రాజమండ్రి: వివిధ అంశాలపై వరుసగా ఘోర వైఫల్యం చెందుతున్న ప్రభుత్వం.. ప్రజలకు సమాధానం చెప్పుకోలేక బీసీ నాయకుడు జోగి రమేశ్ ని అక్రమంగా అరెస్ట్ చేసిందని తూర్పు గోదావరి జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రిలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మోంథా తుపాన్, కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట ఘటనల్లో ఘోరంగా విఫలమైన కూటమి ప్రభుత్వం వాటి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు జోగి రమేశ్‌ను అరెస్ట్ చేసిందన్నారు. జోగి రమేశ్‌ని అరెస్ట్ చేసి బీసీలను అణచివేయాలని చూస్తున్న చంద్రబాబుకి దమ్ముంటే, నకిలీమద్యం కేసులో అడ్డంగా దొరికిన టీడీపీ నాయకులు జయచంద్రారెడ్డి, స్పీకర్ అయ్యన్నపాత్రుడి అనుచరుడు రాములను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట జరిగి 9 మంది అమాయక భక్తులు ప్రాణాలు కోల్పోతే అది ప్రైవేట్ ఆలయం అంటూ ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తుందని, మరోపక్క మోంథా తుపాన్‌తో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలోనూ ఈ ప్రభుత్వం తీవ్రంగా వైఫల్యం చెందిందని స్పష్టం చేశారు. దీంతోపాటు చంద్రబాబు లండన్ పర్యటనపై కూడా కాసేపు వ్యక్తిగత పర్యటన అని, కాసేపు పెట్టుబడుల ఆకర్షణ కోసం అంటూ ప్రజలకు అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామి వారి దర్శనం కోసం వెళ్లి అసువులుబాసిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తూ ఈరోజు(ఆదివారం) రాత్రి వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ వెల్లడించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే జోగి అరెస్ట్ ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వం రాజ్యాంగ బద్దంగా పరిపాలన సాగించాలి. ప్రజలకు జవాబుదారీతనంతో వ్యవహరించాలి. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇవేవీ పాటించకపోగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకు వైయస్ఆర్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి ఏకాదశి సందర్భంగా భక్తులు పోటెత్తితో రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం చోద్యం చూసింది. దీంతో 9 మంది అమాయక భక్తులు చనిపోయారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యంతో వ్యవహరించడం వల్లనే భక్తులు చనిపోయారు. దీనికి బాధ్యత తీసుకోవాల్సిన ప్రభుత్వం, అది ప్రైవేటు ఆలయం అని చెప్పి చేతులు దులిపేసుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం చేతులెత్తేయడమే కాకుండా దాన్నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. ఇంకోపక్క మోంథా తుపాన్ కారణంగా లక్షల ఎకరాల్లో పంట నీటమునిగిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఎన్యుమరేషన్ ప్రక్రియ సరిగా జరగడం లేదు. ఈ రెండు అంశాల్లో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. దీన్నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు నకిలీ లిక్కర్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చి మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ జోగి రమేశ్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారు. మోంథా తుపాన్‌తో రైతులకు తీవ్ర నష్టం వైయస్ఆర్‌సీపీ హయాంలో 84.8 లక్షల మంది రైతులు ఉచిత పంటల బీమా పరిధిలో ఉన్నారు. ఇందులో 54.55 లక్షల మంది రైతులకు రూ.7,802 కోట్ల పంట నష్ట పరిహారం అందితే, కూటమి ప్రభుత్వం వచ్చాక ఉచిత పంటల బీమా పథకాన్ని పూర్తిగా ఎత్తేశారు. మోంథా తుపానుతో సుమారు 15 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం జరిగింది. సొంతంగా ప్రీమియం కట్టుకున్న కేవలం 19 లక్షల మంది రైతులే పంటల బీమా పరిధిలోకి వస్తున్నారు. బీమా లేని మిగతా రైతుల పరిస్థితి ఏంటి? వీరందరికీ గతంలో వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో మాదిరిగా ఈ-క్రాప్, ఉచిత పంటల బీమా జరిగి ఉంటే ఈ విపత్తు సమయంలో ఎంతో భరోసాగా ఉండేది. కానీ రైతులను ఈ ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసింది. ఈ 18 నెలల కాలంలో పంట నష్ట పరిహారం కింద రైతులకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. రైతులకు ఇవ్వాల్సిన రూ.600 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని బకాయి పెట్టారు. వైయస్ఆర్‌సీపీ హయాంలో ఇచ్చిన పథకాలతోపాటు సూపర్ సిక్స్ అమలు చేస్తామని చెప్పిన చంద్రబాబు ప్రజలను పూర్తిగా వంచించాడు. అప్పుల పేరుతో తప్పుడు లెక్కలు చెప్పి తప్పించుకోవాలని చూసి అడ్డంగా దొరికిపోయాడు. సంపద సృష్టిస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నాడు. అతి తక్కువ సమయంలోనే కూటమి ప్రభుత్వం ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత తెచ్చుకుంది. దీనిపై ప్రజల