కాకినాడ జిల్లా: తనపై సిట్, సీబీఐ విచారణకు సిద్ధమంటూ డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు చేసిన సవాలును వైయస్ఆర్‌సీపీ పెద్దాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి దవులూరి దొరబాబు స్వీకరించారు. తనపై ఎలాంటి సిట్ లేదా సీబీఐ విచారణ జరిపించినా ఎదుర్కొనేందుకు తాను పూర్తి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. అదే సమయంలో కాకినాడ డీసీసీబీ బ్యాంకులో చోటుచేసుకున్న కుంభకోణాలపై తాను చేసిన ఆరోపణలపైనా సిట్ లేదా సీబీఐతో నిష్పాక్షిక విచారణకు తుమ్మల బాబు సిద్ధమా అని ప్రశ్నించారు. ప్రస్తుతం తుమ్మల బాబు ప్రభుత్వమే అధికారంలో ఉన్నందున, కేవలం తనపైనే కాకుండా కాకినాడ డీసీసీబీ బ్యాంకు కుంభకోణాలపైనా ఒకేసారి నిష్పాక్షిక విచారణ జరిపించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని దవులూరి దొరబాబు కోరారు. తనపై విచారణకు ఎలాంటి భయం లేదని, నిజానిజాలు నిష్పాక్షిక విచారణలో తేలిపోతాయని స్పష్టం చేశారు. తుమ్మల బాబు తన సవాలును నిజంగా నిలబెట్టుకోవాలంటే కాకినాడ డీసీసీబీ వ్యవహారాలపై కూడా అదే స్థాయిలో విచారణకు ముందుకు రావాలని దవులూరి దొరబాబు పేర్కొన్నారు.