రైతుకు అండగా మ‌నం వేసే అడుగు చరిత్రలో నిలుస్తుంది

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

గులాబ్‌ తుపాన్‌తో పంట నష్టపోయిన 34,586 రైతులకు రూ.22 కోట్ల పరిహారం

ప్రకృతి విపత్తులకు రైతులు భయపడాల్సిన అవసరం లేదు

నష్టపోయిన ప్రతి ఎకరాకు, ప్రతి రైతుకు పరిహారం చెల్లిస్తాం

సీజన్‌ ముగిసేలోగా ఇన్‌పుట్‌ సబ్సిడీ అందించే సంప్రదాయాన్ని తెచ్చాం 

రెండున్నరేళ్లలో ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద రూ.1,070 కోట్లు రైతులకు అందించాం

మన ప్రభుత్వం వచ్చాక ధాన్యం సేకరణకు రూ.35 వేల కోట్లు ఖర్చుచేశాం

వైయస్‌ఆర్‌ రైతు భరోసా ద్వారా రూ.18,777 కోట్లు రైతులకు అందించాం

విత్తనం మొదలు.. విక్రయం వరకు రైతుగా తోడుగా నిలిచాం

తాడేపల్లి: ‘‘ప్రకృతి విపత్తులకు రైతులు భయపడాల్సిన అవసరం లేదు. నష్టపోయిన ప్రతి ఎకరాకు సీజన్‌ ముగిసేలోపు పరిహారం అందజేస్తాం. రైతన్నల కోసం మనం వేసే ప్రతి అడుగు ఒక విప్లవాత్మక మార్పుగా చరిత్రలో నిలిచిపోతుంది’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రైతుకు అన్ని వేళలా ప్రభుత్వం తోడుగా ఉండాలని మనసా, వాచా, ఖర్మనా కోరుకుంటూ అడుగులు ముందుకు వేస్తున్నామన్నారు. రెండు నెలల క్రితం సెప్టెంబర్‌లో సంభవించిన గులాబ్‌ తుపాన్‌ కారణంగా పంట నష్టపోయిన 34,586 మంది రైతులకు రూ.22 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ ఖరీఫ్‌ సీజన్‌ ముగిసేలోగా రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నామన్నారు. రెండున్నరేళ్లలో దాదాపు 18 లక్షల ఎకరాల్లో పంట నష్టపోయిన 13.96 లక్షల మంది రైతులకు కేవలం ఇన్‌పుట్‌ సబ్సిడీ రూపంలో రూ.1,070 కోట్లు అందించామన్నారు.

గులాబ్‌ తుపాన్‌ కారణంగా పంట నష్టపోయిన రైతులకు రూ.22 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేశారు. అంతకుముందు రైతుల కోసం ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, ఆర్బీకేలు, పంట కొనుగోలు, ధాన్యం సేకరణ, గత ప్రభుత్వం వదిలేసిన వెళ్లిన బకాయిల చెల్లింపు, రైతుకు అందించే సహాయ, సహకారాల గురించి సీఎం వివరించారు. 

రాయలసీమ, నెల్లూరు జిల్లాల రైతులకు సీఎం భరోసా..
ఈ మధ్యకాలంలో రాయలసీమ, నెల్లూరు జిల్లాలో వర్షాలు భారీగా కురవడం చూస్తున్నామని, ఆ జిల్లాల్లో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ భరోసా కల్పించారు. రైతులెవరూ భయపడాల్సిన పనిలేదని, నష్టపోయిన ప్రతి ఎకరాకు, ప్రతి రైతుకు ప్రభుత్వం తోడుగా ఉంటుందన్నారు. పూర్తి పంటనష్ట పరిహారం కూడా రబీ సీజన్‌ పూర్తికాకముందే చెల్లిస్తామని రాయలసీమ, నెల్లూరు జిల్లాల రైతాంగానికి సీఎం హామీ ఇచ్చారు.  

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏం మాట్లాడారంటే..

మన రాష్ట్రంలోని 62 శాతం జనాభా ఈ రోజు వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్నారు. దేశంలోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి. రైతు ఇబ్బంది పడితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి ఉంటుంది. రైతుకు ఎలా అండగా నిలవాలి.. రైతులకు సమస్యలు ఎక్కడ నుంచి ఉత్పన్నమవుతున్నాయి..? ఆ సమస్యలకు పరిష్కారం ఏమిటీ..? అని గతంలో ఆలోచించిన ప్రభుత్వం లేదు. రైతు క్షేమం కోసం మన ప్రభుత్వం వేసే ప్రతి అడుగు ఒక విప్లవాత్మక మార్పుగా చరిత్రగా మిగిలిపోతుంది. 

