పోలీసు అమరవీరులకు సెల్యూట్‌ 

అమరవీరుల సంస్మరణ దినోత్సవం సభలో సీఎం వైయస్‌ జగన్‌

పోలీసులకు మొట్ట మొదటిగా వీక్లీ ఆఫ్‌ ప్రకటించాం

పోలీసు సిబ్బందికి రూ.40 లక్షల బీమా సౌకర్యం

హోంగార్డుల వేతనం రూ.18 వేల నుంచి రూ.21 వేలకు పెంపు

విజయవాడ : రాష్ట్ర భద్రత కోసం ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరులకు సెల్యూట్‌ చేస్తున్నా అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  పేర్కొన్నారు. పేదవారు సైతం వివక్షకు గురికాకుండా తమకు న్యాయం జరిగిందని చిరునవ్వుతో ఇంటికి వెళ్లగలిగినపుడే పోలీసు వ్యవస్థ మీద గౌరవం మరింత పెరుగుతుందని అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన సంస్మరణ సభలో సీఎం జగన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసు అమరవీరులకు నివాళులు అర్పించి... ‘అమరులు వారు’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశ రక్షణకై చైనా సైన్యం దాడిలో వీరోచితంగా పోరాడుతూ వీరమరణం పొందిన పోలీసు అధికారి కరణ్‌సింగ్‌ సహా పదిమంది సీఆర్పీఎఫ్‌ సిబ్బంది త్యాగాన్ని గుర్తుచేసుకుంటూ పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకొంటున్నామన్నారు. అలాంటి అమరవీరులు అందరికీ ఈ సందర్భంగా సెల్యూట్‌ చేస్తున్నా అన్నారు. 

ఇక మెరుగైన పోలీసు వ్యవస్థ కోసం ప్రతీ పోలీసు సోదరసోదరీమణులు నిరంతరం కృషి చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు. ‘ పోలీస్ టోపీ మీద ఉన్న సింహాలు దేశ సార్వభౌమాధికారానికి నిదర్శనం. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎంతటివారికైనా మినహాయింపు ఉండకూడదు. బడుగు, బలహీన వర్గాలకు అన్యాయం జరిగితే ఎంతవారినైన చట్టం ముందు నిలబెట్టమని ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సమావేశంలోనే చెప్పాను. ఒక్కొక్కరికి ఒక్కో రూల్ ఉండకూడదు. చట్టం అనేది అందరికి ఒకటే.. అది కొందరికి చుట్టం కాకూడదు. పోలీసులు ప్రజల మన్ననలు పొందేలా పనిచేయాలి’ అని పిలుపునిచ్చారు. 

లంచగొండితనం, అవినీతి, రౌడీయిజంపై  యుద్ధం చేయాలి

సీఎం జగన్‌ తన ప్రసంగం కొనసాగిస్తూ.. ‘పోలీసులు సెలవులు లేకుండా కష్టపడుతున్నారని నాకు తెలుసు. అందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా పోలీసులకు వీక్లీ ఆఫ్‌ ప్రకటించాం. అలా చేసిన తొలి రాష్ట్రం మనదే. వారంలో ఒకరోజు పోలీసులు తమ కుటుంబంతో గడిపితే మానసికంగా బలంగా ఉంటారు. లంచగొండితనం, అవినీతి, రౌడీయిజంపై నిజాయితీగా మీరు యుద్ధం చేయాలి. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హోంగార్డుల జీతాలను రూ. 18 వేల నుంచి రూ. 21 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాం. హోంగార్డులు మరణిస్తే రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన తొలి రాష్ట్రం కూడా మనదేనని గర్వంగా చెబుతున్నా. విధి నిర్వహణలో హోంగార్డులు మరణిస్తే రూ. 30 లక్షలు, పోలీసులు మరణిస్తే 40 లక్షల ఇన్స్యూరెన్స్ కవరేజ్ సదుపాయాన్ని తీసుకొచ్చాం. రిటైర్డు సిబ్బందికి కూడా బీమా వర్తిస్తుంది. ఇందుకుగానూ కృషి చేసిన హోం మంత్రి, డీజీపీ సవాంగ్‌కు అభినందనలు’ అని పేర్కొన్నారు. మెరుగైన సమాజం కోసం పోలీసులు కృషి చేయాలని.. అందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Read Also: పోలీసు త్యాగధనులకు సీఎం వైయస్‌ జగన్‌ నివాళులు

తాజా వీడియోలు

Back to Top