కాకినాడ: కూటమి ప్రభుత్వం ప్రజలపై దుర్మార్గంగా మోపిన రూ.15,485 కోట్లు విద్యుత్ ఛార్జీల మోతకు వ్యతిరేకంగా వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఆందోళనలు విజయవంతం అయ్యాయని మాజీ మంత్రి, వైయస్‌ఆర్‌సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ప్రకటించారు. కాకినాడ క్యాంప్ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి, అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే భారీగా పెంచిన విద్యుత్ ఛార్జీలపై ప్రజల్లో పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమైందని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు వైయస్‌ఆర్‌సీపీ పోరుబాటలో స్వచ్ఛందంగా పాల్గొని, ప్రభుత్వ నిర్ణయంపై తమ అసంతృప్తి బహిర్గతం చేశారని చెప్పారు. కాకినాడ క్యాంప్ ఆఫీస్‌లో పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మీడియా సమావేశంలో మాట్లాడారు. మాజీ ప్రధానికి నివాళులు: ముందుగా మాజీ ప్రధాని డాక్టర్ మన్‌మోహన్‌సింగ్ మృతికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆయనకు మా నివాళులు అర్పిస్తున్నాం. దేశ ఆర్థిక పురోగతిలో మన్‌మోహన్‌సింగ్ పాత్ర వెలకట్టలేనిది. దేశానికి ఆయన అందించిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఈరోజు 175 నియోజకవర్గాల్లో వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు పార్టీ పోరుబాట కార్యక్రమం ప్రారంభించడానికి ముందు స్వర్గీయ మన్‌మోహన్‌సింగ్‌కు ఘనంగా నివాళులు అర్పించారు. ప్రధానిగా ఆయన పదేళ్లు దేశానికి అందించిన సేవలు ఎప్పటికీ మరువజాలం. ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేరు. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం: చంద్రబాబు పెంచిన కరెంటు ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కూడా నిరసనలకు వైయస్సార్సీపీ పిలుపునిచ్చింది. చంద్రబాబు ఛార్జీల రూపేణా ఇచ్చిన షాక్‌తో బెంబేలెత్తి పోతున్న ప్రజలంతా స్వచ్ఛందంగా తరలివచ్చి ఈ నిరసనల కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం విజయవంతం అయ్యింది. ఎన్నికలు జరిగి, కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తొలి ఏడు నెలల్లోనే కూటమి ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాల పట్ల రాష్ట్రంలో ఎలాంటి అభిప్రాయం ఉందో ఈ కార్యక్రమం ద్వారా వెల్లడి అయ్యింది. మొన్న ధాన్యానికి మద్దతు ధర విషయంలోనూ, రైతు భరోసా అమలు చేసే విషయంలోనూ, ఏడాదికి రూ.20 వేలు పెట్టుబడి సహాయం కింద అందిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ.. వైయస్‌ఆర్‌సీపీ జిల్లా కేంద్రాల్లో చేసిన ర్యాలీల కార్యక్రమం విజయం సాధిస్తే, ఇవాళ కరెంటు ఛార్జీల విషయంలో వైయస్సార్సీపీ పిలుపునకు పెద్ద ఎత్తున ప్రజలు స్పందించడంతో అవి కూడా గొప్పగా జరిగాయి. కూటమి ప్రభుత్వానికి దెబ్బ: ఇచ్చిన హామీలను పక్కన పెట్టి, వాగ్దానాలను పక్కనపెట్టి కేవలం కక్ష సాధింపు ధోరణితో ఈ ఆరునెలలుగా పరిపాలన చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ఇది పెద్ద దెబ్బ. ఆనాడు స్వర్గీయ వైయస్‌ఆర్ పేద విద్యార్ధుల కోసం ప్రారంభించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఈరోజు వరకు చెల్లింపులు జరగలేదు. దీనిపైన కూడా జనవరి 3వ తేదీన