రాజకీయాల్లో ఆస్కార్‌ ఉంటే.. ప్ర‌తి ఏటా పవన్‌కే

కాపులు ఎవరి చేతిలోకి మారాలి..? ఎందుకు మారాలి..? బాబు కోసం మారాలా..?

చంద్రబాబు బాగుండాలన్నదే పవన్‌ అంతిమ లక్ష్యం

2014 నుంచీ అలుపు లేకుండా బాబుకు ఊడిగం చేస్తున్నది పవన్‌ కాదా..?

వెయ్యి కోట్ల ప్యాకేజీ అని రాధాకృష్ణ రాస్తే, తేలు కుట్టిన దొంగలా ఎందుకున్నావ్‌..?

సినిమా ప్రీరిలీజ్‌ ఫంక్షన్‌లా జనసేన ఆవిర్భావ దినోత్సవం

కాపులు, బలిజలు వేరు అని పవన్‌కు ఎవరు చెప్పారు..?

ఒక కులం వారి ఓట్లతో ఎవరైనా చట్టసభలకు ఎలా వెళ్తారు..?

కాపుల ఆత్మ గౌరవాన్ని కమ్మ వారికి తాకట్టు పెట్టడానికి ఓట్లు వేయాలా..?

వైయ‌స్‌ కుటుంబానికి బలిజలకు విడదీయరాని బంధం

పవన్‌ కళ్యాణ్‌ సర్కస్‌.. చంద్రబాబు కోసమే..

వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి పేర్ని నాని

తాడేపల్లి: రాజకీయాల్లో ఆస్కార్‌ అవార్డు కానీ ఉంటే నామినేష‌న్స్ కూడా లేకుండా అది ప్రతీ ఏటా పవన్‌కే దక్కుతుంద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ప‌వ‌న్‌కు ప్రజా సేవ చేయాలని లేదు.. కమిట్‌మెంట్‌ అంత కంటే లేదు.. నెలలో రెండు రోజులు శని, ఆదివారాలు వస్తాడు... ఏదేదో చెబుతాడు. అప్పుడు పవన్‌ మాట్లాడినవన్నీ ఆయన విమానం ఎక్కగానే గాల్లో కలిసి పోవాలి.. పట్టుమని నాలుగు మాటలు మాట్లాడితే కులం అంటాడు.. మళ్లా కుల రహిత సమాజం అంటాడు.. ప‌వ‌న్ పొలిటికల్‌ నటనకు ఆస్కార్‌ కూడా తక్కువేన‌న్నారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మాజీ మంత్రి పేర్ని నాని విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. 

మాజీ మంత్రి పేర్ని నాని  ఇంకా ఏం మాట్లాడారంటే..
కాపులు, బీసీలు కలిసి ప్రభుత్వాన్ని మార్చాలంటాడు వపన్‌కళ్యాణ్‌. అసలు, వాళ్లిదరూ ఎందుకు కలవాలి? ఈ ప్రభుత్వాన్ని ఎందుకు మార్చాలి? ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన ప్రతి పథకం, తీసుకున్న ప్రతి నిర్ణయం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతో పాటు అగ్రవర్ణాల్లోని పేదల సంక్షేమం కోసమే కదా? అలాంటిది, ఆయా వర్గాలన్నీ కలిసి తమకు మేలు చేసే ప్రభుత్వాన్ని ఎందుకు మార్చుకుంటారనేది పవన్‌ కళ్యాణ్‌ ఆలోచించలేక పోయాడా? బీసీలు, కాపులు కలిస్తే బాబు సీఎం అవుతాడని పవన్‌కళ్యాణ్‌ ఎందుకంత ఆశ పడుతున్నాడు?. 

