గుంటూరు: వైయస్ జగన్ ప్రభుత్వం అంటే జనం ప్రభుత్వమేనని, మళ్లీ వచ్చేది జనం ప్రభుత్వమే, మళ్లీ ప్రజలే గెలిపించుకుంటారని మాజీ మంత్రి, కృష్ణా జిల్లా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పేర్ని నాని అన్నారు. రేపటి ప్లీనరీకి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని చెప్పారు. తొలిరోజు పార్టీ ప్రతినిధులతో సమావేశం.. ఉంటుందని, 70 వేల మంది వరకు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. సీఎం వైయస్ జగన్ పార్టీ జెండా ఎగురవేసి ప్లీనరీ సమావేశాలను ప్రారంభిస్తారని చెప్పారు. తొలిరోజు 9 రాజకీయ అంశాలపై తీర్మానాలుంటాయని పేర్ని నాని వివరించారు. మూడేళ్లలో ఏం చేశాం.. రెండేళ్లలో ఏం చేయబోతున్నామో ప్లీనరీ సమావేశాల్లో చెబుతామన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ విద్యలో సమూల మార్పులు తీసుకువచ్చారని పేర్ని నాని అన్నారు. పేదలకు కూడా కార్పొరేట్ విద్యను అందుబాటులోకి తీసుకువచ్చారని గుర్తుచేశారు. విద్యతోనే పేదరికం నిర్మూలన అవుతుందని సీఎం వైయస్ జగన్ నమ్మారని, మూడేళ్లలో విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యతనిచ్చారని గుర్తుచేశారు. దేశంలో విద్య, వైద్యానికి ఎక్కువ నిధులు ఖర్చు పెట్టిన రాష్ట్రం ఏపీనే అని చెప్పారు.