చంద్రబాబు దగ్గర పాలేరుతనం చేస్తుంది నువ్వు కాదా.. పవన్‌..?

మాజీమంత్రి శ్రీ పేర్ని వెంకట్రామయ్య(నాని)  

నీ తల్లిని తిట్టినందుకు లోకేశ్‌ క్షమాపణలు చెప్పాడా..?

 పేదలకు మేం డీబీటీ ఇస్తే సంక్షోభమన్నారు.. మరి, అంతకు మూడురెట్లు మీరెలా ఇస్తామంటున్నారు..?

 సూటిగా ప్రశ్నించిన మాజీమంత్రి  పేర్ని నాని

 లోకేశ్‌ది జంపింగ్‌ జపాంగ్‌ యాత్ర
 
భోగాపురంలో ముగింపు సభ అట్టర్‌ఫ్లాప్‌ సినిమా

మాజీమంత్రి పేర్ని నాని స్పష్టీకరణ

తాడేప‌ల్లి: తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి రావాలన్నదే చంద్రబాబు ఆలోచన. ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేయలేద‌ని మాజీ మంత్రి పేర్ని నాని విమ‌ర్శించారు.  650 హామీలు ఇచ్చి గాలికి వదిలేశారు. ఎప్పటికప్పుడు ప్రజలకు ఎరవేయడం చంద్రబాబుకు అలవాటు. చంద్రబాబు ఎన్ని తప్పుడు మాటలు, మోసాలైనా చేస్తారు. ఇప్పుడు కొత్తగా హామీలు ఇవ్వడం మొదలు పెట్టారు. ఇచ్చిన హామీలను గాలికొదిలేసిన చంద్రబాబును పవన్‌ ఎందుకు ప్రశ్నించలేదు?. పవన్‌ కల్యాణ్‌తో చంద్రబాబు బేరాలు చేసుకున్నారు. చంద్రబాబు అధికారంలో ఉండాలన్నదే పవన్‌ ఆరాటం. ఒకప్పుడు లోకేష్‌ను దొంగ అన్న పవన్‌ ఇప్పుడు ఎందుకు ఓటేయమని చెబుతున్నాడని ధ్వ‌జ‌మెత్తారు. తాడేపల్లి వైయ‌స్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీమంత్రి  పేర్ని నాని మీడియాతో మాట్లాడారు.

యువగళం కాదది.. జంపింగ్‌ జపాంగ్‌ యాత్రః
చంద్రబాబు కొడుకు లోకేశ్‌ కొద్దికాలం కిందట యువగళం పేరిట కుప్పంలో ఆర్భాటంగా పాదయాత్ర ప్రారంభించాడు. ఆ యాత్ర ఎలా సాగిందో ప్రజలంతా చూశారు. సహజంగా రాజకీయాల్లో ఏ నాయకుడైనా పాదయాత్ర చేపడితే ప్రజలకు సేవ చేయాలనే తలంపుతో చిత్తశుద్ధితో చేస్తాడు. యాత్రలో ప్రజల సమస్యల్ని, వారి బాధల్ని ఆలకిస్తూ.. వాటి పరిష్కారానికి మదిలోనే ఆలోచన చేస్తూ అందరితో మమేకమవుతూ ముందుకు సాగుతోంటారు. అయితే, ఈ లోకేశ్‌ యాత్ర మాత్రం అందుకు పూర్తిగా భిన్నంగా సాగింది. పాపపు సొమ్ముతో అక్కడక్కడ బహిరంగ సభల పేరిట జనాల్ని డబ్బులిచ్చి అక్కడకు తరలించుకు రావడం.. జగన్‌మోహన్‌రెడ్డి గారిని బూతులు తిట్టడం.. మళ్లీ అక్కడ్నుంచీ పరిగెట్టడం.. అందరూ చూసిన సంగతే. ఈయనేమో నవ యువకుడంట.. ఈయన చేసేది యువగళం యాత్రంట. సాయంత్రం ఐదు గంటలైతేనే గానీ బస్సులో నుంచి బయటకు రాడంట. సూర్యుడు అస్తమించగానే ఈయన రోడ్డు మీదికి వస్తాడంట. నేలమీద అడుగు పెట్టగానే.. యూట్యూబ్‌లో వీడియోలాగా పరిగెడతాడు. లోకేశ్‌ ఎక్కడున్నాడయ్యా..? అని ఎవరైనా అడిగితే, విజయవాడ పడమట సెంటర్‌లో ఉన్నాడంటారు. రాత్రి 10 గంటలకే ఏలూరులో తేలతాడు. ఆ సాయంత్రం మరలా ఏలూరులో సభ పెడతాడు. ఇది ఆయన చేసిన పాదయాత్ర తీరు. మరి, దీన్ని ఏమనాలి..? అది పాదయాత్ర కాదు. ఇది కచ్చితంగా జంపింగ్‌.. జపాంగ్‌ యాత్రనే అంటారు. 