మాది ఊడిగమా..?..
కాపుల ఆత్మాభిమానం తగ్గకుండా ఒప్పందాలు చేసుకుంటానని పవన్‌ చెబుతున్నాడు. ఈ మాటకు అర్థమేంటో చెప్పాలి. కాపులు అందర్నీ గౌరవించాలి. ఎవరితో గొడవపడొద్దని చెబుతాడు. అసలు, కాపులకు బీసీలకు, కాపులకు ఎస్సీలకు ఎక్కడైనా గొడవలున్నాయా? లేవు కదా? మరి పవన్‌కళ్యాణ్, చంద్రబాబు రాజకీయం కోసం మాలో మేం గొడవలు పడాలా? ఇప్పుడు ఊడిగం చేసేది ఎవరు? అలుపు సొలుపు లేకుండా 2014 నుంచి చంద్రబాబుకు ఊడిగం చేస్తోంది ఎవరు? వవన్‌ కాదా? ఆయన వెనకాలే తిరిగే నాదెండ్ల మనోహర్‌ చేసేదేంటì.? మొన్న బీసీల్ని పిలిచారే.. వాళ్లు మీ దగ్గరకు ఏం చేయడం కోసం వచ్చారు? వారంతా పవన్‌కు ఊడిగం చేయడానికి వచ్చారా?. పవన్‌కళ్యాణ్‌ చేస్తేనేమో రాజకీయం. వైయ‌స్‌ఆర్‌సీపీలో కాపులు మాత్రం ఊడిగం అంటూ ఇష్టానుసారంగా తిడతాడా? తాను ఓట్లేయిస్తే నా తల్లిని తిట్టించారని 2014లో ఎవర్ని ఉద్దేశించి అరిచావో.. మళ్లా వెళ్లి వాళ్లతోనే కలిసి తిరుగుతున్నావంటే ఊడిగం చేసేది ఎవరు పవన్‌?. 

కాపుల కోసం నిలబడిన నేత వైయ‌స్‌ జగన్‌..
కాపుల కోసం నిలబడిన నాయకుడు వైయ‌స్‌ జగన్‌. పేదల ఆర్థిక సాధికారత కోసం చిత్తశుద్ధితో ఆయన పని చేస్తున్నారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ సుపరిపాలన వల్ల పేదరికం పోతుంది. పేద, మధ్య తరగతి వర్గాల పిల్లల ఉన్నత చదువులు, ఉన్నతోద్యోగాల వలన వారి కుటుంబాల్లో మెరుగైన స్థితి వస్తుందని నమ్మి, అదే లక్ష్యంతో ఆయన వారి కోసం అనేక పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. అధికారం చేపట్టిన మూడేళ్లలోనే కాపుల సంక్షేమం కోసం రూ.30 వేల కోట్లు ఖర్చు చేశారు. అలాంటి ప్రజా నాయకుడు సీఎం వైయస్‌ జగన్‌. కాపులు కేవలం 2019 ఎన్నికల్లోనే కాదు, 2024, 2029లో కూడా మా పార్టీకే మద్దతు ఇస్తారు. వైయ‌స్‌ జగన్‌నే గెలిపిస్తారు.

సోషల్‌ ఇంజినీరింగ్‌ కూడా తెలియదు..
కులాల గురించి మాట్లాడుతూ వవన్‌కళ్యాణ్‌ సోషల్‌ ఇంజినీరింగ్‌ అంటాడు. ఏ కులం ఏ జాబితాలో ఉందో కూడా ఈయనకు తెలియదు. వైయ‌స్ జగన్‌ సీఎం అయ్యాక బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఉద్యోగ కల్పన  దగ్గర్నుంచి ఏ రంగంలోనైనా సోషల్‌ ఇంజినీరింగ్‌ చేస్తున్నారు. అధికారాన్ని అన్ని వర్గాలకూ సమపాలళ్లలో పంచి పెట్టడమనేది దేశంలో ఏ రాష్ట్రంలో ఉందో? పదవులు, పనుల్లో ఈ స్థాయి సమ ప్రాధాన్యత ఎక్కడుందో చూపించగలవా పవన్‌?. 26 బీసీ కులాల తొలగింపుపై తెలంగాణ సీఎంకు వైయ‌స్ జగన్‌ రాసిన లెటర్‌ చూస్తావా? దాన్ని చదువుకుంటావా? తెలంగాణలో నీ పార్టీ ఉంది కదా? మరి అక్కడ పోటీ చేయవా? తాను సీఎంగా ఉండి, ఒక అంశంపై అది తప్పు అంటూ మరో సీఎంకు లేఖ రాశారు మా వైయ‌స్ జగన్‌. మరి అదే అంశంపై నువ్వూ, నీ దత్త తండ్రి ఎందుకు ప్రశ్నించ లేదు? 

