విజయవాడ: కృష్ణలంక వాసుల వరద కష్టాలు తీరనున్నాయి. రూ.125 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. కలెక్టర్ ఇంతియాజ్, సీపీ బత్తిన శ్రీనివాస్, కార్పొరేషన్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, ఇరిగేషన్ అధికారులు స్థలాన్ని పరిశీలించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణలంక వాసుల ఇబ్బందులను వైయస్సార్‌సీపీ ప్రభుత్వం తీరుస్తుందన్నారు. రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయని వెల్లడించారు. కరకట్ట వాసులకు ఇబ్బంది లేకుండా శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. అభివృద్ధిపై సీఎం వైయస్ జగన్ ప్రత్యేక దృష్టి.. వైయస్సార్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. గత టీడీపీ చేయలేని పనిని తాము చేసి చూపిస్తామన్నారు. విజయవాడ అభివృద్ధిపై సీఎం వైయస్ జగన్ ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. దాదాపు రూ.125 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే విష్ణు తెలిపారు.