తారకరత్న చనిపోతే చూడ్డానికి మనసురాలేదేం.?ః
యువగళం మొదలెట్టగానే నందమూరి తారక రామారావు గారి మనువడు తారకరత్న వచ్చాడు. పాపం ఆయన చనిపోయాడు. కానీ, లోకేశ్‌ పాదయాత్ర ఆపలేదు. అతని చావుకు అతన్ని వదిలేసి వీళ్లు నడుచుకుంటూ ముందుకుసాగి పాదయాత్రకు పోయారు. అంటే, మేనమామ కొడుకు చనిపోతే కనీసం హాస్పిటల్‌కు వెళ్లి శవాన్ని చూసే సంస్కారం, మనస్సు గానీ వీళ్లకు దేవుడు పెట్టలేదు. అదే చంద్రబాబును జైల్లో వేశారనగానే యువగళం పాదయాత్ర మొత్తాన్ని లోకేశ్‌ ఆపుకున్నాడు. ఏం.. ఆయన చేసే యాత్ర ఒక రోజు ఆగిపోతే ఏమైద్దంట.? నీ యాత్ర మొదలవుతుంటే.. నీ మేనమామ కొడుకు నీకు సపోర్టుగా వచ్చి పనిచేసి చివరికి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడితే .. కనీసం నువ్వు వెళ్లి ఆయన్ను చూడటానికీ మనసు రాలేదు. 

తండ్రి అరెస్టయితే పాదయాత్ర ఆపావేం..?ః
అదే మీ నాన్న అరెస్టయితే పాదయాత్రను ఎందుకు ఆపుకున్నావు..? ఏం ఆయన్ను అరెస్టు చేస్తే తప్పేంటి..? ఆయన పాపాలు చేశాడు. కుంభకోణాలకు పాల్పడ్డాడు. రూ.కోట్లల్లో ప్రజాధనం కొట్టేశాడని ఆ«ధారాలతో సహా దొరికాడు కాబట్టే కోర్టులు ఆయన్ను రిమాండ్‌కు పంపాయి. మరి, అలాంటప్పుడు నువ్వు యాత్ర ఎందుకు ఆపుకోవాల్సి వచ్చింది..?

నడిచిన కిలోమీటర్లన్నీ దొంగ లెక్కలేః
కృష్ణాజిల్లాలో యాత్ర ప్రవేశించిందన్నారు. తీరా చూస్తే ఆయన నడిచింది గన్నవరంలో ఒకచోట మాత్రమే. ఆ తర్వాత ఎక్కడున్నాడని చూస్తే.. ఒక్క రోజులోనే ఏలూరులో తేలాడు. అంటే, బెజవాడ, గన్నవరం కట్‌ చేస్తే ఏలూరుకు యాత్ర వెళ్లిపోయింది. ఆయన నడక నడవలేదు. జంప్‌ చేసుకుంటూ Ðð ళ్లాడు. అందుకనే, ఆ యాత్రకు జంపింగ్‌ జపాంగ్‌ యాత్ర అని పేరు పెట్టాల్సి వచ్చింది. నువ్వు నడిచిన కిలోమీటర్లన్నీ కాకిలెక్కలు.. దొంగలేనని.. కేవలం రాజకీయ లబ్ధికే యాత్రని కలరింగ్‌ ఇచ్చినట్లుగా  ప్రతీ ఒక్కరూ చెబుతున్నారు.