ఆ రాతలపై నోరెందుకు మెదపలేదు?
ముఖ్య‌మంత్రి వైయ‌స్ జగన్‌ నిన్ను దత్తపుత్రుడు అంటే నీకు విపరీతంగా పౌరుషం వస్తుంది. చంద్రబాబుకు నువ్వు ప్యాకేజీ స్టార్‌వి అంటే చెప్పులు చూపుతావు. మరి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ నీ మీద వెయ్యి కోట్ల బేరాలు సాగుతున్నాయని రాస్తే నోరెందుకు మెదపలేదు? అప్పుడు నీకు చెప్పులు లేవడం తెలియదా? తేలు కుట్టిన దొంగలా ఎందుకుండి పోయావ్‌?.పాపం హరిరామజోగయ్య ఆ వయస్సులో కాపు సంక్షేమ సమితి అంటూ కాపుల రాజకీయ ప్రయోజనాల కోసం కష్ట పడుతుంటే.. పవన్‌ మాత్రం కమ్మ ప్రయోజనాల కోసం పని చేస్తానని చెప్పడం చాలా నీచం.

బాబు నేర్పాడా? కుల రాజకీయం..
పవన్‌కళ్యాణ్‌ నిన్ను సూటిగా ఒకటి ప్రశ్నిస్తున్నా. నువ్వు నిజాయితీగా ప్రజలకు సేవ చేయాలనే చిత్తశుద్ధి, లక్ష్యం కలిగిన రాజకీయ నాయకుడివే అయితే నీకు కులంతో పనేంటి? నీ కులం ఏదైతే ఏంటి? అసలు ప్రజా నాయకుడికి కులంతో పనేంటి?. వీడు మన కష్టసుఖాల్ని అర్ధం చేసుకుంటాడు. మంచి పరిపాలనతో మేలు చేస్తాడు. తన స్వార్థం కోసం మనల్ని తాకట్టు పెట్టడు అని ప్రజల్ని నమ్మించ గలగాలి. అంతే కానీ, నాది ఫలానా కులం. నా కులపోళ్లు నన్ను సపోర్టు చేయడం లేదు. ఇప్పుడు చేస్తారో? లేదో? అని అనడానికి నీకు అసలు సిగ్గుండాలి. కుల రాజకీయాలు చేయడంలో నీ దత్తతండ్రి చంద్రబాబు దిట్ట కదా? ఆయన నీకు కుల రాజకీయాలు నేర్పాడా?.

పూటకో కొత్త మాట.. సభకో కొత్త కూత..
నిన్నటి దాకా నాకు కులంతో సంబంధం లేదని చెప్పిన పవన్‌ కళ్యాణ్‌ ఈమధ్య కొత్తగా తన కులం గురించి మొదలుపెట్టాడు. అమ్మ బలిజ, నాన్న కాపు అంటున్నాడు. ఏది పడితే అది బరి తెగించి మాట్లాడటమే రాజకీయం అనుకుంటున్నాడు.    లక్ష పుస్తకాలు చదివానంటాడు. రామ్‌మనోహర్‌ లోహియా బీసీల గురించి పుస్తకం రాశాడు. తాను దాన్ని చదివాను అంటాడు. అసలు లోహియా బీసీలపై పుస్తకమెప్పుడు రాశాడో? అది ఎక్కడుందో ఎవరికీ  తెలియదు. చిన్నప్పుడు సావాసం చేసిన స్నేహితుల కులం కూడా ఈయనకు కావాలి. ఒకవైపు తనకు కులం లేదంటాడు. మరి కాసేపేమో తాను క్రిస్టియన్‌ అంటాడు. ఇంకోసారి రెల్లి అంటాడు. ఇప్పుడేమో కాపు అంటున్నాడు. పూటకో కొత్త మాట పలుకుతూ సభ పెట్టిన చోటల్లా కొత్త కూతలు పెడుతున్నాడు పవన్‌కళ్యాణ్‌.

ఏడాదికో పండగలా.. పార్టీ ఆవిర్భావ వేడుకలా..? 
ఏటా డిసెంబరులో క్రిస్మస్, జనవరిలో సంక్రాంతిని ప్రజలంతా ఎంత సంబరంగా జరుపుకుంటారో.. అదే విధంగా తన పార్టీ ఆవిర్భావం కూడా సినిమా ఫంక్షన్‌ తంతుగా జరుపుకుంటున్నాడు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌. ఇప్పటం సభ అయ్యాక ఏడాది తర్వాత మా ఊరు బందరు వచ్చాడు. మరి, ఈ సంవత్సర కాలంలో ఒక రాజకీయ పార్టీగా ఏ మేరకు ప్రగతి సాధించాడో ఆయనకే తెలియాలి. ‘2022లో ఇప్పటంలో సభ పెట్టాం కదా.. అప్పుడు పెద్దపెద్ద మాటలు మాట్లాడామే.. అప్పుడు చెప్పిన మాటల్లో ఏమైనా మనం నెరవేర్చామా..? రాష్ట్ర ప్రజల తరఫున జనసేన పార్టీ తరఫున ఒక్కటంటే ఒక్కటైనా చేశామా..? అని జనసేన నాయకుడు ఆత్మవిమర్శ చేసుకోవాలి.

