ఆర్‌బీకేల ఘ‌ట్టంలో ఇంకో ముంద‌డుగు వేశాం

ఆర్‌బీకే ఛానెల్ ప్రారంభించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

ప్రతి గ్రామంలోనూ రైతులకు దగ్గరగా ఉండే ఒక వ్యవస్ధ రైతు భరోసా కేంద్రం  

విత్తనం నుంచి విక్రయం వరకు రైతు చేయిపట్టుకుని నడిపించే వ్యవస్ధ ఆర్‌బీకే 

విత్తనాలు దగ్గర నుంచి ఫెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్‌ సహా ఏం కొనుగోలు చేసినా రైతు మోసపోకూడదు  

ఏ రైతు కూడా త‌క్కువ ధ‌ర‌కు పంట అమ్ముకోవాల్సిన అన్యాయమైన పరిస్ధితి  ఉండకూడదు
 
 రైతులు సందేహం అడిగితే 155251  టోల్‌ ప్రీ నంబరు ద్వారా సమాధానం లభిస్తుంది

‌రబీ ప్రొక్యూర్‌మెంట్‌ 2020–21తో పాటు 2021–22 ఖరీప్‌ సన్నద్ధతపై సీఎం శ్రీ‌ వైయస్ జగన్‌ సమీక్ష

 తాడేప‌ల్లి:  రైతు భ‌రో‌సా కేంద్రాల (ఆర్బీకే) ఘట్టంలో ఈ రోజు ఇంకో ముందడుగు వేశామ‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతి గ్రామంలోనూ రైతులకు దగ్గరగా ఉండే ఒక వ్యవస్ధ, రైతులకు విత్తనం వేసే రోజు నుంచి పంట అమ్ముకునేంతవరకు కూడా ప్రతి అడుగులోనూ రైతుకు తోడుగా ఉంటూ చేయి పట్టుకుని  నడిపించే వ్యవస్ధ కచ్చితంగా గ్రామాలలో రావాలి అన్న తాపత్రయం, తపన నుంచి పుచ్చిన బీజం రైతు భరోసా కేంద్రం (ఆర్బీకే). ఈ రోజు గ్రామాలలో రైతు భరోసా కేంద్రాలన్నీ కూడా పనిచేస్తున్నాయి. రైతులందరికీ కూడా పర్మినెంట్‌గా ఈ భవనాలన్నీ కూడా ఉండాలి అన్న  తపన, తాపత్రయంతో కొత్త భవనాలన్నీ కూడా గ్రామాల్లో కట్టడం జరుగుతుంది.

రైతులకు సంబంధించిన అన్ని విషయాల్లో సలహాలు, సూచనలు ఇస్తూనే ఈ  ఆర్బీకేలు రైతులకు ఏదైనా కొనుగోలు చేయాలంటే కూడా విత్తనాలు దగ్గర నుంచి ఫెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్‌ ఏదైనా సరే కొనుగోలు చేసేటప్పుడు  రైతు మోసపోకూడదు, క్వాలిటీ లేని వస్తువులు రైతు కొనుగోలు చేసే పరిస్ధితి ఉండకూడదు అని తాపత్రయంతో ఆ సీడ్‌ కాని, ఫెర్టిసైడ్‌ కాని, ఫెర్టిలైజర్‌ను కూడా గవర్నమెంట్‌ టెస్ట్‌ చేసి, గ్యారంటీ ఇచ్చి ఈ క్వాలిటీ స్టాండర్డ్‌ మీద గవర్నమెంట్‌ స్టాంప్‌ వేసి, వాటిని గ్రామాలలో రైతులు ఆర్డర్‌ ప్లేస్‌ చేసిన వెంటనే 48 గంటల నుంచి 72 గంటలలోపు పూర్తిగా అందుబాటులోకి తీసుకుని వచ్చి గ్రామంలోనే రైతుకిచ్చే పరిస్ధితి కనిపిస్తుంది. 

