తాడేపల్లి: దిశ తరహాలో అవినీతిపై ఫిర్యాదులకు ఏసీబీ యాప్ తీసుకురావాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో ఏసీబీ, దిశ, ఎస్‌ఈబీ కార్యకలాపాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఏసీబీకి యాప్ ద్వారా ఆడియో ఫిర్యాదు సైతం చేయొచ్చన్నారు. అవినీతి చోటు చేసుకుంటున్న విభాగాలను క్లీన్ చేయాల్సిందేనన్నారు. హోంశాఖపై సీఎం వైయస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. నెలరోజుల్లోగా ఏసీబీ యాప్‌ను తయారు చేయాలి, కార్యాచరణ కూడా సిద్ధంచేయాలని ఆదేశించారు. దీనిద్వారా ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు, తమ వద్దనున్న ఆడియో, వీడియో సహా పత్రాలను నేరుగా అప్‌లోడ్ చేయొచ్చని సీఎం అభిప్రాయపడ్డారు. వీటిని నిర్ధారించడానికి అధునాతన ఫోరెన్సిక్ వ్యవస్థలు కూడా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే.. – అవినీతి నిరోధం, సమర్థవంతంగా ‘దిశ’ అమలు, ఎస్‌ఈబీ కార్యకలాపాలసహా సోషల్ మీడియా ద్వారా వేధింపులను అడ్డుకోవడంపై అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. – ప్రతి హోంమంత్రి, డీజీపీ కూడా తమ విధినిర్వహణలో తమదైన ముద్ర ఉండాలి, ఇది వారికి గర్వకారణంగా నిలుస్తుంది. – నిర్దేశించుకున్న లక్ష్యాలవైపు ఏకాగ్రతతో ముందుకుసాగాలి. అవినీతి నిరోధకశాఖ – అవినీతి నిరోధానికి ఏసీబీలో 14400 నంబర్ పెట్టాం. – ఈ నంబర్‌ను మరింత విస్తృతంగా ప్రచారంలోకి తీసుకురావాలి. – ఏసీబీ విధులేంటి, ఎలా పనిచేస్తుందన్నది విస్తృతంగా తెలియాలి. – అవినీతికి ఎక్కడా కూడా ఆస్కారం ఉండకూడదు. ఎక్కడా కూడా అవినీతి అన్నది కనిపించకూడదు. ఏసీబీకి ఇది ప్రాధమిక విధికావాలి. – ఆడియో, వీడియో రికార్డింగ్ సాక్ష్యాలున్నా వాటిని ఏసీబీ నెంబరుకు చేరవేసే ఏర్పాటు ఉండాలి. –అందుకు తగినట్టుగా నెంబరు ఏర్పాటుచేసి, దాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలి. –అవినీతి కేసులు ఎక్కువగా నమోదవుతున్న విభాగాల్లో మరింత దృష్టిపెట్టాలి. – గ్రామ, వార్డు సచివాలయాలు అవినీతికి దూరంగా ఉన్నాయి. భవిష్యత్తులోకూడా ఈ వ్యవస్థలో అవినీతి వ్యవహారాలు కనిపించకూడదు. –దీనికోసం అవసరమైన ఎస్‌ఓపీలు తయారు చేయాలి. – గ్రామ, వార్డు సచివాలయాల్లోకి సబ్ రిజిస్ట్రార్ వ్యవస్థలు వస్తున్నాయి. సర్వేయర్లు వస్తున్నారు. – భూముల పంపకాలవల్ల వచ్చే డివిజన్, సర్వే, రిజిస్ట్రేషన్ తదితర ప్రక్రియలన్నీ సచివాలయాల్లోనే జరుగుతాయి – అలాంటి సందర్భాల్లో కూడా అవినీతికి ఆస్కారం ఉండకూడదు. – అవినీతి చోటుచేసుకుంటున్న వ్యవస్థలను క్లీన్ చేసుకుంటూ వెళ్లాలి. – ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న గోరుముద్ద, సంపూర్ణ పోషణ వంటి కార్యక్రమాల్లో అవినీతికి, లంచాలకు తావు ఉండకూడదు. – అవినీతి జరుగుతున్నట్టుగా ఆడియో రికార్డ్ ఉన్నా, దాన్ని పంపించినా సరే.. చర్యలు తీసుకునేట్టుగా వ్యవస్థ ఉండాలి. – రూ.1.35 లక్షల కోట్లు మూడేళ్ల కాకముందే డీబీటీ పద్ధతుల్లో ప్రజలకు ఇచ్చాం. –ఎలాంటి మధ్యవర్తులు లేకుండా ఎక్కడా కూడా పైసా అవినీతి, వివక్షకు తావు లేకుండా ప్రజల ఖాతాలకు