అట్టర్‌ఫ్లాప్‌ సినిమా అదిః
కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు యాత్రన్నారు. చివరికి గాజువాకతో మూతేశారు. ముగింపు సభ మాత్రం భోగాపురంలో పెట్టారు. అదేంటని అడిగితే, అది యువగళం కాదు. నవశకం సభ అన్నారు. అక్కడ ఈ ఎర్ర పుస్తకాయన మాట్లాడుతూ.. యువగళం సినిమా బ్లాక్‌బస్టర్‌ అని చెబుతాడు. జంపింగ్‌ జపాంగ్‌ యాత్ర బ్లాక్‌బస్టర్‌ ఎలా అవుతుంది..? అట్టర్‌ఫ్లాప్‌ యాత్ర అది. చంద్రబాబు పాపపు సొమ్ము కదా అని లోకేశ్‌ మొత్తానికి అట్టర్‌ఫ్లాప్‌ సినిమా తీశాడు. దీని ఎలివేషన్‌కు పవన్‌కళ్యాణ్, బాలకృష్ణ, చంద్రబాబు రావడం.. అక్కడ ఏదేదో జరిగిపోతుందంటూ బిల్డప్‌ ఇవ్వడం. ఒక అట్టర్‌ఫ్లాప్‌ షోకు అంత ఆర్భాటం అవసరమా..? అని అడుగుతున్నాను. 

బాబు, పవన్‌కు మధ్య ప్యాకేజీ వ్యవహారమే..ః
సభకు రానంటే రానని పవన్‌కళ్యాణ్‌ మొండికేస్తే స్వయంగా చంద్రబాబు వెళ్లి బేరమాడి మరీ రప్పించుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ పరిస్థితుల్లో వారంతా ఎవరికి సెల్ఫ్‌ డబ్బాలు కొట్టుకున్నారు. చంద్రబాబు కష్టాల్లో ఉంటే పవన్‌కళ్యాణ్‌ ఆదుకున్నాడని లోకేశ్‌ అంటాడు. మరోవైపు పవన్‌కళ్యాణ్‌ అందుకు భిన్నంగా మాట్లాడుతాడు. టీడీపీ బలహీన పడింది. అందుకని, టీడీపీకి కష్టకాలంలో మనమంతా అండగా ఉండాలని కేడర్‌కు పవన్‌కళ్యాణ్‌ చెబుతాడు. సరే, అసలు టీడీపీ ఏం కష్టాల్లో ఉంది.? చంద్రబాబు దొంగతనం చేసి రూ.కోట్లు కొట్టేసి అరెస్టయ్యాడు. మరి, 2022 మార్చిలో టీడీపీ ఏం కష్టాల్లో ఉందని ఇప్పటం సభలో నేను చంద్రబాబుతోనే వెళ్లిపోవడం ఖాయమని ఈ పవన్‌కళ్యాణ్‌ ఎందుకు చెప్పాడు..? ఇదంతా ప్యాకేజీ వ్యవహారాలని చిన్నపిల్లోడ్ని అడిగినా చెబుతాడు. బేరాలడుకోవడం కుదిరితే కలిసిరావడం..లేదంటే, అలిగి ఇంట్లో కూర్చోవడం అందరికీ తెలిసిందే..

