పబ్లిసిటీ పీక్‌.. పర్ఫార్మెన్స్‌ వీక్ 

చంద్రబాబు పాలనపై వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్య‌ద‌ర్శి సతీష్‌ కుమార్‌ రెడ్డి ఫైర్‌

కడపలోని వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌ కుమార్‌ రెడ్డి 

అన్ని వర్గాలను దారుణంగా వంచించిన చంద్రబాబు 

ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలుకు నోచుకోలేదు

రాష్ట్రంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉంది 

రైతులను ఆదుకోవాలన్న ఆలోచన చంద్రబాబుకు లేదు

ఎస్వీ సతీష్‌ కుమార్‌ రెడ్డి ఆక్షేపణ

మాజీ మంత్రి జోగి రమేష్‌ అరెస్ట్‌ అక్రమం

కేవలం కక్ష సాధింపు కోసమే ఆయనపై చర్య

నకిలీ మద్యం తయారీలో మొత్తం టీడీపీ నాయకులే

అన్యాయంగా జోగి రమేష్‌ పేరు ఇరికించారు

అరెస్టు చేసి ఆయన కుటుంబాన్ని వేధిస్తున్నారు

ప్రెస్‌మీట్‌లో తేల్చి చెప్పిన సతీష్‌ కుమార్‌ రెడ్డి

వైయ‌స్ఆర్ క‌డ‌ప జిల్లా:  చంద్రబాబు ఏడాదిన్నర పాలన గురించి ఒక్కమాటలో చెప్పాలంటే ‘పబ్లిసిటీ పీక్‌.. పర్ఫార్మెన్స్‌ వీక్‌’ అన్నట్లుగా ఉందని వైయ‌స్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌ కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని వ్యవస్థలు ధ్వంసం అయ్యాయని, ఎన్నికల హమీలు అమలు చేయకుండా అన్ని వర్గాలను దారుణంగా వంచించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్షన్‌ పంపిణీకి ప్రతి నెలా హంగామాతో డ్రామా చేస్తున్న సీఎం చంద్రబాబు, కొత్తగా ఒక్క పెన్షన్‌ ఇవ్వకపోగా, దాదాపు 5 లక్షల పెన్షన్లకు కోత పెట్టారని చెప్పారు. మరోవైపు రాష్ట్రంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉందన్న ఆయన, రైతులను ఆదుకోవాలన్న ఆలోచన చంద్రబాబుకు ఏనాడూ ఉండదని అన్నారు.
    గూగుల్‌ డేటా సెంటర్‌కు రూ.22 వేల కోట్లు రాయితీలు ప్రకటించిన కూటమి ప్రభుత్వం, ఆ పేరుతో వివపరీతంగా మార్కెటింగ్‌ చేస్తోందని గుర్తు చేశారు. కాగా, ఆ డేటా సెంటర్‌ వల్ల ఎంత మందికి ఉద్యోగావకాశాలు వస్తాయన్న దానిపై స్పష్టంగా చెప్పడం లేదని కడపలో మీడియాతో మాట్లాడిన ఎస్వీ సతీష్‌ కుమార్ రెడ్డి ఆక్షేపించారు.
ప్రెస్‌మీట్‌లో సతీష్‌ కుమార్‌ రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..:

● జోగి రమేష్ అరెస్ట్‌ అక్రమం:

    నకిలీ మద్యం తయారుచేస్తూ, టీడీపీ నాయకులు రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికినా, ఆ బురదను వైయ‌స్ఆర్‌సీపీకి అంటగట్టే విధంగా, మాజీ మంత్రి జోగి రమేష్‌ పేరు ఇరికించి ఆయన్ను అరెస్టు చేశారు. జోగి రమేష్‌ అరెస్ట్‌ అక్రమం. ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీని బయట పెట్టినందుకే కూటమి ప్రభుత్వం ఆయనపై కక్ష కట్టింది. నకిలీ మద్యం తయారీతో జోగి రమేష్‌కు ఎలాంటి సంబంధం లేదు. ఎలాంటి ఆధారాలు కూడా లేవు. అయినా కేసులో ప్రధాన నిందితుడైన జనార్థన్‌రావుతో చెప్పించి, ఆయన్ను కేసులో ఇరికించి, ఇప్పుడు అన్యాయంగా అరెస్టు చేశారు. ఇదే జనార్దన్‌రావు ములకలచెరువులో బయటపడ్డ నకిలీ లిక్కర్‌ దందా ప్రధాన సూత్రధారి. తంబళ్లపల్లె నియోజకవర్గం టీడీపీ ఇన్‌ఛార్జ్‌ జయచంద్రారెడ్డి.. ఈ జనార్దన్‌రావుకి ప్రధాన అనుచరుడు అని అందరికీ తెలుసు. అయినా జయచంద్రారెడ్డి మీద ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా జనార్ధన్‌రావు నోట జోగి రమేష్‌ పేరు చెప్పించి కేసు నమోదు చేశారు. సెల్‌ఫోన్‌ పోగొట్టుకున్నానని చెప్పిన జనార్దన్‌రావు ఫోన్‌ నుంచి తీసుకున్న వీడియో రికార్డింగ్‌లు, వాట్సాప్‌ స్క్రీన్‌షాట్‌లే ఆధారాలుగా చెప్పడం ఇంకా విడ్డూరంగా ఉంది. 