పంపాం. – వచ్చే రెండేళ్లతో కలిపితే సుమారు రూ.2.5లక్షల కోట్లు ప్రజలకు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా అందిస్తున్నాం. – దేవుడి దయవల్ల ఎలాంటి అవినీతికి చోటు లేకుండా ఇవన్నీ చేస్తున్నాం. – మండలస్థాయి వరకూ కూడా ఏసీబీని బలోపేతం చేయాలి. – అవినీతి నిరోధం, దిశ, ఎస్‌ఈబీ.. ఈమూడు అంశాలకు సంబంధించి మండలస్థాయిల్లో స్టేషన్లు ఉండాలి, ఈ మూడు అంశాలను పర్యవేక్షించడానికి ప్రతి జిల్లా స్థాయిలో ఒక అధికారి ఉండాలి. – దిశమాదిరిగా అవినీతి నిరోధానికి ఒక యాప్‌ను పెట్టాలి. – నెలరోజుల్లోగా యాప్‌ను తయారు చేయాలి, కార్యాచరణ కూడా సిద్ధంచేయాలి. – దీనిద్వారా ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు, తమ వద్దనున్న ఆడియో, వీడియో సహా పత్రాలను నేరుగా అప్‌లోడ్ చేయొచ్చు. – వీటిని నిర్ధారించడానికి అధునాతన ఫోరెన్సిక్ వ్యవస్థలు కూడా ఉండాలి. – లంచాల కేసుల్లో అరెస్టయిన వారికి వేగంగా శిక్షలు కూడా పడాలి. – ప్రస్తుతం ఉన్న చట్టాలను కూడా పరిశీలించి, మార్పులు, చేర్పులు ఉంటే చేసి సమర్థవంతంగా అమలు చేయాలి. – ఏ అవినీతి వ్యవహారంపైనైనా ఏసీబీ పర్యవేక్షణ చేపట్టాలి. – ప్రభుత్వ పథకాల్లో అవినీతిపైన వచ్చిన ఫిర్యాదులపైనా ఏసీబీ దృష్టిపెట్టాలి. – సంబంధిత శాఖలు ఆ ఫిర్యాదులపై తీసుకుంటున్న చర్యలను ఏసీబీ పర్యవేక్షించాలి. – దీనికోసం వివిధ ప్రభుత్వ విభాగాలు, ఏసీబీ మధ్య సినర్జీ ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలి. – ఏసీబీకి ఫిర్యాదు చేయాల్సిన నంబర్‌ను ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా బాగా కనిపించేలా హోర్డింగ్స్ పెట్టాలి. – యాప్ ద్వారా ఎలా ఫిర్యాదు చేయొచ్చు.. అన్నదానిపై తగిన సూచనలు కూడా ఈ హోర్డింగ్‌లో ఉండాలి. దిశ – ఇది మునుపెన్నడూ జరగనటువంటి కార్యక్రమం. – హోంమంత్రి, డీజీపీ దిశ అమలును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. – ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టిన ప్రతి బాలిక, మహిళ చేతిలో సెల్‌ఫోన్ ఉంటే చాలు.. భద్రతకు భరోసా లభించినట్లే. – ఎస్‌ఓఎస్ బటన్ నొక్కినా ఫోన్‌ను 5 సార్లు అటూ, ఇటూ ఊపితే చాలు 10–15 నిమిషాల్లో పోలీసులు ఉంటారు. – ఈ రెస్పాన్స్ టైంను ఇంకా తగ్గించడంతో పాటు కచ్చితంగా వారికి సహాయం అందాలి. – ఎంత వేగంగా ఘటనా స్ధలానికి చేరగలిగితే అంతే వేగంగా నేరాన్ని నివారించగలుగుతాం. – దీనివల్ల మహిళలు, బాధితులకు భద్రతకల్పించే విషయంలో గొప్ప మార్పు వస్తుంది. – దిశను మరింత సమర్ధవంతంగా నిర్వహించడానికి మరింత మెరుగైన ప్రోటోకాల్స్ రూపొందించాలి. – ప్రభుత్వం తరపు నుంచి ఇంకా ఏం కావాలన్నా చేయడానికి సిద్ధం. – ఇంతవరకు 1.24 కోట్ల దిశ యాప్ డౌన్లోడ్స్ అయ్యాయి. – మన లక్ష్యం.. నేరాన్ని నివారించడమే కాదు, ఆ క్రైమ్ చేసిన వ్యక్తికి శిక్ష విధించడం. – ఈ మొత్తం ప్రక్రియలో వ్యవస్ధ అత్యంత సమర్ధవంతంగా పనిచేయాలి. – ఇప్పుడు ఏర్పాటుచేసుకున్న వ్యవస్థలను బలోపేతం చేసేదిశగా చేసే ఎలాంటి ప్రతిపాదనలను అయినా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్‌ఈబీ) – మద్యం అక్రమ రవాణా, అక్రమ మద్యం తయారీని ఉక్కుపాదంతో అణిచివేయాలి. – ఎస్‌ఈబీకి నిర్దేశించిన కార్యకలాపాలు కూడా అత్యంత కీలకం. – ఎస్‌ఈబీకోసం కూడా ఒక కాల్‌సెంటర్ నంబర్‌ను పెట్టాలి. – మద్యం అక్రమరవాణా, అక్రమ మద్యం తయారీలను ఉక్కుపాదంతో అణచివేయాలి. – ఆధునిక నాగరికత పేరుతో వస్తున్న పెడధోరణులకు అడ్డుకట్టవేయాలి. – డ్రగ్స్, గంజాయిని పూర్తిగా నిరోధించాలి. – విద్యాసంస్థలమీద పూర్తిగా నిఘా పెట్టాలి. జూనియర్ కళాశాలలు మొదలుకుని, ఇంజనీరింగ్, డిగ్రీ, మెడికల్ కాలేజీలు, యూనివర్సిటీలు మీద ఫోకస్ పెట్టాలి. – మన పిల్లలు వీటి బారిన పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. – ఎక్కడ ఏం జరిగినా... మనకు వెంటనే సమాచారం వచ్చేలా అందుకు తగ్గ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. –కాలేజీ స్ధాయి వరకు ఇన్‌ఫార్మర్ వ్యవస్ధను ఏర్పాటు చేసుకోవాలి – ఏ సమాచారం వచ్చినా సరే.. వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలి. – కేవలం డ్రగ్స్‌ను విక్రయిస్తున్న వారిపైనే కాకుండా.. మూలాల్లోకి పోయి.. ఆ వ్యవస్థలను కూకటి వేళ్లతో పెకలించాల్సిన అవసరం ఉంది. – చీకటి సామ్రాజ్యాలలో జరిగే ఇలాంటి కార్యకలాపాలపై కూడా పోలీసులు దృష్టిపెట్టాలి, నిఘా పెంచాలి. – టయర్ వన్ సీటీలలో డ్రగ్స్ లాంటి ఘటనలు చూశాం. అలాంటివి ఇక్కడకూడా జరుగుతున్నాయా? అన్నది దృష్టి పెట్టాలి. – మన పిల్లల్ని, మన విద్యావ్యవస్థలను మనం కాపాడుకోవాలి. – అలాంటి కార్యక్రమం మనం చేయకపోతే భవిష్యత్ తరం ఫెయిలవుతుంది. – వారికి మంచి భవిష్యత్తును అందించే వాతావరణాన్ని అందించాల్సిన బాధ్యత మనది. – ఒకరి జీవితాలను, కొన్నికుటుంబాలను నాశనంచేసే పరిస్థితులు రాష్ట్రంలో ఎక్కడా ఉండకూడదు. – అత్యంత సమర్థవంతంగా పోలీసులు వ్యవహరించాలి. – సామాజిక మాధ్యమాల ద్వారా వేధింపులకు పాల్పడుతున్న వారిపైకూడా కఠిన చర్యలు తీసుకోవాలి. – నేను పేర్కొన్న అంశాల్లో ఇవాళ మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏంటో మదింపు చేయండి. – ప్రతినెలా నాతో జరిగే సమావేశంలో మళ్లీ ఏ స్థాయిలో మెరుగుపడ్డామో బేరీజు వేసి నివేదిక ఇవ్వండి. – ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాలను పరిశీలించి సమర్థవంతమైన కార్యాచరణ ప్రణాళిక కూడా సిద్ధం చేయండి. – గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న మహిళా పోలీసుకు కూడా దిశ, ఎస్‌ఈబీ, ఏసీబీ ఈ మూడింటి కార్యకలాపాలపైనా అవగాహన కల్పించాలి. యాప్స్ వినియోగంపై అవగాహన కల్పించాలి. దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వారికి సలహాలు, సూచనలను నోటిఫికేషన్స్ రూపంలో పంపించాలి. దీనివల్ల ఘటన జరగ్గానే యాప్‌ను చురుగ్గా వాడుకునేలా సిద్ధంగా ఉంటారు. నేరనిర్ధాణకు అత్యంత కీలకమైన ఫోరెన్సిక్ వ్యవస్థలను బలోపేతం చేయాలి. అవసరమైన వాటిని అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈ సమీక్షా సమావేసంలో హోంశాఖమంత్రి తానేటి వనిత, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ కె.వి. రాజేంద్రనాథ్‌రెడ్డి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.