తాడేపల్లి: రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో రైతులకు అడుగడుగునా అన్యాయమే జరుగుతోందని వైయస్ఆర్‌సీపీ రీజినల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సివిల్ సప్లయిస్ విభాగానికి ధాన్యాన్ని విక్రయించిన రైతులకు రెండు నెలలుగా బకాయిల చెల్లింపులను నిలిపివేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.1250 కోట్లు రైతులకు చెల్లించాల్సిన బాయిలను పెండింగ్‌లో పెట్టి, యోగాడే వంటి పబ్లిసిటీ ఈవెంట్‌లకు రూ.వందల కోట్లు ప్రభుత్వం దారాళంగా ఖర్చు చేస్తోందని ధ్వజమెత్తారు. విక్రయించిన ధాన్యంకు గానూ 24 గంటల్లోనే చెల్లింపులు చేస్తామన్న సివిల్ సప్లయిస్ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట ఏయ్యిందని ప్రశ్నించారు. ఇంకా ఆయనేమన్నారంటే... రాష్ట్రంలో రైతులు కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర దక్కకపోగా, ఆ వచ్చిన ధరనైనా చెల్లించకుండా కూటమి ప్రభుత్వం వేధిస్తోంది. పెట్టుబడి ఖర్చులకు డబ్బులు లేక.. బ్యాంకు రుణాలు పుట్టక అన్నదాతలు తీవ్ర అగచాట్లు ఎదుర్కొంటున్నారు. రైతులన్నా, వ్యవసాయమన్నా చంద్రబాబుకి అసహ్యం. ఆయన దృష్టంతా రికార్డుల పేరుతో పబ్లిసిటీ చేసుకోవడం పైనే ఉంటుంది. రైతుల ధాన్యం డబ్బులు చెల్లించడానికి మీనమేషాలు లెక్కిస్తున్న ఈ ప్రభుత్వం, యోగాంధ్ర పేరుతో ఒక్కరోజులో రూ. 300 కోట్లకు పైగా ఖర్చు చేశారు. అమరావతికి మళ్లీ మళ్లీ శంకుస్థాపనల పేరుతో రూ.700 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పటివరకు రబీలో రెండు లక్షల మంది రైతుల నుంచి 19.84 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించగా చిరుధాన్యాల బకాయిలతో కలిపి దాదాపు రూ.1,250 కోట్ల మేర చెల్లింపులు చేయాల్సి ఉంది. రెండు నెలలకుపైగా బకాయిలు పేరుకుపోవడంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరోవైపు పెట్టుబడి ఖర్చుల కోసం చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోవడంతో పాటు ఖరీఫ్ సాగుకు విత్తనాలు వేసుకునేందుకు డబ్బులు లేక దిక్కు తోచని పరిస్థితిలో కూరుకుపోయారు. రాష్ట్రానికి ధాన్యాగారం లాంటి ఉభయ గోదావరి జిల్లాల్లో ధాన్యం రైతులకు చెల్లింపులు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. కౌలు రైతులను కూడా కూటమి సర్కార్ కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. కౌలు రైతు కార్డులు జారీ చేయకపోవడంతో ప్రభుత్వానికి ధాన్యం విక్రయించుకోలేక నానా తిప్పలు పడ్డారు. దళారులు, మిల్లర్లు సిండికేట్‌గా మారడంతో నష్టానికి పంట అమ్ముకున్నారు. పశ్చిమ గోదావరిలో రూ.300 కోట్లు, కోనసీమలో రూ.260 కోట్లు, తూర్పు గోదావరిలో రూ.150 కోట్లు కాకినాడలో రూ.130 కోట్లు ధాన్యం బకాయిలున్నాయి. దళారీల దోపిడీతో రైతన్నలు విలవిల ప్రభుత్వం చేపట్టాల్సిన ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తిగా దళారులు, ప్రైవేటు వ్యక్తులు చేతుల్లోకి వెళ్లిపోయింది. తేమ శాతం, నాసిరకం సాకుతో దళారులు, మిల్లర్లు కలిసి సిండికేట్‌గా ఏర్పడి రైతులను నిలువు దోపిడీ చేశారు. తద్వారా రైతు బస్తాకు రూ.300 నుంచి రూ.450కి పైగా నష్టపోయాడు. క్వింటాల్‌కు ఏకంగా రూ.600 వరకు రైతులు నష్టపోయిన పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం 75 కిలోల బస్తా ధాన్యం సాధారణ రకానికి రూ.1,725, ఏ-గ్రేడ్‌కు రూ.1,740 చొప్పున గిట్టుబాటు ధర నిర్ణయించింది. కానీ కూటమి ప్రభుత్వం తేమ శాతం, ధాన్యం బాగా లేదనే సాకుతో రైతులను నిలువు దోపిడీకి గురి చేసింది. దీంతో ఒక్కో రైతు బస్తాకు రూ.300 నుంచి రూ.450కి పైగా నష్టపోయారు. టన్నుకు ఏకంగా రూ.6 వేలకు పైగా నష్టం వాటిల్లింది. ధాన్యం కొనుగోళ్లను పారదర్శకంగా చేపట్టి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రైతులకు రవాణా, హమాలీలు, గోనె సంచులు సమకూర్చింది. రైతులే ఈ సదుపాయాలను సమకూర్చుకుంటే గన్నీ, లేబర్, ట్రాన్స్‌పోర్టు (జీఎల్టీ) చార్జీలను వారి ఖాతాల్లో జమ చేసేది. ఇలా రైతులపై అదనపు భారం పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంది. టీడీపీ కూటమి ప్రభుత్వం రాకతో మొత్తం ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ మారిపోయింది. ప్రభుత్వ యంత్రాంగం దళారీల గుప్పిట్లోకి వెళ్లిపోయింది. ఇప్పుడు దళారీలు ఇస్తేనే గోనె సంచులు వస్తాయి..! హమాలీలు లోడ్ చేస్తారు.. లారీ కదులుతుంది! ఇక జీఎల్టీ మొత్తం వాళ్లే తీసుకుంటున్నారు. ఒకవేళ రైతే ఇవన్నీ భరిస్తే రూపాయి కూడా వారి ఖాతాల్లో జమకావట్లేదు. అసలు ఈ ప్రభుత్వం ధాన్యం సేకరణకు ఎక్కడా ట్రాన్స్‌పోర్ట్ టెండర్లు పిలిచిన దాఖలాలు లేకపోవడం గమనార్హం. నాణ్యమైన సన్న రకాలకు సైతం గిట్టుబాటు ధర పలకడం లేదు. గత మా ప్రభుత్వంలో 75 కిలోల బస్తా రూ.2 వేలకుపైగా పలికితే ఈసారి రూ.1,400 లు పలకడమే గగనమైపోయింది.