● అంతా డైవర్షన్‌ పాలిటిక్స్‌:

    వరుస వైఫల్యాలతో ప్రజలకు సమాధానం చెప్పుకోలేని స్థితిలో కూటమి ప్రభుత్వం పడిపోయింది. ఏడాదిన్నర కాకుండానే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత తెచ్చుకుంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు అవినీతిలో నిండా మునిగిపోయారు. ఆలయ భూములు, పోర్టులు, ఆస్పత్రులను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేస్తున్నారు. స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తుంటే చోద్యం చూస్తూ కూర్చున్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి మరీ దైన్యంగా ఉంది. ప్రభుత్వ వైఫల్యాలపై వైయ‌స్ఆర్‌సీపీ ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పుకోలేక తప్పుడు కేసులు బనాయించి అక్రమ అరెస్టులు చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఆధారాలు లేకుండా తప్పుడు కేసుల్లో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులను అరెస్ట్‌ చేస్తున్నారు. మొంథా తుపాన్‌లో సహాయ కార్యక్రమాల్లో వైఫల్యం, కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట ఘటన నుంచి ప్రజలను డైవర్ట్‌ చేయడానికే బీసీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేశ్‌ను అక్రమంగా అరెస్ట్‌ చేశారు. 

● పర్యటనలతో తండ్రీకొడుకుల జల్సా:

    తీవ్ర ప్రతికూల పరిస్థితుల మధ్య రాష్ట్రంలో రైతులు కష్టాల్లో ఉంటే, సీఎం చంద్రబాబు లండన్‌ వెళ్లిపోయాడు. మొన్నటిదాకా ఆస్ట్రేలియాలో క్రికెట్‌ ఎంజాయ్‌ చేసిన నారా లోకేష్, ఉమెన్‌ వరల్డ్‌ కప్‌ క్రికెట్‌ మ్యాచ్‌ చూడడానికి ముంబై వెళ్లాడు. అలా తండ్రీ కొడుకులిద్దరూ పర్యటనలతో జల్సా చేస్తున్నారు. ఎందుకీ పర్యటనలు అంటే, రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తామంటున్నారు. కానీ ఏడాదిన్నర అవుతున్నా రాష్ట్రానికి వీరు తెచ్చిన పెట్టుబడులు ఏవీ కనిపించడం లేదు.

● గూగుల్‌ డేటా సెంటర్‌ పైనా తప్పుడు సమాచారం:

    గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలోనే విశాఖలో అదానీ డేటా సెంటర్‌ (గూగుల్‌ డేటా సెంటర్‌)కు బీజం పడింది. 300 మెగావాట్ల అదానీ డేటా సెంటర్‌తో పాటు, ఐటీ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తూ దాని ద్వారా 24 వేల మంది యువతకు ఉద్యోగాలిచ్చేలా ఒప్పందం జరిగింది. కాగా, ఒక గిగా వాట్‌ గూగుల్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నారని నమ్మబలికిన చంద్రబాబు, ఎంతమంది యువతకు ఉద్యోగాలిస్తున్నారో చెప్పమంటే మాత్రం చెప్పలేకపోతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోలో ఇన్‌డైరెక్ట్‌ ఉద్యోగాలిస్తామని చెప్పడం మరో వింత. 200 ఉద్యోగాలు మించి రావని టీడీపీ భజన పత్రిక ఈనాడు రాసింది. ఇలాంటి గూగుల్‌కు ప్రభుత్వం రూ.22 వేల కోట్ల రాయితీలు ఇస్తామని ఎలా చెప్పిందో అర్థం కావడం లేదు. 

● పెట్రోల్, డీజీల్‌ రేట్లు తగ్గించాలి:

    జీఎస్టీని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా తన ఘనతగా చెప్పుకుంటూ.. చంద్రబాబు ఉత్సవాలు చేశాడు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనంతగా ఇక్కడ పెట్రోల్‌ డీజిల్‌ ధరలు ఉన్నాయి. దీంతో రాష్ట్ర సరిహద్దుల్లోని పెట్రోల్‌ బంక్‌ల్లో వ్యాపారాలు అస్సలు నడవడం లేదు. ఎన్నికలప్పుడు పెట్రోల్‌ డీజిల్‌ ధరలు తగ్గిస్తామని ప్రచారం చేసుకున్న తండ్రీకొడుకులు వాటిని ఎందుకు తగ్గించడం లేదో చెప్పాలి. సీఎం చంద్రబాబుకు నిజంగా పేదల మీద ప్రేమే ఉంటే తక్షణమే డీజిల్‌ ధరలు తగ్గించాలని ఎస్వీ సతీష్‌ కుమార్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

Back to Top