ఆ ఒప్పందాల స్పెషలిస్టు పవన్‌..
2014 నుంచి 2023 వరకు పవన్‌ కళ్యాణ్‌ చరిత్ర, జనసేన బండారం ఏంటి? అందరం కూర్చొని చర్చిద్దామా? ఇప్పటి వరకు చంద్రబాబుతో పవన్‌ కళ్యాణ్‌ లోపాయీకారీ ఒప్పందం చేసుకోలేదా? చంద్రబాబను నేను ఇష్టపడ్డాను. మంచోడు. గెలిపించండి. ఆయన పని చేయకపోతే నేను ప్రశ్నిస్తాను. మీరు ఓటేయ్యండి. అని పార్టీ పెట్టిన వ్యక్తి పవన్‌. అప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చాలని మీతో పోటీ చేయించింది చంద్రబాబే కదా? 2019 ఎన్నికల ముందు బీజేపీని తిట్టి, ఎన్నికలై పోగానే, నోరు కూడా తడారక ముందే బీజేపీని కౌగిలించుకున్న నాయకుడిగా.. లోపాయీకారీ ఒప్పందాల స్పెషలిస్టు పవన్‌కళ్యాణ్‌.

బాబు ప్రాపకం కోసం నీచ రాజకీయం..
చంద్రబాబు రాజకీయాల కోసం నీచంగా మాట్లాడతావా? పులివెందుల, కడపలో ఎంతమంది కాపులు, బలిజలు ఉన్నారో తెలుసా? వారంతా వైయస్సార్‌ కుటుంబంతోనే ఉన్నారు కదా? నిన్నటి దాకా గనులు నడిపిన సాయిప్రతాప్‌చివరి దాకా ఎవరితో ఉన్నారు? వైయస్సార్‌తోనే కదా? చంద్రబాబు ప్రాపకం కోసం కాపులు, బలిజల చేతుల్లో ఉన్న మైన్స్‌ను వైయ‌స్‌ కుటుంబం లాక్కుందని విషం చిమ్మటమనేది పవన్ నీచ రాజకీయానికి తార్కాణం. అలాగే హరిరామజోగయ్య ఇంటి మీదకి వైయ‌స్‌ఆర్ కాంగ్రెస్‌ గూండాలను పంపారా? అదే నిజమైతే, ఆయన వైయ‌స్‌ఆర్‌సీపీలోకి చేరి ఎందుకు పని చేశారు?. చంద్రబాబు దిగజారి తప్పుడు రాజకీయాలు చేస్తాడంటే.. పవన్‌ అంత కంటే దిగజారి మాట్లాడుతున్నాడు.

సిద్ధాంతాలూ లేని పవన్‌..
అసలు ప్రజలు నిన్ను ఏం చూసి నమ్మాలి? నిలకడ లేనటువంటి సిద్ధాంతం, ఆశయం చూసి నమ్మాలా? పదే పదే కాపులు అంటావే.. అసలు వారికి నువ్వేం చేశావు? 9 ఏళ్లు మోదీ చంకలో ఉండి కాపుల రిజర్వేషన్‌ కోసం నువ్వు ఎవరితో మాట్లాడావు? అందుకు ఏ ప్రయత్నం చేశావని కాపులు నిన్ను నమ్మాలి? కేవలం మనం మనం బరంపురం, మీది మాది తెనాలి అంటూ కాపుల్ని రెచ్చ గొట్టి చంద్రబాబు దొడ్లోకి తోలేయ్యాలనే పవన్‌ ఆలోచన అందరికీ అర్ధమౌతోంది. 

