ఆ పేరు ఎక్కడుంది మహారాజా...! 

ప్రశ్నించిన  శాసనసభ డిప్యూటీ స్పీకర్ శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి  

  ఆసుపత్రిలో అంగుళం స్థలం కూడా రాజులది లేదు.. 

  ఉంటే నిరూపించండిః చంద్రబాబు, అశోక్ గజపతిరాజు, లోకేష్ లకు కోలగట్ల వీరభద్రస్వామి స్వామి 
సవాల్ 

 అది ప్రభుత్వ స్థలం.. ఇవిగో సాక్ష్యాలు

  ఆసుపత్రి శంఖుస్థాపనప్పుడుగానీ, ప్రారంభోత్సవం అప్పుడుగానీ మహారాజా పేరు లేదు 

  2019లో టీడీపీ దిగిపోతూ మెడికల్ కాలేజీకి ఇచ్చిన ఉత్తుత్తి జీవోలో కూడా మహారాజా పేరు లేదు 

  కొవిడ్ వస్తే.. బంగ్లాకు తాళం వేసుకుని ఇంట్లో పడుకున్న వ్యక్తి అశోక్ గజపతిరాజు 

 విజయనగరం ఆసుపత్రి.. ఇక ప్రభుత్వ సర్వజన ఆసుపత్రే 

 డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి

విజ‌య‌న‌గ‌రం: విజయనగరం ప్రభుత్వాసుపత్రికి "మహారాజా" పేరు ఎప్పుడూ లేదని, కేవలం రాజకీయ స్వార్థంతోనే టీడీపీ, లేనిది ఉన్నట్టుగా రాద్ధాంతం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి మండిపడ్డారు. ఆ ఆసుపత్రి శంఖుస్థాపన సమయంలోగానీ, ప్రారంభోత్సవం సందర్భంలోగానీ, ఆఖరికి టీడీపీ ప్రభుత్వం దిగిపోయే సమయంలో, అంటే 2019లో మెడికల్ కాలేజీని మంజూరు చేస్తూ ఇచ్చిన ఉత్తుత్తి జీవోలోగానీ ఎక్కడా "మహారాజా" పేరు లేదని స్పష్టం చేశారు. లేని పేరును ఉన్నట్టుగా ప్రచారం చేయడమే కాకుండా, ప్రభుత్వాసుపత్రి స్థలం తమదే అన్నట్టుగా అశోక్ గజపతిరాజు ప్రచారం చేసుకోవడాన్ని కూడా కోలగట్ల తప్పుబట్టారు. ప్రభుత్వాసుపత్రిలో అంగుళం స్థలం కూడా అశోక్ గజపతిరాజు వంశీకులది లేదని సాక్ష్యాధారాలతో సహా ఆయన స్పష్టం చేశారు. దమ్మూ, ధైర్యం ఉంటే, అది మీ స్థలం అని నిరూపించాలని చంద్రబాబుతోపాటు, అశోక్ గజపతిరాజు, లోకేష్ లకు కోలగట్ల సవాల్ విసిరారు.  మా తాతలు నేతులు తాగారు.. మా మూతులు వాసన చూడండంటే.. ప్రజలు నమ్మే రోజులు పోయాయని, ప్రజా క్షేత్రంలో ప్రజలకు సేవ చేసే వారికే  ప్రజలు పట్టం కడతారన్నారు. కొవిడ్ సమయంలో.. కనీసం టీడీపీ కార్యకర్తలకు కూడా అందుబాటులో లేకుండా, బంగ్లాకు తాళం వేసుకుని ఇంట్లో పడుకున్న వ్యక్తి అశోక్ గజపతిరాజు అని ధ్వజమెత్తారు. 

 
 డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆధీనంలోకి రావడం వల్లే... 
 విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్న ఆసుపత్రిని వైద్య విధాన పరిషత్ నుంచి డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కు అప్పగించడం వల్ల.. జిల్లాకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారు ప్రభుత్వ మెడికల్ కాలేజీని మంజూరు చేయడం, దాని ఆధీనంలో ప్రభుత్వాసుపత్రి ఉండాలన్న నిబంధనల మేరకు ఆ ఆసుపత్రిని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిగా మార్చడం జరిగింది. మెడికల్ కాలేజీ పనులను వేగవంతంగా పూర్తి చేసి, త్వరితగతిన తరగతులు ప్రారంభించాలన్న ఆలోచనతోనే, కావాల్సిన సౌకర్యాలను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారు సమకూరుస్తున్నారు. ఈ పరిస్థితుల్లో.. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు మహరాజా గారి పేరు తొలగించారని రాద్ధాంతం చేస్తున్నారు.  మీకు కేవలం రాజకీయాలే కావాలి తప్పితే..  అభివృద్ధి పట్టదా అని ప్రశ్నిస్తున్నాను. 