దృష్టిని మరల్చేందుకు పదే పదే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. టీడీపీ నాయకుల ఆధ్వర్యంలోనే నకిలీ మద్యం తయారీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం తయారీ యూనిట్లు కుటీర పరిశ్రమల మాదిరిగా వెలిశాయి. ప్రభుత్వ ఆధీనంలో నడిచిన మద్యం దుకాణాలను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టి నకిలీ మద్యం విక్రయాలకు మార్గం సుగమం చేసుకుంది. వైయస్ఆర్‌సీపీ హయాంలో మద్యం బాటిళ్లపై క్యూఆర్ కోడ్ ఉంటే దాన్ని ఎత్తేశారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షకుపైగా బెల్ట్ షాపులు ఏర్పాటు చేశారు. మద్యం దుకాణాలకు అనుబంధంగా అనధికార పర్మిట్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. వేళాపాలా లేకుండా రాత్రింబవళ్లు మద్యం దుకాణాలు నడిపించరు. వీటి ద్వారా ములకలచెరువులో తయారు చేసిన నకిలీ మద్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా చేసి విచ్చలవిడిగా తాగించారు. ములకలచెరువుతోపాటు ఇబ్రహీంపట్నం, ఏలూరు, పాలకొల్లు, రేపల్లె, అనకాపల్లి తదితర ప్రాంతాల్లో నకిలీ మద్యం దొరికితే అన్నిచోట్లా టీడీపీ నాయకుల పాత్ర ఉన్నట్టు అధికారులు నిర్ధారించారు. ములకలచెరువులో తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి జయచంద్రారెడ్డి నేతృత్వంలో భారీ ఎత్తున నకిలీ మద్యం తయారవుతున్న వ్యవహారం బట్టబయలు కావడంతో మద్యం బాటిళ్లపై క్యూఆర్ కోడ్ వేస్తున్నట్టు జీవో ఇచ్చి ఈ ప్రభుత్వం కొత్త నాటకానికి తెరదీసింది. నకిలీ మద్యం దొరికితే రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించలేదు. నకిలీ మద్యం వ్యవహారంలో జయచంద్రారెడ్డి ప్రధాన నిందితుడైతే ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసి చంద్రబాబు చేతులు దులిపేసుకున్నాడు. గత నెల అక్టోబర్ 3న ములకలచెరువులో నకిలీ మద్యం వ్యవహారం వెలుగుచూస్తే అప్పట్నుంచి నెలరోజులుగా మిన్నకుండిపోయిన ప్రభుత్వం.. మోంథా తుపాన్, కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట ఘటనతో ఘోరంగా విఫలమైంది. వీటితోపాటు చంద్రబాబు వ్యక్తిగతంగా లండన్ పర్యటన పెట్టుకున్నారు. ఈ అంశాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు నకిలీ మద్యం కేసుతో ఏమాత్రం సంబంధం లేని మాజీ మంత్రి జోగి రమేశ్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారు. జోగి రమేశ్‌ను అరెస్ట్ చేయడానికి జనార్దన్‌రావును అడ్డం పెట్టి డ్రామా నడిపించారు. చంద్రబాబు లండన్ పర్యటనపైనా అబద్ధాలు చెబుతున్నారు. కాసేపు వ్యక్తిగత పర్యటన అంటూ కాసేపు పెట్టుబడుల కోసమంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కొలికిపూడి ఆరోపణలపై విచారణ చేసే దమ్ముందా? అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జోగి రమేశ్‌ను అరెస్ట్ చేయడమే చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. బీసీ నాయకుడిని అణచివేయాలని కుట్రలు చేస్తున్నాడు. వైయస్ఆర్‌సీపీ అధికారంలో ఉండగా వైయస్ జగన్‌ని వ్యక్తిగతంగా దూషించడంపై చంద్రబాబుని జోగి రమేశ్ ప్రశ్నించారు. ఆ సమయంలో నేరుగా చంద్రబాబు ఇంటికి వెళ్లిన జోగి రమేశ్ మీద లోకేశ్ కక్ష పెంచుకున్నాడు. ఆ కక్షతోనే అక్రమ కేసులో జోగి రమేశ్‌ను అరెస్ట్ చేశారు. నకిలీ లిక్కర్ వ్యవహారంతో తనకు ఏమాత్రం సంబంధం లేదని కుటుంబసభ్యులతో కలిసి జోగి రమేశ్ విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో ప్రమాణం చేశారు. ఈ వ్యవహారంలో తాను లై డిటెక్టర్ టెస్టుకు కూడా సిద్ధమని ప్రకటించారు. దీంతోపాటు ఈ కేసులో తన పేరును అక్రమంగా ఇరికించినప్పుడే సీబీఐ దర్యాప్తు చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడమే కాకుండా సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ నేరుగా హైకోర్టును కూడా ఆశ్రయించారు. దానికి సమాధానం చెప్పుకునే దమ్ములేని చంద్రబాబు ప్రభుత్వం జోగి రమేశ్‌ను అక్రమంగా అరెస్ట్ చేసింది. చంద్రబాబుకి నిజంగా దమ్ముంటే టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ చేస్తున్న ఆరోపణలపై కూడా విచారణ చేయించాలి. కూటమి ప్రభుత్వం జోగి రమేశ్ అరెస్ట్ మీద చూపిన శ్రద్ద స్వామివారి భక్తులకు రక్షణ కల్పించడంపైన పెట్టి ఉంటే 9 మంది ప్రాణాలు పోకుండా ఉండేవి. ఇకనైనా నారావారి సారా సీరియల్‌కి ముగింపు పలకాలి. ప్రతిపక్ష గొంతునొక్కడంపై కాకుండా ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడంపై చిత్తశుద్ధితో పనిచేయాలి. ప్రజల పక్షాన ప్రశ్నిస్తానని నమ్మబలికిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలయాల్లో వరుసగా జరుగుతున్న ఘోరాలపై నిజాయితీగా స్పందించాలి. స్వామి వారి దర్శనం కోసం వెళ్లి అసువులుబాసిన మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఈరోజు రాత్రి వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది.