కడుపుమంటతోనే ‘ఈనాడు’ అడ్డగోలు రాతలు

అర్హులందరికీ వైయస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక అందుతోంది

పెన్షన్ల కోసం ప్రతి నెలా రూ.1570 కోట్లు ఖర్చు చేస్తున్నాం

చంద్రబాబు చేసింది రూ.400 కోట్లు మాత్రమే.. ఇచ్చింది 39 లక్షల మందికే..

వైయస్‌ జగన్‌ పాలనలో ఏకంగా 62 లక్షల మందికి పెన్షన్లు అందుతున్నాయ్‌

అర్హులందరికీ పెన్షన్లు అందుతున్నాయని బాబుకు బాధ, రామోజీకి కడుపుమంట

అందుకే ప్రజా ప్రభుత్వంపై, సీఎం వైయస్‌ జగన్‌పై అడ్డగోలు రాతలు

పెన్షన్లపై తప్పుడు రాతలపై డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ధ్వజం

విశాఖపట్నం: అర్హులందరికీ వైయస్‌ఆర్‌ పింఛన్‌ కానుక అందుతుందన్న బాధతో, కడుపుమంటతో ఈనాడు తప్పుడు రాతలు రాస్తోందని, అభూత కల్పనలు సృష్టించి అడ్డగోలు రాతలు రాస్తోందని డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ధ్వజమెత్తారు. గతంలో చంద్రబాబు పెన్షన్ల కోసం నెలకు కేవలం రూ.400 కోట్లు ఖర్చు చేస్తే.. సీఎం వైయస్‌ జగన్‌ ప్రభుత్వం రూ.1570 కోట్లు ఖర్చు చేస్తుంద‌ని వివరించారు. వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతి నెలా 1వ తేదీ లబ్ధిదారుడి ఇంటి తలుపుతట్టి పెన్షన్లు అందజేస్తున్నామని చెప్పారు. పెన్షన్లపై ఈనాడు పత్రిక కథనాన్ని డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు తీవ్రంగా ఖండించారు. విశాఖలోని వైయస్‌ఆర్‌ సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం వైయస్‌ జగన్‌ తీసుకువచ్చిన సచివాలయ, వలంటీర్ల వ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. ఒక్క రూపాయి లంచం లేకుండా అర్హులందరికీ పెన్షన్లు ఇస్తున్నారనే కడుపుమంటతో ఈనాడు అడ్డగోలు రాతలు రాస్తుందని ధ్వజమెత్తారు. గతంలో ఎవరైనా చనిపోతేనే చంద్రబాబు పెన్షన్‌ ఇచ్చేవాడని, అలాంటి సంస్కృతి నుంచి ప్రతి ఒక్క అర్హుడికి పెన్షన్‌ అందించే కార్యక్రమాన్ని దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి చేపట్టారన్నారు. మహానేత తనయుడు సీఎం వైయస్‌ జగన్‌ అర్హులందరికీ పెన్షన్‌ అందిస్తున్నారని,  అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.2250 పెన్షన్‌ అందించారని, తరువాత రూ.2500 పెంచి అందిస్తున్నారన్నారు. 2024 వచ్చే నాటికి పెన్షన్‌ రూ.3 వేలు ప్రతి లబ్ధిదారులకు అందుతుందన్నారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు కేవలం రూ.1000 మాత్రమే పెన్షన్‌ ఇచ్చాడని, కేవలం ఎన్నికలు వస్తున్నాయని హడావుడి చేసి ఎన్నికలకు మూడు నెలల ముందు రూ.2000, అది కూడా అర‌కొర‌గా ఇచ్చాడని గుర్తుచేశారు. 

చంద్రబాబు పెన్షన్ల కోసం నెలకు రూ.400 కోట్లు మాత్రమే ఖర్చు చేసేవారు. గతంలో 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్‌ ఇచ్చేవారని డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు గుర్తుచేశారు. సీఎం వైయస్‌ జగన్‌ ఏకంగా 62 లక్షల మందికి పెన్షన్‌ అందిస్తున్నారని, ఇందుకోసం రూ.1570 కోట్లు ఖర్చు చేస్తున్నారని చెప్పారు. అర్హులందరికీ పెన్షన్లు ఇస్తున్నందుకు చంద్రబాబుకు బాధగా ఉందా లేక, ఈనాడు రామోజీరావుకు కడుపుమంటగా ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబు తన హయాంలో జన్మభూమి కమిటీలు పెట్టి ప్రజలను పట్టిపీడించాడని మండిపడ్డారు. పెన్షన్‌ కావాలంటే రూ. 3వేలు లంచం, ఇల్లు కావాలంటే రూ.30 వేల లంచం, ఆఖరికి టీడీపీకి ఓటు వేసిన కార్యకర్తలను కూడా విడిచిపెట్టకుండా లంచాలు గుంజిన నీచ చరిత్ర చంద్రబాబుదని ధ్వజమెత్తారు.  

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ నాయకత్వంలో సంక్షేమ పథకాలు పారదర్శకంగా, లంచం, వివక్ష లేకుండా అమలవుతున్నాయన్నారు. సీఎం కంప్యూటర్‌ బటన్‌ నొక్కిన వెంటనే నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి సంక్షేమ సాయం జ‌మ అవుతుంద‌ని చెప్పారు. అర్హత ఒక్కటే ఆధారంగా సంక్షేమ పథకాలను అందజేస్తున్నామని చెప్పారు. మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో ఇప్పటికే 95 శాతం అమలు చేశారని, పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం వైయస్‌ జగన్‌ పాలన సాగుతోందని డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు వివరించారు. 

తాజా వీడియోలు

Back to Top