 కల్తీ అన్నది రైతు దగ్గరకి రాకూడదన్న తాపత్రయంతో అడుగులు ముందుకు వేస్తున్న పరిస్ధితులు ఈ రోజు ఆర్బీకేల్లో కనిపిస్తున్నాయి. ఇదే ఆర్బీకేల్లోనే అగ్రికల్చర్‌ అసిస్టెంట్లు కూర్చుంటారు.  ఈ– క్రాపింగ్‌ విధానం ఇక్కడ నుంచే జరుగుతుంది. ఇదే ఆర్బీకేల పరిధిలోనే ఏయే పంటలకు కనీస గిట్టుబాటు ధరలు ఏమిటి ఆని చెప్పి డిస్‌ ఫ్లే చేసిన పోస్టర్‌ ఆర్బీకేల్లో ఉంది. ఎవరైనా కూడా ఆ గ్రామంలో ఆ రేట్ల కన్నా తక్కువ రేట్లకు ఎక్కడైనా పంట అమ్ముకోవాల్సిన అన్యాయమైన పరిస్ధితి ఏదైనా రైతుకి ఉంటే, వెంటనే ఆర్బీకేల్లోకి వచ్చి వాళ్లు రిజిష్టర్‌ చేసుకోవడం,  మన అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ ఎవరైతే ఆ గ్రామాల్లో ఆర్బీకేల్లో ఉంటారో ఆ గ్రామానికి సంబంధించిన విషయాలన్నీ కూడా సీఎం యాప్‌ ద్వారా ఏదైనా పంటకు ఇబ్బంది ఉంటే, ఆ పంట కూడా అమ్ముకోలేని పరిస్ధితి ఉంటే అటువంటి పరిస్థితుల్లో మార్కెటింగ్‌ శాఖ జోక్యం చేసుకుని అమ్మించే ప్రయత్నం చేయడం, ఒకవేళ అలా అమ్మించలేకపోతే మార్కెటింగ్‌ శాఖే నేరుగా కొనుగోలు చేయడం, ఇదంతా కూడా జాయింట్‌ కలెక్టర్‌ ఆధ్వర్యంలో   జరుగుతుంది. 

ఇవన్నీ కూడా ఆర్బీకేల పరిధిలోకి తీసుకొచ్చే అంశాలలో చాలా అడుగులు ముందుకు వేస్తూ వస్తూ ఉన్నాం. ఇందులో భాగంగానే ఎలాగూ ఆర్బీకేల్లో స్మార్ట్‌ టీవీలు పెడుతున్నాం కాబట్టి అక్కడ రైతులకు సంబంధించి చాలా విషయాల మీద అంటే పంటలకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాతావరణం ఎలా ఉంటుందని తెలియజెప్పే పరిస్ధితులు కానీ, వీటన్నింటి మీద నిరంతరం సమాచారం ఇచ్చే కార్యక్రమం ఈ ఛానెల్‌ ద్వారా సాధ్యపడుతుంది అని చెప్పి ఒక అడుగు ముందుకువేశాం. ఇది కాక ప్రత్యేకంగా నాకు ఈ సందేహాలున్నాయి, వీటిపై నాకు సమాచారం కావాలని చెప్పి ఎవరైనా రైతు ఆర్బీకే దగ్గరకు వచ్చి అడిగితే వాటిని కూడా పరిష్కరించేందుకు ఒక టోల్‌ ప్రీ నంబరు 155251 అని చెప్పి పెట్టడం జరిగింది.

ఇది కాక ఆర్బీకేల్లోనే రైతులు ఏవైనా సందేహాలుంటే మన సైంటిస్ట్‌లతో ఇంటరాక్టివ్‌ పద్ధతిలో కూడా సందేహాలు తీర్చడానికి ఒక వ్యవస్ధను పటిష్టంగా ఏర్పాటు చేయాల్సిందిగా వ్యవసాయశాఖ మంత్రి గారికి, సెక్రటరీ గారికి ఇద్దరికీ తెలియజేస్తున్నాను.  

ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఆర్బీకే కేంద్రాలను విప్లవాత్మకంగా రైతులకి ఇంకా దగ్గరగా, ఇంకా ఎక్కువగా ఉపయోగపడే విధంగా తీసుకొచ్చే ప్రక్రియలో భాగంగా అడుగులు ముందుకు వేస్తున్నాం. 

"ఇవన్నీ కూడా  రైతులకు ఉపయోగపడాలని మనసారా ఆశిస్తూ, కోరుకుంటూ దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఇంకా మీ అందరికీ మంచి చేసే అవకాశం దేవుడిచ్చి, మీకు ఇంకా మంచి చేసే పరిస్ధితి రావాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను" అని సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ప్రసంగం ముగించారు. 

ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, వ్యవసాయ మిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎం వి యస్‌ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య, సివిల్‌ సప్లైస్‌ కమిషనర్‌ కోన శశిధర్, మార్కెటింగ్, సహకార శాఖ స్పెషల్‌ సెక్రటరీ వై మధుసూదన్‌రెడ్డి, అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ కమిషనర్‌ ప్రద్యుమ్న, ఏపీ స్టేట్‌ సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ వీసీ అండ్‌ ఎండీ  ఏ సూర్యకుమారి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

Back to Top