ఆర్థికసాయం డోర్‌ డెలివరీ చేయండి

1.28 కోట్ల ఇళ్లలో సర్వే పూర్తి

ఢిల్లీ సదస్సులో పాల్గొన్నవారు, వారితో కాంటాక్టు అయిన వారికి పరీక్షలు

శిబిరాల్లో ఎలాంటి కొరతలు రాకుండా చర్యలు

కోవిడ్‌-–19 విస్తరణ, నివారణా చర్యలపై సీఎం  వైయస్‌ జగన్‌ సమీక్ష 

తాడేపల్లి: కోవిడ్‌ -19 కారణంగా ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబాలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.1000 ఆర్థిక సహాయాన్ని వాలంటీర్ల ద్వారా డోర్‌ డెలివరీ సమర్థవంతంగా జరిగేలా చూడాలని సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌ జగన్‌ కోవిడ్‌-19 విస్తరణ, నివారణా చర్యలపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. 

ఏపీ నుంచి 946 మంది ఢిల్లీకి:
ఢిల్లీలోని తబ్లీగీ జమాతే సదస్సులో పాల్గొన్నవారు, వారితో కాంటాక్ట్‌ అయిన వారికి వైద్య పరీక్షలపై సీఎంకు వివరాలు అందించిన అధికారులు
ఢిల్లీలో జమాత్‌కు ఏపీ నుంచి  1085 మంది హాజరయ్యారని వీరిలో  946 మందిని గుర్తించామని వెల్లడించారు. ఈ 946 మందిలో 881 మంది ఇప్పటికే పరీక్షలు పూర్తయ్యి ఫలితాలు వచ్చాయని, వీరిలో 108 మంది పాజిటివ్‌గా కేసులుగా నిర్ధారణ అయ్యారని వెల్లడి. ఇంకా 65 మందికి సంబంధించి ల్యాబ్‌ నుంచి ఫలితాలు రావాలన్న అధికారులు. పైన పేర్కొన్న 946 మందితో కాంటాక్ట్‌ అయినవారిలో 616 మంది పరీక్షలు నిర్వహించగా ఇందులో 32 మంది పాజిటివ్‌ కేసులుగా నిర్ధారణ అయ్యాయని వెల్లడించారు. కాంటాక్ట్‌ అయిన మరో 335 మంది ల్యాబ్‌ ఫలితాలు వెల్లడి కావాల్సి ఉందన్నఅధికారులు తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 161 పాజిటివ్‌ కేసుల్లో 140 మంది ఢిల్లీ జమాతే సదస్సుకు వెళ్లినవారు, వారిలో కాంటాక్ట్‌ అయినవారేనని అధికారుల వెల్లడి

 ఇంటింటి సర్వేపై సీఎం ఆరా:
రాష్ట్రంలో ఇంటింటికీ నిర్వహించిన సర్వేపై సీఎం వైయస్‌.జగన్‌ ఆరా తీశారు. వాలంటీర్లు, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లు నిర్వహించిన సర్వేపై సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో 1.45 కోట్ల ఇళ్లకు గానూ 1.28 కోట్ల ఇళ్లలో సర్వే పూర్తయ్యిందని  అధికారులు సీఎంకు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం లాంటి ఏదో ఒక లక్షణం ఉన్నవారిని గుర్తించామని, రెండోదశలో భాగంగా వీరిని పరిశీలిస్తారని, ఎవరికి పరీక్షలు చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటారని అధికారులు వెల్లడించారు. కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో వార్డుల వారీగా డాక్టర్లను నియమించారా లేదా? అని సీఎం ప్రశ్నించారు.  ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కార్పొరేషన్లు, మున్సిపాల్టీల వారీగా వైద్యుల మ్యాపింగ్‌ చేశామని అధికారులు వివరించారు. ఢిల్లీలో సదస్సుకు హాజరైన వారు, వారితో కాంటాక్ట్‌ అయిన వారికి పూర్తిస్థాయిలో పరీక్షలు చేయాలని సీఎం ఆదేశించారు.  పోలీసుల డేటాను, వైద్య సిబ్బంది డేటాను, అలాగే క్షేత్రస్థాయిలో జరుగుతున్న సర్వే డేటాను వీటన్నింటిని విశ్లేషించుకుని ఆ మేరకు వైద్య పరీక్షల విషయంలో ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెళ్లాలన్న సీఎం దిశా నిర్దేశం చేశారు.

