రాష్ట్రంలో మహిళలు, బాలికలకు భద్రత కరువు 

వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయ‌స్‌ జగన్ ఫైర్‌

శాంతిభద్రతల నిర్వహణలో సీఎం ఘోరంగా విఫలం 

రెడ్‌బుక్‌ రాజ్యాంగం, డైవర్షన్‌ పాలిటిక్స్‌పై మాత్రమే దృష్టి 

కేసుల దర్యాప్తు మీద, నేరాల అదుపు మీద బాధ్యతే లేదు 

తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా తన్మయిని కాపాడలేకపోయారు

తాడేప‌ల్లి: చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందని వైయ‌స్ఆర్‌సీపీ అధ్య­క్షుడు, మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. అనంతపురంలో ఇంటర్మీడియెట్‌ చదువుతున్న గిరిజన బాలిక సాకె తన్మయి కనిపించడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా, రక్షించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ హత్యా ఘటనకు ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ‘రాష్ట్రంలో మహిళలకు, బాలికలకు రక్షణ, భద్రత లేకుండాపోయింది. శాంతిభద్రతల నిర్వహణలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఫల్యం ఇలాంటి దారుణాల రూపంలో ప్రతిరోజూ కనిపిస్తూనే ఉంది. 

అనంతపురంలో ఇంటర్మీడియెట్‌ చదువుతున్న గిరిజన బాలిక సాకె తన్మయిని అత్యంత దారుణంగా హత్య చేశారు. తమ కుమార్తె కనిపించడం లేదని ఈ నెల 3న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఆ అమ్మాయిని రక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఆరు రోజుల తర్వాత కూడేరు మండలం బ్రాహ్మణపల్లె సమీపంలో తన్మయి మృతదేహాన్ని గుర్తించారు. 

తన్మయి హత్య పూర్తిగా యంత్రాంగ వైఫల్యమే. ఒక అమ్మాయి కనిపించడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినప్పుడు అక్కడ పోలీసులు ఏం చేస్తున్నారు? ప్రభుత్వం ఏం చేస్తోంది? ఆరు రోజుల క్రితం ఫిర్యాదు వచ్చినా సరే ఎందుకు పట్టించుకోలేదు? అసలు రాష్ట్రంలో కేసుల దర్యాప్తు మీద, నేరాల అదుపు మీద దృష్టి ఉందా? కేవలం రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు, డైవర్షన్‌ పాలిటిక్స్‌ తప్ప.. ఈ ప్రభుత్వానికి ప్రజల రక్షణ పట్ల బాధ్యత అనేది ఉందా? తన్మయి హత్యా ఘటనకు ముఖ్యమంత్రి, ప్రభుత్వం బాధ్యత వహించాలి’ అని నిప్పులు చెరిగారు.    

Back to Top