చిలుకలూరిపేట: మాజీ మంత్రి విడుదల రజిని పట్ల చిలుకలూరిపేట రూరల్ సీఐ సుబ్బనాయుడు సభ్యతా, సంస్కారాలను మరిచిపోయి కీచకుడిలా వ్యవహరించడాన్ని వైయస్ఆర్‌సీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తీవ్రంగా ఖండించారు. మాజీ మంత్రి విడదల రజినిపై పోలీసుల దౌర్జన్యం గురించి తెలియగానే చిలుకలూరిపేటలో లోని ఆమె నివాసంకు వెళ్ళిన మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు దొంతిరెడ్డి వేమారెడ్డి, డైమండ్‌బాబు తదితరులు ఆమెకు పరామర్శించారు. అనంతరం పేర్ని వెంకట్రామయ్య మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత పోలీస్ అధికారులు పోస్టింగ్‌ల కోసం దిగజారిపోయి, ఖాకీ దుస్తులకే తలవంపులు తెచ్చేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇంకా ఆయనేమన్నారంటే... మాజీ మంత్రి విడదల రజిని తన నియోజకవర్గంలోని ఒక కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లారు. పరామర్శ తరువాత ఆమె వెనుదిరుగుతుంటే చిలకలూరుపేట రూరల్ సీఐ సుబ్బనాయుడు ఆమె పట్ల అనుచితంగా వ్యవహరించాడు. ఆమె తన కారు ఎక్కుతూ ఉంటే ఒక మహిళా మాజీ ప్రజాప్రతినిధి అనే విషయాన్ని మరిచిపోయి దురుసుగా, దౌర్జన్యంగా ప్రవర్తించడం సిగ్గుచేటు. సీఐ వ్యవహారం చూస్తే ఖాకీదుస్తులు వేసుకున్న అధికారా లేక ఖాకీ దుస్తులు వేసుకున్న రాక్షసత్వమా అనే సందేహం కలుగుతోంది. సీఐగా ఉన్నాననే అహంకారంతో ఎవరినైనా, ఏదైనా చేయగలనని భావిస్తున్నారు. చట్టప్రకారం ఎవరినైనా అదుపులోకి తీసుకునే క్రమంలో కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా, నాఇష్టం నేను అరెస్ట్ చేస్తాను, ఎవరు ఆపుతారు? అవసరమైతే మాజీ మంత్రి పైన అసాల్ట్ కేసు కూడా పెడతానని బెదిరించారు. కారులో కూర్చున్న ఆమెపై దౌర్జన్యానికి పాల్పడ్డాడు. ఇదేనా మహిళల పట్ల ఒక సీఐ ప్రవర్తించే తీరు? వారి ఇళ్ళలో మహిళలు లేరా? వారికి కూడా ఇదే విధంగా ఆయన గౌరవం ఇస్తారా? ప్రజలకు రక్షణ కల్పించడం చేతకాదు, వైయస్ఆర్సీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులతో వేధింపులు చేయడమే వారికి తెలిసింది. ఈ తప్పుడు కేసులకు వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలు ఎవరూ భయపడటం లేదు. కానీ అరెస్ట్ చేసే క్రమంలో చట్ట ప్రకారం వారిపై వచ్చిన అభియోగం ఏమిటో, దాని వివరాలు ఏమిటో తెలుసుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. దీనిని కూడా నేరంలా పోలీసులు భావిస్తుంటే, ఇక ప్రజాస్వామ్యానికి, చట్టాలకు ఎక్కడైనా గౌరవం ఉంటుందా? ఏమీ చెప్పకుండా ఒక మహిళా మాజీ మంత్రిని కారు నుంచి డోర్ తెరిచి, బలవంతంగా బయటకు లాగేశాడు. పోలీస్ ఉన్నతాధికారులు కూడా ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఈ రోజు సీఐ వ్యవహరించిన తీరును వారు ఎలా సమర్థించుకుంటారో ఆలోచించుకోవాలి. ఎప్పుడో ఏడేళ్ళ కిందట జరిగిన విషయాలకు కూడా నేడు కేసులు నమోదు చేసి, కక్షసాధింపులకు పాల్పడుతున్నారు. కూటమి