బాబు బాగుండటమే పవన్‌కు తెలిసిన ఆవుకథః
పవన్‌కళ్యాణ్‌కు ఏతావాతా తెలిసిందేమిటంటే, రాజకీయాల్లో చంద్రబాబు బాగుండాలి. ఆయన అధికారంలోకి రావాలనేది అతనికి తెలిసిన ఆవు కథ. చంద్రబాబు అధికారంలో లేనప్పుడేమో అందరూ బాబుకు ఓటేయ్యండి.. బాబును గెలిపించండని అంటాడు. ఆయన అధికారంలో ఉంటే లాలూచీ కుస్తీలో భాగంగా చంద్రబాబును కాదని నాకు మాత్రమే ఓటేయ్యండని అంటాడు. ఎందుకంటే, పొరబాటున ప్రభుత్వ వ్యతిరేకత ఓటు జగన్‌మోహన్‌రెడ్డి గారికి వేస్తారేమోననే భయం పవన్‌కళ్యాణ్‌ది. ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడి.. పిచ్చిగా ప్రవర్తిస్తే 2019 ఎన్నికల్లో జనం తెడ్డు కాల్చి ఆ ఇద్దరికీ వాతలు పెట్టారు. 

ఆ ఇద్దరి మధ్య ఇచ్చిపుచ్చుకో..లావాదేవీలేః
 2024 ఎన్నికలు సమీపిస్తోన్న కొద్దీ మళ్లీ పవన్‌కళ్యాణ్‌ తన కేడర్‌తో పాటు ప్రజల్ని ఏమని కోరుతున్నాడు.? చంద్రబాబుకు ఓట్లేయండి.. ఆయన్ను అధికారంలోకి తేవాలండీ అని అంటున్నాడు. అంతా ప్యాకేజీ మహిమ అది. అంటే, చంద్రబాబుకు కావాల్సింది పవన్‌కళ్యాణ్‌ ఇవ్వడం.. ఈయనకు కావాల్సింది ఆయన ఇవ్వడం.. వారిద్దరి మధ్య నడుస్తోందంతా ఇచ్చుకో.. పుచ్చుకో లావాదేవీలే తప్ప రాజకీయ రహస్యమేదీ లేదని చెప్పాలి. 

మోసకారి చంద్రబాబు నైజం దోచుకోవడమే..ః
ఏం చేసినా .. ఏం మాట్లాడినా చంద్రబాబును అధికారంలోకి తేవాలనే తపనే తప్ప పవన్‌కళ్యాణ్‌ మాటల్లో మరో గోల ఏమైనా వినిపిస్తుందా..? 2014లో చంద్రబాబు 650 హామీలిచ్చి అధికారంలోకొచ్చాడు. వాటిని అమలు చేశాడా ..? అంటే, బాబు చేతులెత్తేశాడు. జిల్లాకో ఏయిర్‌పోర్టు అన్నాడు. ప్రతీ ఇంటికీ రూ.2కే 20 లీటర్ల మంచినీటి క్యాన్‌ పంపుతానన్నాడు. ప్రతీ పేదవాడికి మూడు సెంట్ల స్థలమిస్తానన్నాడు. బందర్‌లో పోర్టు కడతానన్నాడు. హైదరాబాద్‌ నుంచి బందరు వచ్చి ఉద్యోగాలు చేసుకోవచ్చన్నాడు. రైతులు, డ్వాక్రా అక్కచెల్లమ్మలకు భేషరతుగా రుణమాఫీ చేస్తానన్నాడు. కాపుల్ని బీసీలుగా, మత్స్యకారుల్ని రజకుల్ని ఎస్సీలను చేస్తానన్నాడు. బోయల్ని ఎస్టీలుగా చేస్తానన్నాడు. ఇలా దాదాపు 650 హామీలిచ్చి ఏమీ నెరవేర్చకుండా చేతులెత్తేశాడు. అడ్డగోలుగా ఐదేళ్లు దోచుకుని..  2019లో పంచసూత్రాలన్నాడు. ఇవాళ కర్ణాటకలోని 6 గ్యారెంటీల్ని తెచ్చాడు. అంటే, ఎప్పటికప్పుడు ప్రజలకు ఎర వేసి.. ఆకర్షించి ఏదోరకంగా బుట్టలో వేయాలని.. అధికారంలోకి రావాలి.. దోచుకుని తినాలనేది చంద్రబాబు నైజం. 