వైయస్‌ఆర్‌సీపీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను చేపట్టబోతోంది. పేదల ఆరోగ్యం కోసం అమలు చేసిన ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. అంబులెన్స్‌లు కూడా నడవని స్థితికి వైద్యరంగాన్ని తీసుకువచ్చాడు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పెద్ద సంఖ్యలో తొలగిస్తూ వారికి కూడా చంద్రబాబు షాక్ ఇచ్చారు. సూపర్ సిక్స్ కాదు... సూపర్ షాక్ ఇస్తున్నాడు చంద్రబాబు. ఆయనకు సొంత మీడియా ఉండటమే ఆయన అదృష్టం. ఆయన చేసే ప్రతిదాన్నీ ఆహా... ఓహో అంటూ కీర్తిస్తున్నాయి. ఉచిత ఇసుక అన్నారు. పేరులోనే ఉచితం ఉంది. మద్యం ప్రియులకు కూడా చంద్రబాబు సూపర్ షాక్ ఇచ్చాడు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు, అన్ని బ్రాండ్ లు తక్కువ రేటుకే ఇస్తారని భావించారు. ఎవరు చంద్రబాబును నమ్మితే వారికి షాక్ తప్పడం లేదు. ‘చంద్ర బాదుడు’కు వ్యతిరేకంగా రోడ్డెక్కిన జనం: ఆరు నెలల్లోనే విద్యుత్ ఛార్జీల రూపంలో వేల కోట్ల భారం మోపడాన్ని వ్యతిరేకించాం. తక్షణం ఛార్జీలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాం. ఎన్నికల సమయంలో ఎక్కడ సభలు నిర్వహించినా చంద్రబాబు ఒక్కటే చెప్పేవారు. ‘నేను అధికారంలోకి రాగానే విద్యుత్ చార్జీలను తగ్గిస్తాను. నాకు చాలా అనుభవం ఉంది’ అని నమ్మించాడు. ఇప్పుడు అధికారంలోకి రాగానే ప్లేట్ ఫిరాయించాడు. సూపర్‌సిక్స్‌తో సహా, ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కిన టీడీపీ కూటమి, విద్యుత్ ఛార్జీలపై ఇచ్చిన మాట కూడా మర్చి, ఆరు నెలల్లోనే రూ.15,485.36 కోట్ల బాదుడుకు తెర తీశారు. వాటిలో ఇప్పటికే నవంబరు బిల్లులో రూ.6 వేల కోట్లు వేయగా, వచ్చే నెల నుంచి మరో రూ.9412.50 కోట్ల బాదుడుకు సిద్ధమయ్యారు. దీంతో విద్యుత్ గృహ వినియోగదారులపై 25 నుంచి 55 శాతం వరకు అదనపు వడ్డన చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీల ఇళ్లకు నెలకు 200 యూనిట్ల వరకూ గత ప్రభుత్వం ఇచ్చిన ఉచిత విద్యుత్‌ను దూరం చేసి బిల్లులతో బాదేస్తున్న కూటమి ప్రభుత్వం ఇతర వర్గాలపైనా అలా పెనుభారం మోపింది. దళిత గిరిజన వాడల్లో కరెంట్ సిబ్బందిని చూసి భయబ్రాంతులకు గురి అయ్యేలా చేస్తున్నారు. కాకినాడ జిల్లాలో గిరిజనులు అర్థరాత్రి సమయంలో ధర్నాలు చేశారు. అధికారులు వారిని బతిమిలాడుతున్న సందర్భాలు ఉన్నాయి. అసమర్థతను కప్పి పుచ్చుకునే యత్నం: ఏది అడిగినా జగన్‌గారి పేరు చెప్పి తప్పించుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం హనీమూన్ పీరియడ్ అయిపోయింది. మాపైన బురద చల్లే మార్గాలు మూసుకుపోయాయి. పచ్చి అబద్దాలతో మ్యానిఫెస్టో రూపొందించారు. విద్యుత్ ఛార్జీల పేరుతో ఆందోళనలు జరుపుతుంటే కార్యకర్తలను బెదిరించారు. అన్ని వర్గాలను భయపెట్టే ప్రయత్నం చేశారు. పోలీసుల ద్వారా నాయకులను పిలిపించుకుని హెచ్చరికలు జారీ చేశారు. మీరు ఎన్ని చేసినా ప్రజాపోరు బాటను మాత్రం విడిచిపెట్టం. ఉచిత విద్యుత్ అంటే వైయస్ రాజశేఖరరెడ్డిగారు గుర్తుకు వస్తారు. ఆనాడు ఉచిత విద్యుత్ ఇస్తాను అని ఆయన హామీ ఇస్తే, ఆ కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకోవాలని చంద్రబాబు ఎద్దేవా చేశాడు. కానీ వైయస్‌ఆర్ గారు అధికారం లోకి వచ్చి ఏడు గంటల పాటు ఉచిత విద్యుత్ ను ఇచ్చి దేశంలోనే