తాడేపల్లి: ఢిల్లీలోని మాలవీయనగర్ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం జరగడం అత్యంత బాధాకరమని పేర్కొన్న ఆయన, మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ఈ తీరని విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని దేవుడు ప్రసాదించాలని ప్రార్థించారు. అగ్నిప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన వైయస్ జగన్, ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపడుతున్న సిబ్బందిని అభినందించారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ఆయన ప్రార్థించారు. ఈ ప్రమాదంలో విదేశీయులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు వస్తున్న వార్తలు మరింత ఆవేదన కలిగిస్తున్నాయని వైయస్ జగన్ పేర్కొన్నారు.