 లోకేశ్‌ .. నీ గ్యాస్‌కబుర్లు చాలించుః
లోకేశ్‌ ఇప్పుడు మేం అధికారంలోకొస్తే ఉచితంగా మూడు సిలిండర్‌ బండలిస్తామంటున్నాడు. మరి, 2014 నుంచి 2019 వరకు ఐదేళ్లలో అప్పట్లో సిలిండర్‌ రేట్లు బాగానే ఉన్నాయి కదా..? దాదాపు రూ.1600 దాకా రేటు ఉంది కదా..? మరి, అప్పట్లో నువ్వు ఎన్ని సిలిండర్లు ఇచ్చావు..? ఎందుకివ్వలేదు..? అంటే, మీకు అధికారం క్షవరమైతే.. మళ్లీ అధికారంలోకి రావడానికి ఎన్ని తప్పుడు మాటలు.. మోసలెన్నైనా చేస్తారు. 2014 నుంచి 2019 దాకా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ టిక్కెట్లు ఇచ్చారా..? ఎందుకివ్వలేదు..? పోనీ, ప్రజలకు చూపించిన మ్యానిఫెస్టోలోని 650 హామీల్ని మీరు అమలు చేశారా.? చేయలేదు కదా..? మళ్లీ కొత్తగా మీ మాటల్ని నమ్మి ప్రజలు మోసపోవాల్నా..? మాయమాటలతో మోసం చేయడానికి మీకు సిగ్గుండాలి. ఇకనైనా, నువ్వు నీ తండ్రి ప్రజలకు గ్యాస్‌ కొట్టడాలు..మోసపు మాటలతో మాయ చేయడాలు చాలిస్తే చాలా మంచిది. 

బాబు భజనలో పవన్‌కళ్యాణ్‌ తీరులో మార్పులేదుః
2014లో 650 మ్యానిఫోస్టో హామీలకు బాధ్యత నాది. వాటిని నెరవేర్చలేకపోతే చంద్రబాబును ప్రశ్నించేందుకు నేనున్నాను అన్నటువంటి పవన్‌కళ్యాణ్‌ ఏం చేశాడు..? ఆయన బాబును ప్రశ్నించకపోగా.. 2018 వరకు భజన కొట్టుడులో పరమానందం పొందాడు. మళ్లీ ఇప్పుడు ఎన్నికలనగానే, బాబు భజన కార్యక్రమం మొదలెట్టాడు. ఇద్దరూ కలిసి ఉమ్మడి మ్యానిఫెస్టో ఇస్తారంట. మరి, 2014లో వారు ప్రజల ముందుకు తెచ్చింది ఉమ్మడి మ్యానిఫెస్టో కాదా..? నువ్వు చెప్పేవన్నీ మోసకారి మాటలు కాదా..? అని పవన్‌కళ్యాణ్‌ను ప్రశ్నిస్తున్నాను. సమాధానం ఇవ్వాలి.  

తల్లిని దూషించినోళ్ల సభకెళ్లడానికి ఎంత వాటా తీసుకున్నావ్‌..?ః
2019లో లోకేశ్‌ను ఉద్దేశించి నువ్వేం అన్నావ్‌ పవన్‌కళ్యాణ్‌..? నా తల్లిని దూషించావ్‌.. నా కుటుంబాన్ని అవమానించావ్‌..కబడ్దార్‌ లోకేశ్‌ నాయుడు. నీ అంతుచూస్తానన్నావు. ఇవాళ, ఇదే లోకేశ్‌ నాయుడు జంపింగ్‌ యాత్ర యువగళం ముగింపు సభకు ఎందుకెళ్లావు..? నీకు గానీ.. నీ తల్లికి గానీ లోకేశ్‌ క్షమాపణలు చెప్పాడా..? నీ కుటుంబంలో ఎవరి కాళ్లయినా పట్టుకున్నాడా..? మరెందుకు, నువ్వు వాళ్లను క్షమించాల్సి వచ్చింది. ఇదే చంద్రబాబు, లోకేశ్‌ దొంగలన్నావు. వాళ్లకు ఓట్లేయవద్దన్నావు కదా..? మరి, ఇవాళ మళ్లీ వాళ్లకే నువ్వు చెప్పినట్టు ప్రజలు ఓట్లు ఎందుకు వేయాలి..? చంద్రబాబు దగ్గర నువ్వు తీసుకున్న ప్యాకేజీ వాటా ఎంత..? 