ఆదర్శకంగా నిలిచారు. తండ్రి ఏడు గంటలు ఇస్తే, ఆయన తనయుడు శ్రీ వైయస్ జగన్ ఏకంగా తొమ్మిది గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ ను రైతులకు ఇచ్చి కొత్త చరిత్రను సృష్టించారు. దాని కోసం ఫీడర్లను రెండువేల కోట్లతో ఆధునీకరించారు. కానీ నేడు ఏడు గంటల పాటు కూడా ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదు. అప్రకటిత విద్యుత్ కోతలను అమలు చేస్తున్నారు. కొత్త ఉచిత విద్యుత్ కనెక్షన్ లను నిలిపివేశారు. రైతులు దరఖాస్తులు ఇస్తున్నా వాటిని కనీసం తీసుకోవడం లేదు. వెంటనే ఈ దరఖాస్తులను పరిశీలించి, ఉచిత విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. షాక్‌ల మీద షాక్‌లు: 2024లో ప్రజలు చంద్రబాబును ముట్టుకున్నారు. ఇప్పుడు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. మనం కరెంట్ ను ముట్టుకుంటే షాక్ కొడుతుంది. కానీ 2024 ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబును ముట్టుకున్నారు. ఇప్పుడు భారీగా విద్యుత్ చార్జీల షాక్ కొట్టింది. గత ఏడు నెలలుగా చంద్రబాబు ప్రతినెలలోనూ షాక్ ఇస్తూనే ఉన్నాడు. ఏ ఒక్క వర్గాన్ని వదిలిపెట్టడం లేదు. సంపద çసృష్టి్టస్తానని కల్లబొల్లి కబుర్లు చెప్పి కేవలం తనకు, తన మనుషులకు ఆస్తులను సంపాదించుకోవడమే పనిగా పెట్టుకున్న నాయకుడి దుర్మార్గపు తీరును ప్రజలు ఎండగడుతున్నారు. సంపద సృష్టి కన్నా.. ‘చంద్ర బాదుడు’ భరించలేక పోతున్న ప్రజలు రోడ్డు మీదకు వస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు నెలల కాలంలోనే, ప్రజలు ఇలా రోడ్డెక్కి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం.. ఈ ప్రభుత్వంపై ప్రజలకున్న అభిప్రాయానికి నిదర్శనం. నిస్సిగ్గుగా అబద్ధాల ప్రచారం: పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో జనం కదం తొక్కారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పోరుబాటలో పాల్గొన్నారు. దీన్ని ముందే ఊహించిన టీడీపీ కూటమి నిన్నటి నుంచే దుష్ప్రచారం మొదలు పెట్టింది. నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు వల్లె వేస్తోంది. దానికి యథావిథిగా ఎల్లో మీడియా వంత పాడుతోంది. గత వైయస్సార్‌సీపీ ప్రభుత్వం 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిందని, తన హయాంలో పెంచిన ఛార్జీలపైనే ఇప్పుడు జగన్‌గారు ఆందోళనకు పిలుపునిచ్చారని పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. మరోవైపు వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో విద్యుత్ రంగంలో రూ.1.29 లక్షల కోట్లు నష్టాల్లో కూరుకుపోయిందంటూ కాకి లెక్కలు చెబుతూ, టీడీపీ నేతలు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతోపాటు, రూ.16 వేల కోట్ల ట్రూఅప్ ఛార్జీల భారం ఇప్పుడు పడుతోందంటూ టీడీపీ మంత్రులు అబద్ధాలు వల్లె వేస్తున్నారు. నిజానికి గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో, ఇదే ట్రూఅప్ ఛార్జీల భారం ప్రజలపై మోపకుండా, ప్రభుత్వం భరించింది. కానీ, ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం, ఆ భారాన్ని ప్రజలపై వేస్తూ, అందుకు గత వైయస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని నిందిస్తోంది. ఎంతకాలం అని ఇలా అబద్దపు బతుకులు బతుకుతారు? ఈ రోజుకు జగన్ గారినే దోషిగా