పల్నాడు: అధికారం ఉన్నపుడే కాదు ప్రతిపక్షంలో ఉన్న కూడా అభివృద్ధి ధ్యేయంగా పనిచేయడమే వైయస్ఆర్‌సీపీ అజెండా అని వైయస్ఆర్‌సీపీ నేత, గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 15వ తేదీ జానపాడు-పిడుగురాళ్ల మధ్య నిర్మించతలపెట్టిన ఆర్‌వోబీ బ్రిడ్జి శంకుస్థాపన కార్యక్రమంపై ఆయన స్పందించారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. కాసు మహేష్ రెడ్డి ఏమన్నారంటే..`అధికారంలో ఉన్నప్పుడే అభివృద్ధి చేయడం కాదు..ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా బాధ్యతగా వ్యవహరిస్తూ అధికార పార్టీపై ఒత్తిడి తెచ్చి గత ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడమే వైయస్ఆర్‌సీపీ అజెండా. గురజాల నియోజకవర్గంలోని జానపాడు-పిడుగురాళ్లకు మధ్య ఆర్‌వోబీ బ్రిడ్జిని రూ.52 కోట్ల నిధులతో 2022వ సంవత్సరంలో వైయస్ జగన్ ప్రభుత్వంలో మంజూరు చేయించాం. టెండర్లు పూర్తి చేయించి ఏజెన్సీ ద్వారా 2023వ సంవత్సరంలో పనులు కూడా మొదలుపెట్టాం. అక్కడున్న ఆక్రమణలు తొలగించి, విద్యుత్ స్తంభాలను కూడా తొలగించి నూతన లైన్ ఏర్పాటు చేయించాం. ఇక పనులు ముమ్మరంగా సాగుతాయనుకుంటున్న సమయంలో ప్రభుత్వం మారింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఈ పనులు ఒక్క అంగుళం కూడా జరుగలేదు. అందుకే రెండు,మూడు నెలల నుంచి మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి, సెల్ఫీ వీడియోల ద్వారా ఈ ప్రభుత్వంపై ఉద్యమాన్ని మొదలుపెట్టాం. హైకోర్టులో కూడా ఒక ప్రజా ప్రయోజన వ్యాఖ్యాన్ని దాఖలు చేశాం. మా పోరాటం పీఎం ఫేషీ వరకు చేరడం, వాళ్లు రాష్ట్ర ప్రభుత్వానికి అక్షింతలు వేయడంతో వెంటనే పనులు మొదలుపెట్టేందుకు కదిలారు. ఈ నెల 15వ తేదీ ఆర్‌వోబీ బ్రిడ్జికి మళ్లీ శంకుస్థాపన చేయాలని నిర్ణయం తీసుకున్నారు. శంకుస్థాపనలకు మేం అడ్డు చెప్పడం లేదు. ఇంకా 10 సార్లు శంకుస్థాపనలు చేసినా మాకు అభ్యంతరం లేదు. మాకు కావాల్సింది బ్రిడ్జి పనులు పూర్తి కావాలి. ఈ ప్రాంతంలో ఉన్న రహదారి కష్టాలు, ట్రాఫిక్ సమస్యలు పరిష్కారం కావాలి. మేం నాటిన విత్తనం వృక్షమై ఫలాలు ఇవ్వాలి.ఆ బ్రిడ్జి పూర్తి అయితే జానపాడు రూపురేఖలు మారుతాయి, పిడుగురాళ్లకు ట్రాఫిక్ సమస్య తీరుతుంది. ఇందుకోసం ఎటువంటి కార్యక్రమాలు చేపట్టిన మేం స్వాగతిస్తాం. బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయ్యే వరకు మా ఉద్యమం కొనసాగుతోంది. అలాగే పిల్లలు ఆడుకోవడానికి, ప్రజలకు ఆహ్లాదవాతావరణం కోసం పిడుగురాళ్ల పట్టణానికి మంచి పార్కు ఉండాలి. ఇందుకోసం మా ప్రభుత్వంలో స్వచ్ఛభారత్ కింద నిధులు మంజూరు చేయించాం. ఈ పనులు కూడా పూర్తి చేయాలి. అభివృద్ధికి మేం ఎప్పుడు మద్దతుగానే ఉంటాం. ఈ పనులు పూర్తి అయ్యే వరకు వైయస్ఆర్‌సీపీ పోరాడుతూనే ఉంటుంది` అంటూ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి విడుదల చేసిన వీడియోలో స్పష్టం చేశారు.