ప్రజా తీర్పును టీడీపీ కించపరిచింది

కుల, శవ రాజకీయాలు చేయడంలో చంద్రబాబు దిట్ట

టీడీపీ 29 గ్రామాలకే పరిమితం అయ్యింది

మండలి చైర్మన్‌ తీరుపై సర్వత్రా ఆగ్రహ జ్వాలలు

టీడీపీ సభ్యుల రౌడీయిజాన్ని చంద్రబాబు మెచ్చుకోవడం సిగ్గుచేటు

వికేంద్రీకరణ బిల్లులను అడ్డుకోవడం దుర్మార్గం

మైనార్టీలకు వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం పెద్దపీట వేసింది

డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా

తాడేపల్లి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు 51 శాతం ఓట్లు, 86 శాతం శాసనసభ్యులను ఇచ్చి అధికారంలోకి తీసుకువచ్చారు. ప్రజా తీర్పును కూడా కించపరిచే విధంగా శాసనమండలిలో టీడీపీ వ్యవహరించిందని డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా మండిపడ్డారు. అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ కావాలని రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటున్నారని, ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా మండలి చైర్మన్, టీడీపీ ఎమ్మెల్సీలు వ్యవహరించారన్నారు. ప్రతిపక్ష నేత హోదాను కూడా చంద్రబాబు దిగజార్చాడని, గ్యాలరీలో కూర్చొని మండలి చైర్మన్‌ను డిక్టేట్‌ చేశారన్నారు. కౌన్సిల్‌లో వికేంద్రీకరణ బిల్లులు అడ్డుకోవడంతో రాష్ట్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. టీడీపీ సభ్యుల రౌడీయిజాన్ని చంద్రబాబు మెచ్చుకోవడం సిగ్గుచేటన్నారు. 

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లారంటే.. ‘లోకేష్‌ వ్యవహరించిన శైలి రాష్ట్ర ప్రజలంతా గమనించారు. రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరించాలి. ప్రాంతాల మధ్య ఉన్న అసమానతలు తొలగించాలి. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సీఎం వైయస్‌ జగన్‌ బిల్లును ప్రవేశపెట్టారు. శాసనసభలో 175 మంది ఉన్న సభలో 151 మంది ఆ బిల్లును పూర్తి స్థాయిలో చర్చించి దానికి ఆమోదం తెలపడం జరిగింది. సభ ఆమోద ముద్ర వేసిన తరువాత కౌన్సిల్‌కు పంపించడం జరిగింది. మండలిని పెద్దల సభ అని కూడా అంటారు. ఆ సభలో వివిధ రంగాలనుంచి ఎన్నికై శాసనమండలికి రావడం జరుగుతుంది. పెద్దల సభలో రాష్ట్ర ప్రజల ఉద్దేశం.. అనేక వర్గాల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని శాసనసభలో ఆమోద ముద్ర వేసిన బిల్లుపై కౌన్సిల్‌లో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. చర్చ చేసి సలహాలు, సూచనలు ఇవ్వాలి. అలాంటి పెద్దల సభ కోట్లాది మంది ఎదురుచూస్తున్న ఈ మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలి.. అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ జరగాలని కోరుకున్నారు. ఆ బిల్లును చైర్మన్‌ వ్యవహరించిన శైలి మనం చూశాం. మండలిలో టీడీపీ సభ్యులు బిల్లు చర్చకు రాకూడదని రూల్‌ 71ని తీసుకువచ్చారు. అలాంటి రూల్‌ను ఉపయోగించి ప్రాముఖ్యత కలిగిన బిల్లును చర్చకు రాకుండా అడ్డుకున్నారు. 