రైతుపక్షపాత ప్రభుత్వం మనది..
తుపాన్లు, వరదలు, కరువు ఏవీ వచ్చినా రైతు నష్టపోయే పరిస్థితి రాకూడదు. నష్టం వచ్చినా ఆ పంట సాగు సీజన్‌ ముగిసేలోగా పెట్టుబడి రైతుకు అందేలా అడుగులు వేస్తున్నాం. ఏ సీజన్‌లో జరిగిన నష్టానికి.. అదే సీజన్‌లో పరిహారం చెల్లించే కొత్త సంప్రదాయాన్ని తీసుకువచ్చాం. పూర్తి పారదర్శకతతో గ్రామ సచివాలయంలో జాబితా ప్రదర్శించి.. సీజన్‌ ముగియకముందే రైతుకు తోడుగా ఉండే రైతు పక్షపాత ప్రభుత్వం మనది. 

కచ్చితంగా ప్రభుత్వం తోడుగా ఉంటుంది..
సెప్టెంబర్‌లో కేవలం రెండు నెలల క్రితం సంభవించిన గులాబ్‌ తుపాన్‌ కారణంగా పంట నష్టపోయిన 34,586 మంది రైతులకు రూ.22 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ ఖరీఫ్‌ సీజన్‌ ముగిసేలోగా రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నాం. రూ.22 కోట్లే కదా.. వీటికే ఇంత కార్యక్రమం ఎందుకని కొంత మంది నచ్చనివాళ్లు, గిట్టనివాళ్లు మాట్లాడే పరిస్థితి ఉంటుంది. ఆలోచించాల్సిన విషయం ఏంటంటే.. కొత్త సంప్రదాయాన్ని మనం అవలంబిస్తున్నాం. ఏ రైతు అయినా నష్టపోతే ప్రభుత్వం తోడుగా ఉంటుంది. పూర్తి పారదర్శకతతో నష్టపోయిన రైతుకు పరిహారం సీజన్‌ ముగియకముందే అందుతుంది. కచ్చితంగా ప్రభుత్వం తోడుగా ఉంటుందనే సంప్రదాయాన్ని హైలెట్‌ చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం. 

సంప్రదాయం కొనసాగుతుంది..
మన ప్రభుత్వం వచ్చిన తరువాత రెండున్నరేళ్లలో రూ.1070 కోట్లు పంట నష్టపరిహారం కింద ఇవ్వడం జరిగింది. 2020 నవంబర్‌లో నివర్‌ తుపాన్‌ వస్తే.. డిసెంబర్‌ చివరి నాటికి 12 లక్షల ఎకరాల్లో పంటనష్టపోయిన 8.34 లక్షల మంది రైతులకు రూ. 645 కోట్లు ఇవ్వడం జరిగింది. ఈ రోజు పత్రికల్లో వచ్చిన ప్రకటన గమనిస్తే.. ఎప్పుడు తుపాన్‌ వచ్చింది..? పంటనష్టం ఎంత..? పరిహారం ఎంత, ఎప్పుడు అందించామని తెలపడం జరిగింది. ఈ సంప్రదాయం కొనసాగుతుందనే గట్టి సందేశం ఇవ్వడం అవసరమని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. 

రైతు కోసం ఈ రెండున్నరేళ్లలో..
– రెండున్నరేళ్ల పాలనలో దాదాపు 18 లక్షల ఎకరాల్లో పంట నష్టపోయిన 13.96 లక్షల మంది రైతులకు కేవలం ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద రూ.1,070 కోట్లు. 
– ఇదికాకుండా రెండున్నరేళ్ల కాలంలోనే.. వైయస్‌ఆర్‌ రైతు భరోసా పథకం కింద అక్షరాల రూ.18,777 కోట్లు రైతుల చేతుల్లో పెట్టడం జరిగింది.
– వైయస్‌ఆర్‌ సున్నావడ్డీ పథకం ద్వారా రూ.1,674 కోట్లు రైతుల చేతుల్లో పెట్టాం. 
– వైయస్‌ఆర్‌ ఉచిత పంట బీమాగా అందించిన సొమ్ము రూ.3788 కోట్లు. 
– పగటి పూట తొమ్మిది గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ ఇచ్చేందుకు అక్షరాల రూ.18,000 కోట్లు రైతుల చేతుల్లో పెట్టడం జరిగింది. 
– ఆక్వా రైతులకు రూ.1.50కే ఇస్తున్న విద్యుత్‌ సబ్సిడీకి రెండున్నరేళ్లలోనే రూ.1520 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. 
– నాణ్యమైన ఫీడర్లు ఉంటేనే వ్యవసాయానికి ఉచిత కరెంట్‌ తొమ్మిది గంటల పాటు ఇవ్వగలుగుతామంటే.. దాని కోసం రూ.1700 కోట్లు చిరునవ్వుతో ఖర్చు చేశాం. 
– ధాన్యం సేకరణ కోసమే.. గతంలో ఎప్పుడూ లేనంతగా రూ.35,000 కోట్లు ఖర్చు చేశాం. 
– పత్తి కొనుగోలు కోసం మరో రూ.1800 కోట్లు వెచ్చించాం. 
– ఇతర పంటల కొనుగోలు కోసం కూడా రూ.6434 కోట్లు ఖర్చు చేశాం. 
– రైతు ఎక్కడా ఇబ్బందిపడకూడదనే ఉద్దేశంతో రూ.2000 కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధిని క్రియేట్‌ చేశాం. 
– రూ.3000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని కూడా ఏర్పాటులో ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాను. 

