస్‌ జీఎంను బదిలీ చేసి, ఆ స్థానంలో అర్హత లేని చిన్న స్థాయి ఉద్యోగిని తెచ్చిపెట్టుకున్నారు. దెందులూరులో గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిని తన పొలంలోకి కూడా పోనీయకుండా రౌడీలను మోహరించి వేధిస్తున్నాడు. కళ్యాణదుర్గంలో టీడీపీ నాయకుల వేధింపులు భరించలేక గర్భిణి ఆత్మహత్య చేసుకుంది. గుంటూరులో ఎమ్మెల్యే నసీర్‌ అహ్మద్‌ వేధింపులతో ఒక మహిళ ఆత్మహత్యా యత్నం చేసింది. ఇప్పటికీ అనంతపురం జిల్లాలోని ఏడుగుర్రాలపల్లె గ్రామంలో అత్యాచారానికి గురైన బాలికకు న్యాయం జరగలేదు. వైయ‌స్ఆర్‌సీపీ సర్పంచ్‌ జెండా ఎగురవేయడానికి కూడా రాకుండా టీడీపీ గూండాలు అడ్డుకున్నారు. యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఖైదీకి టీడీపీ ఎమ్మెల్యేల సిఫార్సులతో హోంశాఖ పెరోల్‌ మంజూరు చేస్తే దాన్ని వైయ‌స్ఆర్‌సీపీకి ఆపాదించడం కన్నా దుర్మార్గం వేరొకటి ఉంటుందా?

నిందితులకు ఈ ప్రభుత్వం రక్షణగా నిలుస్తోంది:

నర్సారావుపేటలో ఎమ్మెల్యే ఇంట్లోనే సొంత పార్టీ కార్యకర్తపై దాడి చేశారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే స్క్రాప్‌ వ్యాపారిని కోటి రూపాయల కమీషన్‌ కోసం వేధించి కొట్టి ఫోన్‌ లాక్కున్నాడు. కాకినాడ రూరల్‌లో మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ మీద జనసేన ఎమ్మెల్యే దాడి చేశాడు. కర్నూలులో వాల్మీకి సామాజికవర్గానికి చెందిన యువకులను ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి కొట్టి కాళ్లు మొక్కించుకున్నాడు. యర్రంశెట్టి నాని అనే జనసేన కార్యకర్తని కొట్టి టీడీపీ నాయకులు కాళ్లు మొక్కించుకున్నారు. వైయ‌స్ఆర్‌సీపీ సోషల్‌ మీడియా వారియర్‌ ఇంటూరి రవికిరణ్‌ కి బెయిల్‌ ఇచ్చేందుకు వచ్చిన మాజీ మంత్రి పేర్ని నాని మీద టీడీపీ, జనసేన సైకోలు దాడి చేశారు. డ్వాక్రా మహిళలను కూడా వదిలిపెట్టకుండా టీడీపీ నాయకులు చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఇలాంటివి ప్రజాస్వామ్య వ్యవస్థకు పూర్తి విరుద్ధం.

విచ్చలవిడిగా భూదోపిడి:

విచ్చలవిడి దోపిడీకి కేరాఫ్‌ అడ్రస్‌గా చంద్రబాబు పాలన మారిపోయింది. రాష్ట్రంలో వేల కోట్ల విలువైన భూములను సాఫ్ట్‌వేర్‌ కంపెనీల ముసుగులో ఉర్సా వంటి సూట్‌కేస్‌ కంపెనీలకు ఎకరాలకు ఎకరాలు కేవలం 99 పైసలకే కట్టబెట్టేస్తున్నారు. ఏ అర్హత లేకున్నా విశాఖలో విలువైన 13.5 ఎకరాల భూములను, విజయవాడలో ఆర్టీసీ భూములను లులూకు ఇస్తున్నారు. కర్నూలులో 1500 ఎకరాలు అప్పనంగా కట్టబెట్టేశారు. పేద విద్యార్థుల కోసం వైయస్‌ జగన్‌ నిర్మించిన ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను ప్రైవేటుపరం చేసే క్రమంలో మూసేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై కేంద్రం వేగంగా అడుగులు వేస్తున్నా చంద్రబాబు నోరెత్తడం లేదు. ఇలాంటి అక్రమాలపై ఎవరూ తనని ప్రశ్నించకుండా అక్రమ కేసులతో ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నాడు. చివరకు పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రజలను పూర్తిగా కట్టడి చేసి, వారిని ఓటు వేయనీయలేదు.
    మరోవైపు అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేయడమే కాకుండా, అత్యంత అమానవీయంగా దివ్యాంగుల పింఛన్లు తీసేస్తున్నారని మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ ఆక్షేపించారు.

Back to Top