వైద్య విద్యార్థులపై పోలీసుల దాడిని ఖండిస్తున్నాం 

డాక్టర్స్‌ డే రోజున ఈ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరించింది 

అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలి.

మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్‌

తాడేప‌ల్లి: వైద్య విద్య పూర్తి చేసిన విద్యార్థులపై డాక్టర్స్‌ డే రోజునే జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. చంద్రబాబు ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా వ్యవహరించింది. విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసుకుని, ఎంసీఏ పరీక్షల్లో ఉత్తీర్ణులై, ఢిల్లీ వెళ్లి సర్టిఫికెట్లు తెచ్చుకుని, ఏడాదిపాటు ఇంటర్నెషిఫ్‌ పూర్తిచేసుకుని, ఇలా అన్ని రకాల అర్హత సాధించిన వారికి పర్మినెంట్‌ రిజిస్ట్రేషన్‌ చేయడంలో ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏముంది? ఎందుకు ప్రభుత్వం ఇంతకాలం నిర్లక్ష్యంగా వ్యవహరించింది? తల్లిదండ్రులు ఆస్తులు అమ్ముకుని, అప్పులు చేసి కోట్ల రూపాయలు ఖర్చు చేసి తమ పిల్లలను విదేశాల్లో డాక్టర్లుగా చదివించుకోవడం నేరమా? తమకు వెంటనే రిజిస్ట్రేషన్‌ చేయాలంటూ వారు డిమాండ్‌ చేయడం, శాంతియుతంగా నిరసన తెలపడం తప్పు అవుతుందా? బాధ్యతగా వ్యవహరించాల్సిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వారిపై వార్నింగ్‌ ఇవ్వడమేంటి? దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఓవైపు రాష్ట్రంలో వైయస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకు వచ్చిన మెడికల్‌ కాలేజీల్లో పనులు అడ్డుకుని, సీట్లు పెరగనీయకుండా ఈ ప్రభుత్వంలో ఉన్నవారే అడ్డుకున్నారు. కేంద్రం ఇచ్చిన సీట్లు తీసుకోకుండా తిరస్కరించారు.అవినీతికి పాల్పడుతూ ఈ మొత్తం కాలేజీలను తమ వాళ్లకు కట్టబెట్టే దిశగా కదులుతున్నారు. మరోవైపు ఇక్కడ సీట్లు లేక, విదేశాల్లో చదువులు పూర్తిచేసుకున్న వైద్య విద్యార్థులకు పర్మినెంట్‌ రిజిస్ట్రేషన్‌ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. తక్షణమే విద్యార్థుల డిమాండ్లను పరిష్కరించాలి. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలి. పర్మినెంట్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ఆలస్యం వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి.
 

Back to Top