ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌

యాస్‌ తుపాన్‌ హెచ్చరికల దృష్ట్యా ముందస్తు చర్యలపై దిశానిర్దేశం

తాడేపల్లి: యాస్‌ తుపాన్‌ దృష్ట్యా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ శాఖ నివేదికలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. తుపాన్‌ హెచ్చరికల దృష్ట్యా ఉత్తరాంధ్ర పరిస్థితులపై ఆయా జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల కలెక్టర్లతో సీఎం వైయస్‌ జగన్‌ చర్చించి.. ముందస్తు చర్యలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. 

వాతావరణ శాఖ నివేదికలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని, కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ శ్రీకాకుళం జిల్లా నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని.. అక్కడి పరిస్థితులను సీఎంకు వివరించారు. శ్రీకాకుళంలో అక్కడక్కడా జల్లులు తప్ప పెద్దగా తుపాన్‌ ప్రభావం కనిపించలేదన్నారు. తాత్కాలిక నిర్మాణాల్లో ఉన్న కోవిడ్‌ రోగులను వేరే ప్రాంతాలకు తరలించామని, విద్యుత్‌కు అంతరాయం లేకుండా జనరేటర్లు, డీజిల్‌ సిద్ధం చేశామన్నారు. ఈ స‌మీక్షా స‌మావేశానికి తాడేప‌ల్లి క్యాంపు కార్యాల‌యం నుంచి పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, అగ్రికల్చర్ మిషన్ వైస్ ఛైర్మన్‌ ఎంవీయస్‌ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, వ్యవసాయశాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Back to Top