తాడేపల్లి: కర్నూలు బస్సు ప్రమాదం అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై కూటమి ప్రభుత్వం వైయస్ఆర్‌సీపీని టార్గెట్ చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే 27 మందిపై అక్రమ కేసులు నమోదు చేయగా, తాజాగా వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి(మీడియా విభాగం) పూడి శ్రీహరికి కర్నూలు తాలుకా సీఐ హేమంత్‌రెడ్డి నోటీసులు ఇచ్చారు. ఏదో రకంగా వైయస్ఆర్‌సీపీని వేధించాలనే లక్ష్యంతో కూటమి కనుసన్నల్లో పని చేస్తున్న ఏపీ పోలీసులు.. శుక్రవారం తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చి నోటీసులు ఇచ్చారు. బస్సు దగ్దానికి మద్యమే కారణమని ప్రచారం చేశారంటూ నోటీసులు ఇచ్చారు. ఈ ప్రచారం వెనుక వైయస్ఆర్‌సీపీ ఉందంటూ అక్రమ కేసు పెట్టారు. నోటీసులకు భయపడేది లేదు: టీజేఆర్ పోలీసుల నోటీసులపై వైయస్ఆర్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు స్పందిస్తూ.. ‘‘కర్నూలు బస్సు దగ్దానికి మద్యమే కారణం.. ఆ విషయం అందరికీ తెలుసు. కానీ అదే విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టిన వారిపై కేసులు పెట్టారు. ఇప్పుడు ఏకంగా మా పార్టీ కేంద్ర కార్యాలయానికే పోలీసులు వచ్చారు. మా పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీహరికి నోటీసులు ఇచ్చారు. ప్రజలు, ప్రతిపక్షం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని ప్రభుత్వం నోటీసులతో భయపెట్టాలని చూస్తోంది. ఇలాంటి నోటీసులు, కేసులకు మేము భయపడము. కర్నూలు బస్సు దగ్దానికి కారణమైన బైకర్లు మద్యం ఎక్కడ తాగారో ప్రభుత్వం ఎందుకు చెప్పటం లేదు?. మృతుని శరీరంలో ఎంత ఆల్కాహాల్ ఉందో రిపోర్టుని ఎందుకు బయట పెట్టలేదు?. రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం, డ్రగ్స్ దొరుకుతోంది. విశాఖలో దొరికిన డ్రగ్స్ వివరాలు హోంమంత్రి ఎందుకు బయట పెట్టటం లేదు?. ఎవరి ప్రభుత్వ హయాంలో డ్రగ్స్ దొరికాయో శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా?’’ అంటూ టీజేఆర్ ప్రశ్నించారు.