వీలైనంత త్వరగా ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలి

ప్రతి లేఅవుట్‌ను రీ విజట్‌ చేసి అన్ని సౌకర్యాలు ఉండేలా చూడాలి

వైయస్‌ఆర్‌ జగనన్న కాలనీల నిర్మాణానికి సకాలంలో నిధులు

లబ్ధిదారుకు రాయితీపై సిమెంటు, స్టీల్‌ను అందించాలి

కాలనీలను అందంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలి

అధికారులకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశం

వైయస్‌ఆర్‌ జగనన్న కాలనీల నిర్మాణంపై సీఎం సమీక్ష

తాడేపల్లి: చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా పేదలకు ఇళ్లు ఇస్తున్నామని, వీలైనంత త్వరగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేయాలని, ప్రతి లేఅవుట్‌ను రీ విజిట్‌ చేసి అన్ని సౌకర్యాలు ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. వైయస్‌ఆర్‌ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, శ్రీరంగనాధరాజు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..  తొలి విడతలో 15 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని, ఇళ్ల నిర్మాణానికి సకాలంలో నిధులు విడుదల చేయాలని ఆదేశించారు. కాలనీల నిర్మాణంలో చెట్లను నాటేందుకు మార్కింగ్‌ చేయాలన్నారు. వైయస్‌ఆర్‌ జగనన్న కాలనీలు ఆదర్శంగా ఉండాలని అధికారులకు సీఎం వైయస్‌ జగన్‌ సూచించారు. లేఅవుట్‌లను అందంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలన్నారు. ఇళ్ల నిర్మాణానికి ఏయే సమయాల్లో ఎంత నిధులు విడుదల చేయాలనే దానిపై ఒక ప్రణాళిక వేయాలని సూచించారు. 

తొలి విడతలో 15 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మూడు ఆప్షన్ల ప్రక్రియను ఇప్పటికి 83 శాతం మంది వినియోగించుకున్నారని అధికారులు సీఎంకు వివరించారు. మిగతావారి నుంచి కూడా వెంటనే ఆప్షన్లు స్వీకరించాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. మూడు ఆప్షన్లలో ఏ ఆప్షన్‌ ఎంచుకున్నా.. లబ్ధిదారుకు రాయితీపై సిమెంటు, స్టీల్‌ను అందించాలన్నారు. నిర్మాణ సామగ్రి కూడా అందరికీ అందుబాటులో ఉంచాలని సూచించారు. 

వైయస్‌ఆర్‌ జగనన్న కాలనీల్లో ప్రజలకు మంచి జీవన ప్రమాణాలు అందాలని సీఎం ఆదేశించారు. రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, పార్కులు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. కాలనీల్లో ప్రతి 2 వేల జనాభాకు అంగన్‌వాడీ ఉండాలని, ప్రతి 1500 నుంచి 5వేల ఇళ్లకు గ్రంథాలయం అందుబాటులో ఉండాలని తెలిపారు. పట్టణాలు, నగరాల్లో మధ్య తరగతి ప్రజలకు సరసమైన ధరలకు ప్లాట్లు ఇవ్వడం ద్వారా ఏర్పాటు కానున్న కాలనీల్లో కూడా మౌలిక సదుపాయాలు ఎలా ఉండాలనే అంశంపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా కాలనీల డిజైన్లను సీఎం పరిశీలించారు. 

 

Back to Top