నేతల కోసం హద్దు మీరుతున్నారు చంద్రబాబు, పవన్,లోకేష్‌లను సంతృప్తి పరిచేందుకు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడేది లేదు. కానీ హద్దు మీరి మహిళా మాజీ ప్రజాప్రతినిధి పట్ల ప్రవర్తించిన తీరు దారుణంగా ఉంది. సదరు సీఐకి అన్నంతో పాటు ఇంట్లోని వారు సభ్యతా సంస్కారాలను కూడా పెట్టాలని సూచిస్తున్నాం. చట్టప్రకారం ఎవరినైనా అరెస్ట్ చేసుకోండి, దానికి అనుసరించాల్సిన విధానాలను పాటించాలి. ఒక కీచకుడిగా వ్యవహరిస్తే దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. పోస్టింగ్‌ల కోసం ఇంతగా దిగజారిపోవాలా? ఉన్నతాధికారులు దీనిపై విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకోవాలి. పోలీసుల తీరుపై న్యాయస్థానాలు ఎన్నిసార్లు హెచ్చరించినా కూడా వారిలో మార్పు రావడం లేదు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో శ్రీకాంత్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు ఏ స్టేషన్‌లో ఉంచారో తెలియదు. దీనిపై సమాచారం కోసం ప్రయత్నిస్తే ఒక్క పోలీస్ అధికారి కూడా స్పందించడం లేదు. ఇంత వరకు అధికారికంగా అరెస్ట్ చూపించలేదు. పోలీసులే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటే, న్యాయస్థానాల ముందు దోషులుగా నిలబడక తప్పదు. తప్పుడు కేసులతో భయపెట్టలేరు: మాజీ మంత్రి విడదల రజిని నాదెండ్ల మండలం జంగాలపల్లి గ్రామంలో ఈరోజు వైయస్ఆర్‌సీపీ నాయకుడు సీతారామిరెడ్డిని పరామర్శించడం జరిగింది. అక్కడి నుంచి ఎడ్లపాడు మండలానికి వెళ్ళేందుకు కారు ఎక్కేలోగా రూరల్ సీఐ సుబ్బనాయుడు, నాదెండ్ల ఎస్ఐ, పోలీసులు ఒక్కసారిగా కారు వద్ద హడావుడి చేశారు. పోలీసులు దేనికి వచ్చారని ప్రశ్నించగా మా అనుచరుడు శ్రీకాంత్‌రెడ్డిని తీసుకువెళ్ళేందుకు వచ్చామని చెప్పారు. ఏ కేసులో అతడిని అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని కోరగా, వివరాలు చెప్పేందుకు నిరాకరించడంతో పాటు మాపైన బెదిరింపులకు పాల్పడ్డారు. వివరాలు చెబితే అరెస్ట్‌కు సహకరిస్తామని చెబుతున్నా కూడా వినకుండా సీఐ సుబ్బనాయుడు పోలీస్ అధికారిలా కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలా వ్యవహరించారు. కారులో కూర్చున్న నాపై దౌర్జన్యం చేయడంతో పాటు కారులోంచి కిందికి లాగే ప్రయత్నం చేశారు. అంతేకాదు నాపైన అసాల్ట్ కేసు కూడా పెడతానంటూ బెదిరించారు. ఎవరి మెప్పు కోసం ఇలా చేస్తున్నారో అందరికీ తెలుసు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి పోలీసులను ఇలాగే మాపైన ఉసిగొల్పుతున్నారు. నా మరిదిపై తప్పుడు కేసు కట్టి జైలుకు పంపారు. నా మామగారిపైన తప్పుడు కేసులు పెట్టారు. మొత్తం పోలీస్ వ్యవస్థను అధికారపార్టీ అనుబంధ విభాగంగా మార్చుకుని పనిచేయిస్తున్నారు. వైయస్ఆర్సీపీ నాయకులుగా ప్రజల పక్షాన నిలబడుతున్నందుకు జీర్ణించుకోలేకే ఇలాంటి తప్పుడు కేసులు పెడుతున్నారు. వీటికి భయపడేది లేదు, వీటిపైన పోరాడి తీరుతాం.