 దీనికి తగుదునమ్మా అంటూ,  హైదరాబాద్ లో మకాం ఉండే, పనీపాట లేని చంద్రబాబు నాయుడు వాస్తవాలు తెలుసుకోకుండా.. ఇది తుగ్లక్ చర్య అంటూ ట్వీట్లు పెట్టాడు. వాస్తవాలేమిటంటే.. విజయనగరంలోని ఈ ఆసుపత్రికి  1983లో స్వర్గీయ ఎన్టీఆర్ శంఖుస్థాపన చేశారు. ఆ కార్యక్రమానికి మహరాజా గారి ప్రథమ పుత్రుడు ఆనందగజపతిరాజు గారు సభాధ్యక్షత వహించారు. 1988లో ఆసుపత్రి నిర్మాణం పూర్తైన తర్వాత, దానిని ఎన్టీఆరే ప్రారంభోత్సవం చేశారు. ఆ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు కూడా ఆ వేదిక మీద ఉన్నారు. శంఖుస్థాపన సమయంలోగానీ, ప్రారంభోత్సవం సమయంలో గానీ, ఆ ఆసుపత్రికి మహరాజా గారు పేరు ఉందా..?. అంటే లేదు. 

 2019లో టీడీపీ ఇచ్చిన ఉత్తుత్తి జీవోలో కూడా మహారాజా పేరు లేదు 
 2019లో హడావుడిగా.. టీడీపీ ప్రభుత్వం దిగిపోతున్న సమయంలో మెడికల్ కాలేజీ మంజూరు చేస్తూ ఇచ్చిన ఉత్తుత్తి జీవోలో కూడా మహారాజా పేరు లేదు. అప్పుడు అశోక్ గజపతిరాజు కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నారు. వారు ఇచ్చిన ఆ జీవోలో అయినా మహరాజా గారి పేరు ఉందా..? అంటే లేదు. లేనిదానికి ఎందుకు ఇప్పుడు రాద్ధాంతం చేస్తున్నారు అని అడుగుతున్నాం. 

  మహారాజా గారి పేరు ఎప్పుడు ఉందంటే... జిల్లా కేంద్రంగా విజయనగరం అవ్వకముందు, జిల్లా ఆసుపత్రి రాకముందు పాత ఆసుపత్రి దగ్గర మహారాజా గారి పేరు ఉండేది. ఆ తర్వాత ప్రభుత్వ స్థలంలో,  ప్రభుత్వ వైద్యశాలను నిర్మాణం చేశారు. ఆ తర్వాత కూడా మహరాజా గారి పేరుతో ప్రభుత్వ ఆసుపత్రి కొనసాగుతున్నా, పీవీజీ రాజు గారి మీద విజయనగరం ప్రజలకు ఉన్న అభిమానం, గౌరవంతో  ఎవరూ ప్రశ్నించలేదు. 

 అది ప్రభుత్వ స్థలం.. ఇవిగో సాక్ష్యాలు 
  ఇప్పుడు ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డిగారు విజయనగరం జిల్లాకు నూతన మెడికల్ కాలేజీని మంజూరు చేయడం వల్ల, ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ నుంచి డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ వారి ఆధీనంలోకి వెళ్ళాక, గతంలో ఉన్న జీవోలను అనుసరించి దానికి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిగా బోర్డు పెట్టారు. రాజుల వంశంలో ఉన్న అశోక్ గజపతిరాజు పెద్ద మనిషి అని బయటి వాళ్ళు అంతా అనుకుంటారు. ప్రభుత్వాసుపత్రికి ఆ స్థలం ఆయన వంశీయులే ఇచ్చారని టీడీపీకి వత్తాసు పలికే పత్రిక ఆంధ్రజ్యోతిలో అశోక్ గజపతిరాజు చెప్పినట్టు రాశారు.
-  ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించిన స్థలం మీదా అశోక్ గజపతిరాజు, దమ్ముంటే నిరూపించండి..? అది మీ స్థలం కానే కాదు. అది ముమ్మాటికీ ప్రభుత్వ స్థలం. ఇవిగో సాక్ష్యాలు. 
-  అది మీ స్థలమే అయితే, మీ వాళ్ళే ఇస్తే,  ఇచ్చినట్టు మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే.. మాకు చూపించకపోయినా ఫర్వాలేదుగానీ, ప్రజలకైనా చూపించండి. 
- ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక్క అంగుళం కూడా మీకు గానీ, మీ కుటుంబానికి గానీ లేదు. 
- మీ స్వార్థ రాజకీయాల కోసం, మీ కుట్రలు, కుతంత్రాలతో ప్రజలను మభ్య పెట్టలేరు. 