 కరోనా వైరస్‌ పరీక్షల సామర్థ్యం పెంపుపై దృష్టి:
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ల్యాబ్‌లు, వాటిని సామర్థ్యంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. గుంటూరు, కడప ల్యాబ్‌ల్లో టెస్టింగ్‌ ప్రారంభమైందని   అధికారులు వివరించారు. సోమవారం నుంచి విశాఖపట్నంలో ల్యాబ్‌ పరీక్షలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెప్పారు.  ఒకరోజులో కనీసం 700 మందికి పరీక్షలు చేయించే అవకాశం ఉందని తెలిపారు. అలాగే ప్రయివేటు ల్యాబ్‌ల సహకారం తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎంకు వివరించారు. వారంరోజుల్లో విజయవాడలో ఈ ప్రయివేటు ల్యాబ్‌ సిద్ధమవుతుందని, మొత్తంగా రోజుకు 900 మందికి పరీక్షలు వరకూ చేయగలిగే సామర్థ్యానికి చేరుకుంటున్నామని పేర్కొన్నారు. 

ప్రతి దుకాణం వద్ద ధరల పట్టిక:
కరోనా నేపథ్యంలో అర్బన్‌లో అయినా, రూరల్‌లో అయినా ప్రతి దుకాణం వద్ద మనిషికి మనిషి మధ్య దూరం పాటించేలా మార్కింగ్స్‌ ఉండాలని, ధరల పట్టిక ఏర్పాటు చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. రద్దీ ఉన్నచోటు అయినా, రద్దీ లేని చోట అయినా ఈ మార్కింగ్స్‌ వేయించాలని అధికారులను ఆదేశించారు.  దీనివల్ల ప్రజలకు ఒక సంకేతం ఇచ్చినట్టు అవుతుందని చెప్పారు. కచ్చితంగా భౌతిక దూరం పాటించాలని సీఎం సూచించారు.   

 క్యాంపుల్లో పరిస్థితులపై సీఎం ఆరా?: 
సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్యాంపుల్లో పరిస్థితులపై సీఎం వైయస్‌ జగన్‌ ఆరా తీశారు. క్యాంపుల్లో ఎంతమంది ఉన్నారన్నదానిపై నిన్న జిల్లాల వారీగా పూర్తిస్థాయిలో వివరాలు తెప్పించామన్న అధికారులు. ప్రభుత్వం నడుపుతున్న శిబిరాలు, వివిధ కంపెనీలు, మిల్లుల్లో పనిచేస్తూ అక్కడ స్థానిక శిబిరాల్లో ఉన్నవారు, అలాగే వివిధ క్వారీల్లో, గనుల్లో పనిచేసుకుంటూ అక్కడే ఉన్నవారు సుమారుగా 78వేలమంది ఉన్నారని అధికారులు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వమే 236 క్యాంపులు నడుపుతూ 16 వేలమందికి స్వయంగా వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తోందని వివరించారు. సోషల్‌ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందిన అధికారిని ప్రతి క్యాంపు వద్ద ఏర్పాటు చేశామని తెలిపారు.  ప్రతి క్యాంపులో ఇద్దరి ఫోన్‌ నంబర్లు తీసుకుని ఎప్పటికప్పుడు ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుంటున్నామని అధికారులు వివరించారు.  లాక్‌డౌన్‌ ఏప్రిల్‌ 14 వరకూ ఉన్నందున దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సీఎం ఆదేశించారు.  ముంబై, గిర్, వారణాశి, గోవా, అజ్మీర్, తమిళనాడు ప్రాంతాల్లో చిక్కుకున్న తెలుగు వారిపై సీఎం ఆరా తీశారు.   వీరికి అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేయాలని సూచించారు.  అలాగే క్వారంటైన్, ఐసోలేషన్లలో ఎస్‌ఓపీ పాటించాలని, కనీస వసతులు, సదుపాయాలు పాటించేలా ఎస్‌ఓపీ ఉండాలన్న సీఎం సూచించారు. 

 పటిష్టంగానే లాక్‌డౌన్‌.. 
లాక్‌డౌన్‌ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించే వారిపట్ల పోలీసులు అనుసరించాల్సిన విధానం పట్ల కూడా దృష్టిపెట్టాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. పోలీసులపై విపరీతమైన పని ఒత్తిడి ఉందనే విషయాన్ని కూడా అంగీకరిస్తామని చెప్పారు. అదే సమయంలో మనం ఉపయోగించే భాష, వారికి కౌన్సెలింగ్‌ ఇస్తున్న తీరు కూడా ముఖ్యమన్న సీఎం
గౌరవ, మర్యాదలు చూపుతూనే లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేయాలని పోలీసులకు సూచించారు. బాపట్ల యువకుడు ఆత్మహత్య కేసు విషయంలో విచారణ చేయించాలని సీఎం ఆదేశించారు.  సమావేశంలో మంత్రులు ఆళ్లనాని, మోపిదేవి వెంకటరమణ, బొత్స సత్యన్నారాయణ, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

Back to Top