నువ్వెవరికి పాలేరు..?..నీలో కులభావనేది..?ః
బందరు వచ్చినప్పుడు నువ్వు రాజ్యాధికారంపై పెద్ద పెద్ద మాటలన్నావే..? ఎప్పుడూ రాజ్యాధికారం కమ్మోళ్లకు, రెడ్డి సామాజికవర్గాలేకేనా.. మీకు లేదా..? అంటూ కాపు సామాజికవర్గ సోదరుల్ని రెచ్చగొట్టావు. మరి,  ఇప్పుడెవరికి రాజ్యాధికారం ఇస్తున్నావయ్యా పవన్‌కళ్యాణ్‌..? కాపు కులంలో పుట్టి వైఎస్‌ఆర్‌సీపీలో మర్యాదగా బతుకున్న నన్ను, అంబటి రాంబాబు, కన్నబాబు, గుడివాడ అమర్‌లు జగన్‌రెడ్డికి పాలేర్లంటూ నీ మనుషులతో తిట్టించావు. మరి, నువ్వు ఎవరికి పాలేరుతనం చేస్తున్నావని ప్రశ్నిస్తున్నాను. దీనికి సమాధానం చెప్పు.  

సంక్షేమాన్ని మేమిస్తే సంక్షోభం..? మీరిస్తే సుభిక్షమా..?ః
జగన్‌మోహన్‌రెడ్డి గారు రాష్ట్రంలో నవరత్నాల అమలు ద్వారా ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తూ.. ప్రజాదరణ పొందుతుంటే.. నువ్వూ బాబు కలిసి ఏమన్నారు..? సంక్షేమం పేరిట ఈ రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తున్నారంటూ.. ఏపీ మరో శ్రీలంక, మరో పాకిస్తాన్‌ అవుతుందంటూ నానా హంగామా చేశారు కదా..? మరి, ఇప్పటం వచ్చేసరికి జగన్‌ గారిచ్చే పథకాలన్నీ నేను ఇస్తానని పవన్‌కళ్యాణ్‌ అన్నాడు. ఏలూరులో ఈ పథకాలన్నీ నేనూ ఇస్తానంటూ చంద్రబాబు కూడా మాట్లాడారు. ఇవాళ, భోగాపురంలో వీళ్లంతా మాట్లాడుతూ.. జగన్‌ గారు అందించే పథకాల కంటే మూడురెట్లు అదనంగా అమలు చేస్తారంట. ప్రజలకు సంక్షేమం అందించడమనేది వేలం పాటనా ఇది..? అంటే, అధికారం కోసం నోటికి ఎంతొస్తే అంత బరితెగించి మాట్లాడుతారా..? ఎవరి జేబులకు కన్నాలేసి మీరు సంపద సృష్టిస్తారో.. అది కూడా ప్రజలకు చెప్పండి. 