 దొందూ.. దొందే 
 మా తాతలు నేతులు తాగారు.. మా మూతులు వాసన చూడండి అంటే ప్రజలు నమ్మే రోజులు పోయాయి. కేంద్ర మంత్రిగా పనిచేసిన మీరు, విజయనగరం జిల్లాకు ఏ ఒక్క మేలు అయినా చేశారా.. ?. ఇది చేశాను అని చెప్పండి. అశోక్ గజపతిరాజు...  పీవీజీ మహరాజా గారి పేరును, చంద్రబాబు... పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ గారి పేర్లను ఇప్పటికీ వాడుకుంటారు. వీళ్ళద్దరికీ, అధికారంలో ఉన్నప్పుడు మాత్రం వారు గుర్తుకు రారు. అధికారం పోయిన తర్వాత, సానుభూతి రాజకీయాల కోసం వారిద్దరినీ ఆటబొమ్మలుగా వాడుకుంటున్నారు. వారిపై ప్రజలు చూపిస్తున్న అభిమానంలో వీసమెత్తు అయినా మీ ఇద్దరికీ లేదు. ఈ విషయంలో చంద్రబాబు, అశోక్ గజపతిరాజు ఒక్కటే. దొందూ.. దొందే. 

 విజయనగరం జిల్లా ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మెడికల్ కాలేజీ కల జగన్ మోహన్ రెడ్డిగారి వల్ల నెరవేరబోతుంది. మెడికల్ కాలేజీ వస్తే... ప్రభుత్వాసుపత్రిలో సౌకర్యాలు పెరగడంతోపాటు, 500 పడకలు, అన్ని విభాగాల్లో స్పెషలిస్టు డాక్టర్లు వస్తారు అని ప్రజలు భావిస్తున్నారు. విజయనగరం జిల్లాకు జగన్ గారు చేస్తున్న మేలును చూడలేక, అసూయతో, దుర్బుద్ధితో మీరు జిల్లాకు నష్టం చేస్తున్నారు. 

  హైదరాబాద్ లో కూర్చునే చంద్రబాబుకు ఈ జిల్లా పరిస్థితులు ఏం తెలుస్తాయి..?. పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచి అధికారం లాక్కున్న చంద్రబాబు ఒక ఔరంగజేబు కాదా?. ఎంతసేపటికీ అధికార దాహంతో చంద్రబాబు వ్యవహరిస్తున్నాడు తప్పితే ప్రజల సంక్షేమం గురించి ఆలోచించడం లేదు.  జగన్ మోహన్ రెడ్డిగారి పరిపాలనలో ప్రతి కుటుంబానికీ  జరుగుతున్న మేలును, సంక్షేమాన్ని- అభివృద్ధిని చూడలేక, ఓర్వలేకే లేని సమస్యను సృష్టిస్తున్నారు. మా ప్రభుత్వం చేపట్టిన గడప గడపకు  ప్రభుత్వం కార్యక్రమానికి విశేష స్పందన వస్తుంది. రాష్ట్రంలో ప్రతి ఒక్క పేద కుటుంబం, పథకాలు అందుకుంటున్న లబ్ధిదారులు ప్రభుత్వం పనితీరును శెభాష్ అని మెచ్చుకుంటున్నారు. ప్రభుత్వానికి వస్తున్న మంచి పేరును చూడలేక ఇటువంటి కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్నారు. 