ప్రజలు 51 శాతం ఓట్లు, 86 శాతం శాసనసభ్యులను ఇచ్చిన తీర్పును కూడా తిరస్కరిస్తూ మండలిలో ఏ విధంగా టీడీపీ వ్యవహరించిందో రాష్ట్ర ప్రజలు చూశారు. రూల్‌ 71ను కూడా చర్చకు తీసుకుంటాం.. ముందు బిల్లుకు ప్రాధాన్యం ఇవ్వండి అని అడిగినా పట్టించుకోలేదు. తరువాత అధికార పక్షం మెట్టుదిగి ముందు రూల్‌ 71 చర్చిద్దాం.. తరువాత బిల్లును చర్చిద్దామని చెప్పాం. లోకేష్‌ చాలా సేపు మాట్లాడిన తరువాత కూడా బిల్లుపై చర్చకు రాకుండా వ్యవహరించారు. మండలి చైర్మన్‌ పార్టీ వ్యక్తి కాదు.. చైర్‌ మీద కూర్చున్న తరువాత ఏ పార్టీకి కొమ్ముకాయకూడదు. రూల్‌ ప్రకారం వెళ్లాల్సిందిపోయి.. దానికి విరుద్ధంగా వ్యవహరించారు. రూల్స్‌ ప్రకారం సెలెక్ట్‌ కమిటీకి పంపించలేము.. కానీ, విచక్షణాధికారంతో తప్పు చేయబోతున్నానని చెప్పి బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపించారు. ఇది చాలా దారుణం. మండలి చైర్మన్‌పై కూర్చొని తప్పు చేశారు. చైర్మన్‌ చేసిన తప్పుపై ప్రజల నుంచి ఆగ్రహాలు వ్యక్తం అవుతున్నాయి. టీడీపీ శాసనమండలి సభ్యులు దారుణంగా వ్యవహరించారు. సెల్‌ఫోన్‌తో నిండుసభలో లోకేష్‌ వీడియో తీశారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే ప్రతిపక్ష నేత గ్యాలరీలో కూర్చొని చైర్మన్‌ను డిక్టేట్‌ చేశారు. కాలయాపన చేయాలనే దురుద్దేశంతో బిల్లును అడ్డుకున్నారు. 

చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌ పెట్టి టీడీపీ ఎమ్మెల్సీలు హీరోలు అని మాట్లాడుతున్నారు. మండలిలో గందరగోళం చేసిన తరువాత టీడీపీ ఎమ్మెల్సీలను తన చాంబర్‌లో బాబు శభాష్‌ అని మెచ్చుకున్న వీడియో కూడా చూశాం. రౌడీల్లా వ్యవహరిస్తే వాళ్లను శభాష్‌ అనడం చాలా బాధాకరం. 1984 ఆగస్టు సంక్షోభంలో ఎమ్మెల్యేలంతా హీరోలు అయ్యారంట.. ఆ స్ఫూర్తితో టీడీపీ శాసనమండలి సభ్యులు ఉద్యమించారని చంద్రబాబు మాట్లాడడం సిగ్గుచేటు. కుల, శవ రాజకీయాలు చేయడంలో చంద్రబాబుకు దీటు ఎవరూ లేరు. ప్రతిపక్ష నేత హోదాస్థాయిని దిగజార్చుకొని 29 గ్రామాలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశాలు చూస్తున్నాం. 

శ్రీబాగ్‌ ఒప్పందాన్ని మా ప్రభుత్వం గుర్తించి కర్నూలుకు హైకోర్టు తీసుకురావాలని ఆలోచన చేసింది. విశాఖకు ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్, అమరావతిలో లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌ తీసుకువచ్చేందుకు బిల్లు తీసుకువచ్చాం. కౌన్సిల్‌లో బలం ఉందనే దురుద్దేశంతో బిల్లును అడ్డుకున్నారు. ప్రజలందరి మనోభావాలకు అనుగుణంగా ప్రతిపక్షం కూడా నిర్ణయాలు తీసుకోవాలి. నాపై మంత్రులు ఎలాంటి ఒత్తిడి చేయలేదని మండలి చైర్మన్‌ కూడా చెప్పారు. అన్యాయం జరుగుతుందని మాట్లాడారు కానీ, కులం, మతం పేరుతో ఎక్కడా దూషించిన పరిస్థితులు లేవు. ముస్లింల గురించి మాట్లాడే హక్కు తెలుగుదేశం పార్టీకి లేదు. గత ఐదేళ్లలో ముస్లిం కమ్యూనిటీకి ఏం చేసిన పాపానపోలేదు. వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం మైనార్టీ అభివృద్ధికి పాటుపడుతుంది. మైనార్టీలంటే పేటెంట్‌ వైయస్‌ఆర్‌ సీపీకి, వైయస్‌ జగన్‌కు, దివంగత మహానేత వైయస్‌ఆర్‌కు ఉంటుంది. చంద్రబాబు ఎన్ని కులరాజకీయాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు’ అని అంజాద్‌బాషా అన్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top