టీడీపీ మద్యం దందా మరోసారి బట్టబయలు 

ఆడియో టేపుతో దొరికిన రాజమండ్రి సిటీ టీడీపీ ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితుడు 

షాపునకు రూ.1.40 లక్షలు ఎమ్మెల్యేకివ్వాలని ఆదేశం 

టీడీపీ నేతలు సిగ్గు లేకుండా మద్యం దందా సాగిస్తున్నారు 

వీటి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే వైయ‌స్ఆర్‌సీపీ నేత జోగి రమేష్‌ అరెస్టు 

అడ్డంగా దొరికిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుని ఎమ్మెల్యే పదవి నుంచి తప్పించాలి

వైయ‌స్ఆర్‌సీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్‌

రాజమహేంద్రవరం : రాజమహేంద్రవరం సిటీ టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడి ఆడియో టేపుతో రాష్ట్రంలో టీడీపీ నేతల మద్యం దందా మరోసారి బట్టబయలైందని రాజమండ్రి మాజీ ఎంపీ, వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్‌రామ్‌ చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అనుచరుడు మద్యం సిండికేట్‌ వ్యవహారంలో ఆడియోతో రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికాడని తెలిపారు. భరత్‌రామ్‌ సోమవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఒక్కో షాపునకు రూ.1.40 లక్షల చొప్పున ఎమ్మెల్యేకి మామూలివ్వాలంటూ టీడీపీ నాయకుడు, మాజీ కార్పొరేటర్‌ కిలపర్తి శ్రీనివాస్‌ ఫోనులో మాట్లాడిన సంభాషణ బయటకు వచ్చేసిందన్నారు. కిలపర్తి శ్రీనివాస్‌ టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు అత్యంత సన్నిహితుడని తెలిపారు.

 టీడీపీ నేతల మద్యం దందాకు సంబంధించి బయటకు వచ్చిన రెండో ఆడియో ఇది అని తెలిపారు. ఎమ్మెల్యేకు మామూళ్ల అమౌంట్‌ సెట్‌ చేసినట్లు ఆ ఆడియోలో స్పష్టంగా చెప్పారని అన్నారు. కొద్ది రోజుల క్రితం రాజమండ్రికే చెందిన మరో టీడీపీ నేత మజ్జి రాంబాబు ఎవరికెంత ముట్టజెప్పాలో మద్యం షాపుల యజమానులకు చెప్పిన ఆడియో బయటకు వచ్చిందన్నారు. ఇలా టీడీపీ ప్రజాప్రతినిధులు అనుచరుల ద్వారా ఏమాత్రం సిగ్గు లేకుండా, విచ్చలవిడిగా మద్యం దందా సాగిస్తున్నారని తెలిపారు.

కిలపర్తి శ్రీను ఆడియో ఏఐ సృష్టి అంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై నెపం నెట్టేస్తున్నారని, కూటమి నేతల మద్యం దందా ప్రజలందరికీ తెలిసిందేనని, వీటిని ప్రజలు నమ్మే స్థితిలో లేరని, వారు ఎంత తప్పించుకోవాలని ప్రయత్నించినా కుదరదని స్పష్టం చేశారు. టీడీపీ నేతలే మద్యం దందా నడుపుతున్నారని. నకిలీ మద్యం తయారు చేస్తున్నారని స్పష్టం చేశారు. మద్యం వ్యవహారంలో అనుచరులతో నేరుగా దొరికినా సిటీ ఎమ్మెల్యేను ప్రభుత్వం ఎందుకు ఎమ్మెల్యే పదవి నుంచి తప్పించదని ప్రశి్నంచారు. చంద్రబాబుకు, లోకేశ్‌కు చిత్తశుద్ధి ఉంటే వాసును పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని భరత్‌రామ్‌ డిమాండ్‌ చేశారు.

 భక్తులకు రక్షణ కల్పించలేని  ప్రభుత్వం వెంటనే దిగిపోవాలి
రాష్ట్రంలో భక్తులకు రక్షణ కల్పించలేని కూటమి ప్రభుత్వం తక్షణమే దిగిపోవాలని భరత్‌రామ్‌ డిమాండ్‌ చేశారు. ఆలయాల్లో భక్తులు మృత్యువాత పడుతున్నా రక్షణ కల్పించలేని ప్రభుత్వం దేనికుందో అర్థం కావడం లేదని మండిపడ్డారు.  శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ ఆలయంలో 9 మంది భక్తుల మరణానికి ప్రభుత్వమే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి, సింహాచలం చందనోత్సవం నాడు కూడా భక్తులు చనిపోయారని, ఈ ఘటనలన్నింటికీ చంద్రబాబు కూటమి ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అన్నారు.

గత గోదావరి పుష్కరాల్లో రాజమహేంద్రవరంలో 29 మంది చనిపోవడానికి కూడా చంద్రబాబే కారణమని చెప్పారు. ఆయన ప్రచార పిచ్చికి 29 మందిని బలి తీసుకున్నారని తెలిపారు. కాశీబుగ్గ ఆలయ నిర్మాణదారుపై కేసు పెట్టారని, గతంలో తిరుపతిలో జరిగిన దుర్ఘటనలో టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడుపై ఎందుకు కేసు పెట్టలేదని నిలదీశారు. సింహాచలం ఘటనలో ఆ క్షేత్ర వంశపారంపర్య ధర్మకర్త అశోక్‌ గజపతిరాజుపై ఎందుకు కేసు పెట్టలేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం, నిజస్వరూపం ప్రజలకు తెలిసిపోతుందనే ఉద్దేశంతో, వారి దృష్టి మళ్లించేందుకే వైయ‌స్ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌ను కూటమి పెద్దలు అరెస్టు చేశారన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి అసలు ప్రభుత్వం వద్ద ఉన్న సాక్ష్యమేమిటో చెప్పాలని డిమాండ్‌ చేశారు.
 

Back to Top