ఉచిత పంటల బీమాకు కూటమి సర్కార్ ఎగనామం 

 మండిపడ్డ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు

తణుకు పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు

 రైతుల పట్ల రాక్షసంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు

 ఏడాది పాలనలో వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు

  బీమా ప్రీమియం చెల్లించకపోవడం వల్ల రూ.1300 కోట్లు నష్టపోయిన రైతులు

  రైతుల తరుఫున బీమా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించాలి

  మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు

తణుకు: రైతులకు మేలు చేయాలనే లక్ష్యంతో వైయస్ జగన్ ఉచిత పంటల బీమా పథకాన్ని తీసుకువస్తే, కూటమి ప్రభుత్వం దానిని పూర్తిగా నిర్వీర్యం చేసిందని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. తణుకు పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రైతుల తరుఫున ప్రీమియం కింద రూ.700 కోట్లు చెల్లించడాన్ని భారంగా చూపుతూ కూటమి ప్రభుత్వం ఈ పథకాన్నే పూర్తిగా ఎత్తేసేందుకు సిద్దపడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకృతి వైఫరీత్యాల సమయంలో రైతులకు అండగా నిలిచే ఈ పథకాన్ని తీసేయడానికి వ్యవసాయం అంటే చంద్రబాబుకు ఉన్న చిన్నచూపే కారణమని ధ్వజమెత్తారు. తక్షణం ప్రభుత్వం దిగివచ్చి ఉచిత పంటల బీమాకు ప్రీమియంను భరించాలని డిమాండ్ చేశారు.

ఇంకా ఆయనేమన్నారంటే..

రైతులకు మేలు చేయాలని వైయస్ జగన్ గత ప్రభుత్వంలో ఉచిత బీమా పథకాన్ని అమలు చేశారు. దీనిని పూర్తిగా వక్రీకరిస్తూ ఎల్లోమీడియా ఈనాడు పత్రికలో వైయస్ఆర్‌సీపీ హయాంలో ఈ పథకాన్ని నిర్వీర్యం చేసిందంటూ తప్పుడు కథనాన్ని ప్రచురించారు. కూటమి ప్రభుత్వమే ప్రీమియంగా దాదాపు రూ.700 కోట్లు చెల్లించాల్సి వస్తోందని ఉచిత బీమా పథకాన్ని అటకెక్కించిన మాట వాస్తవం కాదా? ఆనాడు వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం రైతులపై ఒక్క పైసా భారం పడకుండా ఈ పథకాన్ని అమలు చేసింది. అయిదేళ్ళ పాటు ఈ ఉచిత బీమా వల్ల రైతులకు లబ్ది చేకూరింది. కూటమి ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంతో బీమా ప్రీమియం చెల్లించకపోవడం వల్ల గత ఏడాది ప్రకృతి వైఫరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు దాదాపు రూ.1300 కోట్ల మేర పరిహారం దక్కలేదు. రాష్ట్ర ప్రభుత్వం తన వంతు ప్రీమియం కడితేనే దానికి కేంద్రం వాటా విడుదల అవుతుంది. కూటమి ప్రభుత్వంలో ఇది జరగలేదు. వైయస్ఆర్‌సీపీ హయాంలో అయిదేళ్ళలో సుమారు 5.52 కోట్ల ఎకరాలకు ఉచిత పంటల బీమా కవరేజీ కల్పించాం. 2014-19 చంద్రబాబు హయాంలో ఉచిత పంటల బీమా కింద రైతులకు ఇచ్చింది కేవలం రూ.3,400 కోట్లు మాత్రమే. వైయస్ఆర్‌సీపీ హయాంలో పంట బీమా కింద ఇచ్చింది రూ.7800 కోట్లు. ఇదీ రైతులంటే వైయస్ జగన్ కు ఉన్న ప్రేమ.

 గత ఏడాది పంటల బీమాకు ఎగనామం

కూటమి ప్రభుత్వం గత ఏడాది ఉచిత పంటల బీమా పథకాన్నికి ఎగనామం పెట్టింది. ఏడాది కాలంగా రైతుల గోడు ప్రభుత్వానికి పట్టడం లేదు. రైతులకు ఈక్రాప్ వల్ల ఉచిత పంటల బీమాను పకడ్బందీగా అమలు చేశాం. దేశంలోనే తొలిసారిగా ఆర్బీకేను ఏర్పాటు చేసి విత్తు నుంచి విక్రయం వరకు రైతులకు బాసటగా నిలిచాం. వైయస్ఆర్‌ రైతుభరోసా కింద అయిదేళ్ళలో రూ.34,200 కోట్లను రైతుల ఖాతాలకు నేరుగా జమ చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని చెప్పి, నేటికీ దానిని అమలు చేయలేదు. ధాన్యం కొనుగోళ్ళకు సంబంధించి నెలలు గడుస్తున్నా వారికి చెల్లించాల్సిన డబ్బులను కూడా జమ చేయలేదు. మంత్రులు నాదెండ్ల మనోహర్‌ను రైతులు నేరుగా నిలదీస్తున్నా వారిలో చలనం కలగడం లేదు. ఒకవైపు ప్రభుత్వం నుంచి ధాన్యం కొనుగోళ్లు అరకొరగా చేస్తున్నారు, మరోవైపు మధ్యదళారీలు తక్కువ రేట్లకే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ధాన్యం అమ్మి రైతులు డబ్బు కోసం ఎదురుచూస్తుంటే ఈనాడుకు కనిపించడం లేదా? పొదిలిలో పొగాకు రైతులకు అండగా నిలబడేందుకు వైయస్ జగన్ వెడితే దాదాపు లక్ష మంది రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ గోడును ఆయన దృష్టికి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. వైయస్ జగన్ పర్యటన కాగానే వెంటనే ప్రభుత్వం హడావుడిగా పొగాకు కొనుగోళ్ళకు ప్రయత్నిస్తోంది. ఉచిత పంటల బీమాను ఎత్తివేయడం ద్వారా రైతులకు తీవ్రమైన అన్యాయం చేస్తోంది. రైతుల తరుఫున ప్రీమియను ప్రభుత్వమే చెల్లించి, రైతులను ఆదుకోవాలి. రైతు అమ్ముకునే సందర్బంలో గిట్టుబాటు ధర లేక అన్యాయమై పోతున్నాడు. ప్రజలు మాత్రం అధిక రేట్లకు కందిపప్పు కొనుగోలు చేస్తున్నారు. మధ్యలో దళారీలు దోచుకుంటున్నారు. వీరిపై కూటమి  ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. కంది రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలి, మార్కెట్‌లో కందిపప్పు రేట్లను నియంత్రించాలి. మామిడి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి.

Back to Top