నిలకడ లేని రాజకీయ నేత..
మన వల్ల, మన పార్టీ వల్ల ప్రజలకేమైనా మేలు జరిగిందా..? అని జనసేన పార్టీ కేడర్‌ ఆలోచించి, వారి పార్టీ అధినేతను ప్రశ్నిస్తే.. ‘నేను సినిమాలు చేసుకుంటున్నాను’ అని ఆయన జవాబిస్తాడు. అదేంటయ్యా..  ప్రజా సేవ చేస్తామని రాజకీయాల్లోకి వచ్చావు కదా? మళ్లీ ఈ సినిమాల గోల ఏంటయ్యా? అంటే, పార్టీ నడపాలంటే డబ్బు కావాలి కనుకనే సినిమాలు చేసుకుంటున్నాను.. అంటాడు. నిన్న జనసేన కార్యాలయంలో జరిగిన కాపుల సభలో హరిరామ జోగయ్య మాట్లాడుతూ.. అయ్యా..పవన్‌కళ్యాణ్‌.. పార్టీని తాకట్టు పెట్టి డబ్బుకు అమ్ముడుపొయ్యావంటున్నారు.. అనగానే.. అసలు రాజకీయాల్లో   పార్టీని నడపడానికి డబ్బే అవసరం లేదంటాడు. అసలు ఈ వ్యక్తి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాడో? ఆయన ఆశయం ఏమిటో? ఇప్పటికీ ఎక్కడా చెప్పడు. ఒక పద్ధతి లేకుండా నోట్లో నాలుక ఎటు తిరిగితే అటు తిప్పుతున్నాడు. 

పవన్‌ను నమ్మితే నెత్తి మీద టోపీనే..
ఏదో ఉద్ధ్దరిస్తాడని ఇప్పటివరకు పవన్‌కళ్యాణ్‌ను నమ్ముకుని ఎందరో నెత్తిన టోపీ పెట్టించుకున్నారు. నిన్నటికి నిన్న హరిరామజోగయ్యకు పెద్ద టోపీ పెట్టాడు. హరిరామజోగయ్యను చూస్తే జాలేస్తుంది. ఒక పక్క నాకు సీఎం పదవి వద్దని పవన్‌ అంటుంటే, నువ్వే సీఎం కావాలని జోగయ్య అంటాడు. ఇంకా ఎన్నాళ్లూ ఎంత మందికి టోపీ పెడతావయ్యా పవన్‌? 2024 ఎన్నికల్లో నీ డ్రామాలు, చంద్రబాబు డ్రామాలు బయటకొస్తాయి కదా. ప్రజలేమైనా అమాయకులా? నీ టోపీ రాజకీయాలకు తగిన బుద్ధి చెబుతారు.

కాపుల్ని కెలికావు. తిట్టించుకున్నావు..
2019లో మనం కెలికింది ఎవరిని? మొత్తం కాపుల్నే కదా? 2019లో కాకినాడ వెళ్లి ఎవర్ని తిట్టావు?. చెలమలశెట్టి సునీల్‌ను ఎందుకు తిట్టావు?. అక్కడ్నుంచి కురసాల కన్నబాబును ఎందుకు తిట్టావు?. రామచంద్రాపురంలో పోటీ చేసిన తోట త్రిమూర్తులును, ఆ తర్వాత బందరు వచ్చి నన్ను తిట్టావు. వాళ్లంతా కాపు నాయకులేగా?. ఆ పార్టీ, ఈ పార్టీ అని చూడకుండా నువ్వు కాపు నాయకుల్ని తిట్టి ఆనంద పడినప్పుడు నువ్వు ఓడిపోయినప్పుడు మేమూ ఆనంద పడతాంగా? మరి నువ్వు ఓడిపోతే కాపులు నవ్వుతున్నారంటూ ఆ ఏడుపులెందుకు?. 

అది నీ అమాయకత్వం.. 
భీమవరం, గాజువాకలో తన కులపోళ్లు ఓటేస్తే ఓడిపోయే వాడ్ని కాదని పవన్‌ చెబుతున్నాడు. ఆ మాట అనడానికి పవన్‌కు నోరెలా వచ్చింది. ఆ భాష ఏంటయ్యా. ఒక కులం ఓటుతో శాసనసభలోకి వెళ్లాలనుకునే నీచ మనస్తత్వమా నీది?. 2014లో నీకు కులం లేదన్నావు. 2019లో నేను కాపు. మీరు కాపు. బరంపురం అన్నావు. 2024 ఎన్నికలు వచ్చే సరికి ఈసారి కాపుల ఆత్మ గౌరవం అంటున్నావు. æకులం కంపుతో రాజకీయాలు చేయాలను కోవడం పవన్‌ అమాయకత్వమని మాజీ మంత్రి  పేర్ని నాని స్పష్టం చేశారు.

Back to Top