నిలబెట్టాలని మీ ప్రభుత్వంలోని మంత్రులు మాట్లాడుతున్నారు. చంద్రబాబు విధానాలతోనే నష్టాల్లోకి విద్యుత్ రంగం: నిజానికి 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ నిర్వాకం వల్లనే రాష్ట్రంలో విద్యుత్ రంగం కష్టాలు, నష్టాల బాటలోకి మళ్లింది. డిస్కమ్‌ల అప్పులు, బకాయిలు పెరిగాయి. టీడీపీ ప్రభుత్వం దిగిపోతూ, పెద్ద ఎత్తున బకాయిలు కూడా పెట్టి పోయింది. టీడీపీ అధికారంలో ఉండగా దాదాపు రూ.20 వేల కోట్ల సర్దుబాటు ఛార్జీలను వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి అంటగట్టి దిగిపోయింది. అయినా సరే ఆ భారాన్నంతా ప్రజలపై మోపకుండా గత ప్రభుత్వం డిస్కంలకు సకాలంలో రాయితీలు అందించింది. ఇంకా 2014–19 వరకు టీడీపీ సర్కారు రూ.13,255 కోట్లు మాత్రమే సబ్సిడీల కింద చెల్లించగా, వైయస్సార్‌సీపీ అధికారంలో ఉండగా రూ.47,800 కోట్లను సబ్సిడీగా అందించింది. చంద్రబాబు రైతులకు ఎగ్గొట్టిన రూ.8,845 కోట్ల ఉచిత విద్యుత్ బకాయిలను సైతం వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వమే చెల్లించింది. వాస్తవాలన్నీ ఇలా ఉంటే, అన్నీ కనుమరుగు చేస్తూ, గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంపై నిందలు వేస్తూ, కాలం వెళ్లదీసే పని కూటమి ప్రభుత్వం చేస్తోంది. ఇప్పటికే విద్యుత్ ఛార్జీలు ప్రజల నడ్డి విరుస్తుండగా, దాన్నుంచి ఎలాగైనా ప్రజల దృష్టి మళ్లించాలని చూస్తున్నారు. నాడు తీవ్ర నష్టాల్లో డిస్కమ్‌లు: 2014లో చంద్రబాబు సీఎం అయ్యే నాటికి పవర్ డిస్కమ్‌ల నష్టాలు రూ.6625 కోట్లు ఉండగా, ఆయన దిగిపోయే నాటికి డిస్కమ్‌ల నష్టాలు ఏకంగా రూ.28,715 కోట్లకు పెరిగాయి. అంటే చంద్రబాబు హయాంలో ఏకంగా రూ.22 వేల కోట్ల నష్టాలు పెరిగాయి. అదే మా ప్రభుత్వ హయాంలో డిస్కమ్‌ల నష్టాలు కేవలం రూ.395 కోట్లు మాత్రమే అదనంగా పెరిగాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి 2014లో డిస్కమ్‌ల అప్పులు రూ.29,552 కోట్లు ఉంటే, ఆయన దిగిపోయే నాటికి ఆ అప్పులు ఏకంగా రూ.86,215 కోట్లకు పెరిగాయి. అంటే ఆయన హయాంలో డిస్కమ్‌ల అప్పులు ఏకంగా రూ.56,664 పెరిగాయి. అంటే ఏటా సగటున పెరిగిన అప్పు 23.88 శాతం కాగా, మా ప్రభుత్వ హయాంలో డిస్కమ్‌ల అప్పులు రూ.86 వేల కోట్ల నుంచి రూ.1.22 లక్షల కోట్లకు పెరిగాయి. అంటే కేవలం రూ.36 వేల కోట్లు మాత్రమే పెరిగాయి. అంటే ఏటా పెరిగిన సగటు అప్పులు కేవలం 7.28 శాతం మాత్రమే. చంద్రబాబు. అవినీతి ఒప్పందాలు: చంద్రన్న వెలుగులు.. జిలుగులు అంటూ రకరకాల ప్రచారం చేసుకుంటున్నారు. కానీ వాస్తవాలు ఒక సారి పరిశీలిస్తే.. 2014–19 మధ్య జరిగిన ఒప్పందాలు చూస్తే విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో ఎవరు విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేశారో అర్థమవుతుంది. రాష్ట్రంలో 2015–19 మధ్య 3,494 మెగావాట్ల విండ్ పవర్‌కు 133 విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) జరిగాయి. 2015కు ముందు గరిష్టంగా యూనిట్‌కు రూ.3.74 చెల్లిస్తే, చంద్రబాబు 2015 నుంచి యూనిట్‌కు రూ.4.84 చొప్పున చెల్లించారు. 25 ఏళ్లపాటు అమల్లో ఉండేలా జరిగిన ఆ పీపీఏల వల్ల డిస్కమ్‌లు రూ.52 వేల కోట్ల భారం మోయాల్సి వస్తోంది. సోలార్ పవర్ విషయంలోనూ చంద్రబాబు ఇలానే చేశారు. 