 ఆ దమ్ముందా మీకు..? 
 మీకు ధైర్యం ఉంటే.. 2014లో మీరు ఇచ్చిన మేనిఫెస్టోను తీసుకుని రండి.. మేం కూడా 2019లో ఇచ్చిన మేనిఫెస్టోను పట్టుకుని వస్తాం.. విజయవాడలోనే ఓ బహిరంగ వేదిక మీద, ప్రజలకు ఎవరు ఏం చేశారో, ఎవరు ఏం వాగ్దానాలు అమలు చేశారో చర్చిద్దాం.. చర్చించే దమ్ము మీకుందా అని చంద్రబాబుకు సవాల్ విసురుతున్నాను. 

 కోవిడ్ సమయంలో బంగ్లాకు తాళం వేసుకున్నావ్.. 
 మహరాజా మీద ఉన్న గౌరవంతోనే... పీవీజీ రాజు గారి పేరును జిల్లా ప్రజలుగా తలచుకుంటాం. ఆయన చేసిన సేవలకు మేమంతా బద్ధులై ఉన్నాం. కాలం మారింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రజలకు ఎవరు సేవ చేస్తే.. వారే ప్రభువులు. 
- ఈరోజు ప్రజలకు ఏదైనా కష్టం వస్తే.. నీ బంగ్లాకు వచ్చే పరిస్థితి లేదు. కొవిడ్ సమయంలో ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే, ఆఖరికి మీ పార్టీ కార్యకర్తలకు కూడా నీవు అందుబాటులో లేకుండా, నీ బంగ్లాకు తాళం వేసుకుని ఇంట్లో పడుకున్నావు. ప్రజలను ఓటు అడిగే హక్కు నీకు ఎక్కడిది..?
- ఓట్లు కావాలంటే.. మా ప్రభుత్వం మీద బురదజల్లితే పడవు.. ఏదైనా మాట్లాడితే, వాస్తవాలు ఆధారంగా మాట్లాడాలి. రాజులం కదా అని ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు నమ్మే రోజులు పోయాయి. 
- జగన్ గారిలా సంక్షేమ పరిపాలనను అందిస్తేనే ప్రజలు విశ్వసిస్తారు. 
- మహారాజా గారి మీద మీకు ప్రేమ ఉంటే.. ఆ మహరాజ పేరిట మీ హయాంలో ఏ ఒక్క కార్యక్రమం అయినా చేశారా..
- ప్రజలు గుర్తుంచుకునే విధంగా ఏ ఒక్క మేలు అయినా చేశారా.. అని అడుగుతున్నాం. 

 అది ప్రభుత్వ స్థలం కాదని నిరూపించే దమ్ముందా..? 
 విజయనగరం ప్రభుత్వాసుపత్రి ఇకమీదట డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆధీనంలో ఉంటుంది. దీని పేరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిగానే పరిగణించబడుతుంది. 
- ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి ఈ మూడేళ్ళలోనే కోట్లాది రూపాయల నిధులు ఖర్చు చేశాం.. దేనికెంత ఖర్చు చేశామో గణాంకాలతో  సహా మీడియాకు వివరించారు. 
- ఆరోగ్యశ్రీలో 3 వేలకు పైగా జబ్బులకు ఉచితంగా చికిత్స చేస్తూ.... ఇక్కడ వైద్యం అందుబాటులో లేకపోతే.. హైదరాబాద్ , బెంగుళూరు, చెన్నై నగరాలకు వెళ్ళి వైద్యం చేయించుకున్నా పైసా ఖర్చు లేకుండా.. ప్రభుత్వమే భరిస్తుంది.
- ఇటువంటి ప్రజా ప్రభుత్వం మీద, మీరు ఏం మాట్లాడినా ప్రజలు నమ్మే రోజులు పోయాయి. పూర్వం రోజులు కాదు, ఇప్పుడు సోషల్ మీడియా యుగం. మీ అబద్ధాలు, అసత్యాలు ప్రజలు నమ్మరు.
- దమ్ముంటే.. ప్రభుత్వ ఆసుపత్రి స్థలం... ప్రభుత్వ స్థలం కాదు అని చంద్రబాబుగానీ, అశోక్ గజపతిరాజుగానీ, లోకేష్ గానీ నిరూపించండి.  ఆ ధైర్యం మీకు ఉందా.. అని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి సవాల్ విసిరారు.

Back to Top