మాకంటే మూడురెట్లు మీ పాపపు సొమ్మిస్తారా..?ః
జగన్‌ గారు ముఖ్యమంత్రిగా ఎన్నికల ముందు మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల్ని అత్యంత పవిత్రంగా అమలు చేసి రాష్ట్రంలోని అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమాన్ని అందివ్వడం జరిగింది. కులమత ప్రాంత రాజకీయ భేదాల్లేకుండా డీబీటీ ద్వారా ఇప్పటికే రూ. 2.41 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. మరి, ఈ చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, లోకేశ్‌లు చెబుతున్న మేరకు మీరు ప్రజల ఖాతాల్లో ఎంత జమ చేయాలి. మాకన్నా మూడురెట్లు ఇస్తామంటే.. సరాసరి, రూ.7 లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లో జమచేయాల్సి ఉంటుంది. మరి, ఈ సొమ్ము ఎక్కడ్నుంచి తెచ్చి జమ చేస్తారు.? ఇప్పటిదాకా పాపాల్ని చేసి మీ ఇంట్లో దాచుకున్న సొమ్ము తెచ్చి జమ చేస్తారా..? గతంలో మీరన్నారు కదా... ప్రజలకు పథకాల రూపంలో ఇచ్చే డబ్బులు జగన్‌గారివి కాదని.. మరి, ఇప్పుడు మీరు వేస్తామంటున్న రూ.7 లక్షల కోట్లు ఎక్కడ్నుంచి వేస్తారు.?? ఈ విషయంపై కూడా ప్రజలకు మీరు సమాధానం ఇవ్వాలని మేం డిమాండ్‌ చేస్తున్నాం. 

మాయగాళ్లు, బేరగాళ్ల మోసపు మాటల్ని నమ్మొద్దుః
భోగాపురంలో ఒక పెద్ద మాయగాడు, ఒక చిన్న మాయగాడుతో పాటు ఒక బేరగాడి పలుకుల్ని అందరూ విన్నారు. వీరు ముగ్గురూ రకరకాల సర్కస్‌లు చేస్తూ మనందర్నీ మోసం చేయడానికి కులాలు, మతాలు పేరుతో దొంగ హామీల్ని ఎరచూపి మరొక్కసారి ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి బయల్దేరారు కనుక రాష్ట్రప్రజలందరూ అప్రమత్తమై జాగ్రత్తగా ఉండాలని మేం కోరుతున్నాము. 

ప్రశ్నలకు సమాధానమిస్తూ..

2014 నుంచి బాబు అధికారం కోసమే పనిచేస్తున్న పవన్ః
 ఏతావాతా చూస్తే.. మేమేమో సరాసరి పార్టీ సభ్యత్వాల్ని తీసుకుని వైఎస్‌ఆర్‌సీపీలో ఉన్నాము. పవన్‌కళ్యాణ్‌తో సహా వారేమో అంతా తెలుగుదేశం పార్టీనే అయినప్పటికీ, రకరకాల వేషాలేసుకుంటూ.. మెడల్లో జనసేన బోర్డులేసుకుని చంద్రబాబు మాత్రమే బాగుండాలని కోరుకుంటున్నారు. ఆయన 2014 నుంచి చంద్రబాబు అధికారం కోసమే అహరహం పనిచేస్తున్నాడనడం వాస్తవం. 

అభ్యర్థుల మార్పుపై వారివి సిగ్గులేని మాటలుః
రాజకీయాల్లో ఎన్నికల అభ్యర్థుల్ని మార్చుకుంటే తప్పేంటి.? వైఎస్‌ఆర్‌సీపీలో సవాలక్ష మార్పులు జరిగితే ఈ చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, లోకేశ్‌లకు నొప్పేంటి.? మోదీ గారితో మొదలుకుని చంద్రబాబు, లోకేశ్, పవన్‌కళ్యాణ్‌లు పోటీచేసే స్థానాలకు వాళ్లంతా ఎలా వచ్చారు..? గతంలో ఎన్టీ రామారావు గారే మహబూబ్‌నగర్‌లో పోటీ చేయలేదా..? చంద్రగిరి నుంచి కుప్పం వచ్చిన చంద్రబాబు మా పార్టీ అభ్యర్థుల మార్పుపై మాట్లాడటానికి సిగ్గుండాలి కదా..? 

Back to Top