2015–19 మధ్య 2,400 మెగావాట్ల కోసం చంద్రబాబు 35 పీపీఏలు చేసుకున్నారు. యూనిట్ గరిష్ట ధర రూ.6.99 మొదలు రూ.6.80 వరకు చెల్లించేలా ఆ ఒప్పందాలు చేసుకున్నారు. మరి ఇది అవినీతి కాదంటారా? దీని వల్ల మరో రూ.37,500 కోట్ల భారం. బురద చల్లడమే చంద్రబాబు పని: చంద్రబాబు అంటేనే డైవర్షన్. కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రం చేసుకున్న ఒప్పందాల్లో లంచాల ప్రస్తావన ఉంటుందా? చంద్రబాబు యూనిట్ విద్యుత్‌కు రూ.6 చొప్పున ఒప్పందం చేసుకుంటే, జగన్‌గారు కేవలం రూ.2.49కే ఒప్పందం చేసుకుంటే ఎందులో అవినీతి జరిగినట్లు? జగన్‌గారు తనపై ఎల్లో మీడియా రాసిన అబద్దపు కథనాలపై సుప్రీంకోర్టులో పరువు నష్టం దావా వేశారు. అయినా కూడా వారిలో మార్పు రావడం లేదు. ఉదాహరణకు.. హెరిటేజ్ నుంచి రోజుకు వంద ప్యాకెట్ల పాలు కావాలని ఎవరైనా వినియోగదారుడు వారితో ఒప్పదం చేసుకుంటే, హెరిటేజ్ రైతుల నుంచి పాలను సేకరించి, వినియోగదారుడికి అమ్ముతుంది. ఇందులో వినియోగదారుడికి, రైతుకు మధ్య సంబంధం ఉంటుందా? అలాగే సెకీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు చేస్తుంది. ఈ విద్యుత్‌ను సెకీ ఎవరి నుంచి సమీకరించుకుంటుంది అనేది రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం? నిద్ర నటిస్తూ, తెలిసి అబద్దాలు చెబుతున్న చంద్రబాబుకు తాను బురద చల్లుతున్నాను అనే విషయంలో చాలా స్పష్టత ఉంది. అందుకే ఏ చిన్న అవకాశం దొరికినా బురద చల్లాలనుకునే చంద్రబాబు, తన అనుకూల ఎల్లో మీడియాను ఉపయోగించుకుని తప్పుడు రాతలు రాయిస్తున్నారు. అవన్నీ చూపగలరా? ఆ ధైర్యం ఉందా?: పన్నులు పెంచడం, విద్యుత్ ఛార్జీల మోత. సంపద సృష్టి అంటే అదేనా? వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో తొమ్మిదిసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచామని ఆరోపిస్తున్న కూటమి మంత్రులు దాన్ని చూపించాలి. రాష్ట్రంలో చెత్తపన్ను తొలగించామని చెబుతున్నారు. నిజంగా చెత్తపన్ను రద్దు చేశారా? గత ప్రభుత్వం కన్నా ఎక్కువ పన్నును ఇప్పుడు వసూలు చేస్తున్నారు. పంచాయతీలు, గ్రామాల్లో కూడా ఇంటి పన్నులను పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జగన్‌గారి హయాంలో ఇలా ఇంత పెద్ద ఎత్తున ఇంటి పన్ను పెంచారా? ఒకవైపు పన్నుల పెంపు. మరోవైపు విద్యుత్ ఛార్జీల మోత.. ద్వారా చంద్రబాబు సంపద సృష్టిస్తున్నారు. కూటమి పాలనంతా తిరోగమనం: కూటమి పాలనలో రాష్ట్ర జీడీపీ పడిపోయింది. కొత్త పరిశ్రమలు లేవు. ఉపాధి అవకాశాలు లేవు. ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది. తమను తాము కీర్తించుకోవడానికే కూటమి ప్రభుత్వం పరిమితమైంది. వైయస్‌ఆర్‌సీపీ పోరుబాట ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మనోభావాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చాం. ప్రతి నియోజకర్గంలో ప్రజలు బయటకు వచ్చి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మేము మీ మాదిరిగా ప్రతి దాన్ని రాజకీయం చేయాలని అనుకోవడం లేదు. ప్రజల పక్షాన వారి గళం వినిపించడమే మా లక్ష్యం. శాంతియుతంగా అన్ని నియోజకవర్గాల్లో ఆందోళనలు క్రమశిక్షణతో నిర్వహించాం. మరోసారి ఈ ప్రభుత్వానికి చెబుతున్నాం. వైయస్‌ఆర్‌సీపీ పోరుబాటను చూసిన తరువాత అయినా పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని సూచిస్తున్నాం.