అనంతపురం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనలో ప్రచార ఆర్భాటాలు తప్ప అభివృద్ధి, సంక్షేమం కనిపించడం లేదని వైయస్ఆర్‌సీపీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు మొఘల్ సైఫుల్లా బేగ్ విమర్శించారు. ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పేరుతో ప్రజలకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, రెండేళ్లు పూర్తవుతున్నా ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు. అనంతపురం జిల్లా వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ నాయక్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నరసింహులతో కలిసి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా సైఫుల్లా బేగ్ మాట్లాడుతూ, సుపరిపాలన గురించి ప్రభుత్వం చెప్పుకోవడం కాదని, ప్రజలే చెప్పాల్సి ఉంటుందని ఎద్దేవా చేశారు. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, 50 ఏళ్లకే పెన్షన్ వంటి హామీలు అమలు కాలేదని, ఆరోగ్యశ్రీ వ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ఉద్యోగులను కూడా మోసం చేశారని, మెగా డీఎస్సీ చివరకు "దగా డీఎస్సీ"గా మారిందని విమర్శించారు. కూటమి పాలనలో ప్రచారం ఎక్కువగా ఉండి, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు కనిపించడం లేదన్నారు. అనంతపురం నగర అభివృద్ధిపై ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలను ప్రస్తావిస్తూ, ఒకరోజు రూ.130 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని, మరోరోజు రూ.180 కోట్ల పనులు జరిగాయని చెబుతున్నారని, కానీ వాస్తవంగా కాంట్రాక్టర్లు, టీడీపీ నాయకులే అభివృద్ధి చెందారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి హయాంలో ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలే ఇప్పటికీ కనిపిస్తున్నాయని, కూటమి ప్రభుత్వం చేపట్టిన కొత్త అభివృద్ధి పనులు ఎక్కడా కనిపించడం లేదన్నారు. ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియలో ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని సైఫుల్లా బేగ్ సూచించారు. ముఖ్యంగా వైయస్ఆర్‌సీపీకి అనుకూల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందనే అనుమానాలు ఉన్నాయని, పార్టీ శ్రేణులు తమ ఓట్లను కాపాడుకునేలా అప్రమత్తంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ బాబా సలాం, మైనార్టీ విభాగం నగర కార్యదర్శి అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.