గత ప్రభుత్వ బకాయిలూ చెల్లించాం..
– ఇవన్నీ చేయడంతో పాటు గత ప్రభుత్వం ధాన్యం సేకరణ కోసం రూ.960 కోట్లు బకాయిలుగా పెడితే.. ఆ బకాయిలను కూడా చిరునవ్వుతోనే చెల్లించాం. 
– గత ప్రభుత్వం ఏకంగా కరెంట్‌ బిల్లు రూ.9000 కోట్లు బకాయిలు పెట్టి వదిలేసిపోతే.. ఆ బకాయిలను కూడా మనందరి ప్రభుత్వమే భరించింది. 
– రూ.384 కోట్ల విత్తన బకాయిలు సైతం గత ప్రభుత్వం పెండింగ్‌లో పెడితే.. వాటిని కూడా మనందరి ప్రభుత్వం చిరునవ్వుతో భరించింది. 

ఆర్బీకే కేంద్ర బిందువు..
ప్రతి సందర్భంలో రైతు దగ్గరే, అదే గ్రామంలోనే ఆర్బీకే కనిపిస్తుంది. దాదాపు 10,778 ఆర్బీకేలు ప్రతి గ్రామంలో రైతులకు దర్శనమిస్తున్నాయి. ప్రతి రైతన్నను చెయ్యి పట్టుకొని విత్తనం నుంచి విక్రయం వరకు తోడుగా ఉంటున్నాం. పంట కొనుగోలు చేయడంలో పారదర్శకత.. ఈ–క్రాప్‌ నమోదు చేయడం, ఆ రశీదును సోషల్‌ ఆడిట్‌కు డిస్‌ప్లే చేస్తూ పెట్టడం, ఈ–క్రాప్‌ అనంతరం ఫిజికల్‌ అక్నాలజిమెంట్, డిజిటల్‌ అక్నాలజిమెంట్‌ ఇవ్వడం, ఈ–క్రాప్‌ డేటా ఆధారంగా రైతులకు ఇన్సూరెన్స్, ఇన్‌పుట్‌ సబ్సిడీ, సున్నావడ్డీ ఇవ్వడం. చివరకు పంట కొనుగోలు చేసే కార్యక్రమంలో రైతుకు ఇబ్బందులు ఎదురైతే.. ఆర్బీకే కేంద్రబిందువుగా పనిచేస్తుంది. 

అగ్రికల్చర్‌ అడ్వయిజరీ మీటింగ్స్‌..
రైతన్నలకు మంచి జరగాలని, వారికి తోడుగా ఉండాలనే ఉద్దేశంతో.. ఈ వ్యవస్థలోకి పూర్తిగా మార్పులు తీసుకువచ్చే దిశగా అడుగులు వేశాం. వ్యవసాయ సలహా కమిటీలు ఆర్బీకే స్థాయి నుంచే మొదలుపెట్టాం. ప్రతి నెల మొదటి శుక్రవారం ఆర్బీకేల దగ్గర అగ్రికల్చర్‌ అడ్వయిజరీ కమిటీ మీటింగ్, రెండో శుక్రవారం మండలస్థాయిలో అగ్రికల్చర్‌ అడ్వయిజరీ కమిటీ మీటింగ్, మూడో శుక్రవారం జిల్లా స్థాయిలో కలెక్టర్ల దగ్గర అగ్రికల్చర్‌ అడ్వయిజరీ కమిటీ మీటింగ్‌ జరిగేలా.. ప్రతి సమస్య పరిష్కరించే దిశగా కలెక్టర్లకు ఆదేశాలిచ్చాం. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంటే.. వెంటనే హెచ్‌ఓడీలు, అగ్రికల్చర్‌ సెక్రటరీకి వెంటనే సమాచారం ఇచ్చేలా.. ప్రతి నెలా ఈ కార్యక్రమం సవ్యంగా జరిగేలా మార్పులు తీసుకువచ్చాం.  

రైతులకు మంచి జరగాలని మనసారా కోరుకుంటూ.. దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో ప్రజలందరికీ ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ తన ప్రసంగాన్ని ముగించారు.
 

Back to Top