శ్రీకాకుళం: కాశీబుగ్గ ఆలయంలో జరిగిన దుర్ఘటనకు కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలని వైయస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. తొక్కిసలాట ఘటనలో భక్తులు మరణించడం పట్ల ఆయన దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ..`కాశీబుగ్గ తొక్కిసలాటలో అమాయకులైన భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దైవ దర్శనానికి ఇంత పెద్ద సంఖ్యలో వస్తున్నారని తెలియదా?. ప్రతి ఏటా ఈరోజున ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తారు కదా?. ముందస్తు సమాచారం ఉన్నా పోలీసులు ఎందుకు భద్రత ఇవ్వలేదు. ఇది పూర్తిగా పాలనా వైఫల్యం. ఈ దుర్ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలి. గత అనుభవాలనుంచి ప్రభుత్వం పాఠాలు నేర్చుకోలేదు. ఈ ఘటన మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియజేయాలని కోరారు` అని ధర్మాన పేర్కొన్నారు. అమరజీవికి ఘన నివాళులు శ్రీకాకుళం పట్టణం పాత బస్ స్టాండ్ కూడలిలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి వైయస్ఆర్సీపీ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ..`ఈనాడు ఉన్న మన రాష్ట్రం మూడు జన్మలెత్తి మూడు సార్లు స్వరూపాన్ని మార్చుకుంది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో అంతర్భాగమై ఉండేది. మొదటి సారి 1953, అక్టోబర్ 1 న మద్రాస్ నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం గా అవతరించింది. 1956,నవంబర్ 1న తెలంగాణతో కలిసి ఆంధ్రప్రదేశ్ గా ఏర్పాటు అయ్యింది. మూడో సారి తెలంగాణ నుండి విడిపోయి జూన్ 2, 2014 నాడు ప్రస్తుత రాష్ట్రం ఏర్పాటయ్యింది. మొట్టమొదటసారి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పాటు వెనుక ఒక సుదీర్ఘ చరిత్ర..పోరాటం ఉన్నాయి. మహానుభావులు పొట్టి శ్రీరాములు ఆత్మ బలిదానం ఉంది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడక ముందు తెలుగు వారు ఆనాటి మద్రాస్ ప్రెసిడెన్సీ లో పౌరులుగా ఉండేవారు. అటు మద్రాస్, కర్ణాటక రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో తెలుగు వారు ఉన్నప్పటికీ మనకు రాష్ట్రం లేని రోజులవి. అందువల్ల తెలుగు వారి ఉనికికి ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది కాదు. ఇది చాలా మందిని బాధించేది. అందరి కన్నా పొట్టి శ్రీరాములు గారిని ఎక్కువ బాధించింది. మద్రాస్ రాష్ట్రం లో ప్రభత్వం నడువుతున్నది కాంగ్రెస్ పార్టీ , ముఖ్యమంత్రి గా చక్రవర్తుల రాజగోపాలాచారి ఉన్నారు. ఆనాడు అటు కేంద్రంలోగాని, ఇటు రాష్ట్రంలోగాని ఉన్న ప్రభుత్వాలకు తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడానికి ఇష్టం లేదు. అటువంటి రాజకీయ నేపథ్యంలో శ్రీరాములు ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం సాధించాలని సంకల్పించారు. వెంటనే మద్రాస్ వెళ్లి బులుసు సాంబ మూర్తి గారింట్లో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. అప్పటికే శ్రీరాములు స్వాతంత్ర్య సమర యోధునిగా, గాంధీ అనుయాయునిగా దేశమంతా గొప్ప పేరున్న జాతీయ నాయకుడు . కుటుంబాన్నీ, ఆస్థి పాస్తుల్నీ వదిలేసి దేశ సేవకు అంకితమైన నాయకుడు. మనకు అక్టోబర్ ఒకటి 1953లో ఆంధ్ర రాష్ట్రంగా, స్వాతంత్య్రం తర్వాత వచ్చిన భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడింది. మన రాష్ట్రం ఏర్పాటుకు ప్రాణ త్యాగం చేసిన ఒక మహానుభావుడ్ని తలుచుకునేందుకు ఒక రోజేమిటి ? ఆనాటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడిన తేదీ ఇది ఒకటి కాదు , రెండు కాదు...ఏకంగా 56 రోజులు నిరాహార దీక్ష చేశారు. దీక్ష విరమించమని ఎంత మంది చెప్పినా వినేవారు కాదు.తెలుగు వారు ఎక్కడున్నా , ఈ రాష్ట్రం సాధించడానికి, గాంధీ అనుచరుడు పొట్టి శ్రీ రాములు గొప్ప త్యాగం చేశారు, ఆనాడు ప్రాణ త్యాగం చేసిన శ్రీ రాములు పార్థివ దేహం చూడ్డానికి, మోయడానికి పెద్దలు ఎవ్వరు ముందుకు రాలేదు, అంతగా భయపెట్టాడు రాజాజీ, ఘంట శాల చొరవతో అంతిమ యాత్రలో ప్రజలు వచ్చి పాల్గొన్నారు. భయంకర మైన మరణ వేదన అనుభవిస్తూ 1952 డిసెంబర్ 15 న నాడు ఆత్మ బలిదానం చేసున్నారు పొట్టి శ్రీరాములు. దేశ భక్తుడు, గాంధీ అనుచరుడు, స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న సాధారణ అయినటువంటి వ్యక్తి శ్రీ పొట్టి శ్రీరాములు త్యాగం వల్ల ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయగలిగారు. ఆయన త్యాగం మూలంగానే ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలు వర్ధిల్లుతున్నాయి. తెలుగు వారు గా చెప్పుకునే విధంగా గర్వంగా ఉన్నామంటే.. పొట్టి శ్రీ రాములు త్యాగమే, వారు ఎక్కడున్నా వారి ఆత్మ శాంతి చేకూరాలని, వారి ఆశీస్సులు తెలుగు వారందరి పైన ఉండాలని కోరుకుంటున్న అని మాజీ మంత్రి ధర్మాన పేర్కొన్నారు. కార్యక్రమంలో వైయస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, శ్రీకాకుళం పార్లమెంట్ పార్టీ సమన్వయకర్త తమ్మినేని సీతారాం, జిల్లా పరిషత్ చైర్మన్ ప్రిరియా విజయ, యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు, జిల్లా పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.