రాష్ట్రంలో ఎమ‌ర్జెన్సీ వాతావ‌ర‌ణం

భావ‌ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌, ప‌త్రికా స్వేచ్ఛ‌కు సంకెళ్లు

ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించిన వారిపై అక్ర‌మ కేసులు  

వైయ‌స్ఆర్‌సీపీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ పూడి శ్రీహ‌రికి నోటీసులు

వైయ‌స్ఆర్‌సీపీ లీగ‌ల్ సెల్ అధ్య‌క్షుడు ఎం. మ‌నోహ‌ర్‌ రెడ్డి ఫైర్‌

తాడేప‌ల్లి లోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ లీగ‌ల్ సెల్ అధ్య‌క్షుడు ఎం. మ‌నోహ‌ర్‌ రెడ్డి 

క‌ర్నూలు బ‌స్సు ప్ర‌మాదంపై ప్ర‌శ్నించిన 27 మందిపై కేసు

ప‌త్రిక‌ల క్లిప్పింగులు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసినందుకే నోటీసులు 

తండ్రి ఆఖ‌రి చూపు కోసం వ‌చ్చిన ఎన్నారై ని కూడా వ‌ద‌ల్లేదు 

పోలీసుల‌ను కొట్టాడ‌ని అక్ర‌మ కేసు పెట్టి కాళ్లు వాచిపోయేలా కొట్టారు 

తెలుగుదేశం నాయకుల నేరాల్లో వైయ‌స్ఆర్‌సీపీ వారిని అక్ర‌మంగా ఇరికిస్తున్నారు

ఆధారాలు లేక‌పోయినా త‌ప్పుడు వాంగ్మూలాల‌తో క‌క్ష‌సాధింపులు 

కూట‌మి కుట్ర‌ల‌ను బ‌య‌ట‌పెట్టిన మ‌నోహ‌ర్‌ రెడ్డి  

తాడేప‌ల్లి: రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాట‌య్యాక ఎమర్జెన్సీ వాతావ‌ర‌ణం నెల‌కొంద‌ని, ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌పై ప్ర‌శ్నిస్తే త‌ప్పుడు కేసులు పెట్టి అక్ర‌మ అరెస్టులు చేస్తున్న నియంత పాల‌న సాగుతోంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ లీగ‌ల్ సెల్ అధ్య‌క్షుడు ఎం మ‌నోహ‌ర్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ క‌ర్నూలు బ‌స్సు ప్ర‌మాదంపై ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తూ సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు ఇప్ప‌టికే 27 మందిపై కేసులు పెట్టిన కూట‌మి ప్ర‌భుత్వం, దానికి పరాకాష్ట‌గా వైయ‌స్ఆర్‌సీపీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ పూడి శ్రీహ‌రికి నోటీసులు ఇచ్చింద‌ని అన్నారు. ఈ కేసుతో ఆయ‌న‌కు ఏ సంబంధం లేక‌పోయినా డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ చేయ‌డమే ప‌నిగా పెట్టుకున్న ప్ర‌భుత్వం ఈ రకంగా వైయ‌స్ఆర్‌సీపీకి చెందిన నాయ‌కుల‌పై క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల‌కు దిగుతోంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చివ‌రికి టీడీపీ నాయ‌కులు చేసే నేరాల్లోనూ వైయ‌స్ఆర్‌సీపీ వారిని అక్ర‌మంగా ఇరికిస్తున్నారని మ‌నోహ‌ర్‌రెడ్డి వివ‌రించారు. తండ్రి చ‌నిపోతే క‌డ‌సారి చూపుకోసం లండ‌న్ నుంచి వ‌చ్చిన మాల‌పాటి భాస్క‌ర్‌రెడ్డి అనే ఎన్నారైని అక్ర‌మ కేసులో ఇరికించి న‌డ‌వ‌లేని విధంగా దారుణంగా కొట్టార‌ని చెప్పారు. పొలిటిక‌ల్ బాస్‌ల ఆదేశాల‌తో పోలీసులే ఆర్గనైజ్డ్ నేరాల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆరోపించారు. పాల‌న చేత‌కాక‌, హామీలు అమ‌లు చేయ‌లేక 18 నెల‌ల‌కే చేతులెత్తేసిన కూట‌మి ప్ర‌భుత్వం ఇలాంటి నియంత‌పోక‌డ‌ల‌కు పోతోంద‌న్న మ‌నోహ‌ర్‌రెడ్డి, చ‌రిత్ర‌లో ఎంతోమంది నియంత‌లు మ‌ట్టిక‌రిచిన సంఘ‌ట‌న‌ల నుంచి పాఠాలు నేర్చుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. 

● వైయ‌స్ఆర్‌సీపీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ పూడి శ్రీహ‌రిపై అక్ర‌మ కేసు

గ‌తంలో ఎమ‌ర్జెన్సీ స‌మ‌యంలో కూడా ఎదురుకాని దారుణ ప‌రిస్థితులు నేడు కూట‌మి అధికారంలోకి వ‌చ్చాక రాష్ట్రంలో నెల‌కొన్నాయి. పౌరుల భావ‌ప్ర‌క‌ట‌న స్వేచ్ఛ, ప‌త్రికా స్వేచ్ఛ‌కి కూట‌మి ప్ర‌భుత్వం విఘాతం క‌లిగిస్తోంది. కర్నూలు బ‌స్సు ప్ర‌మాదం జ‌రిగి అందులో 19 మంది ప్ర‌యాణికులు చ‌నిపోతే దానికి కార‌ణం ఏమై ఉంటుంద‌ని రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌జ‌ల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వాస్త‌వాల‌ను వెలికితీయాల్సిన ప‌త్రిక‌లు అనేక అనుమానాల‌ను ప్ర‌భుత్వం ముందుచాయి. నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా హైవేలో బెల్ట్ షాపులు, బార్లు ఉండ‌టం వాస్త‌వం కాదా? ఈ ప్ర‌మాదానికి బాధ్యుడైన వ్య‌క్తి పెట్రోల్ బంకులో తూలుతూ క‌నిపించిన దృశ్యాలు పలు అనుమానాల‌కు తావిచ్చాయి. ప్ర‌మాదానికి కార‌కుడైన యువ‌కుడు న‌కిలీ మ‌ద్యం సేవించాడ‌ని ప‌లు విశ్లేష‌ణ‌లు వెలువ‌డితే నిజమా కాదో ప్ర‌భుత్వం స్ప‌ష్టంగా చెప్పాల‌ని సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌శ్నించిన వారి ప‌ట్ల కూట‌మి ప్ర‌భుత్వం క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. క‌ర్నూలు టూటౌన్ డీఎస్పీ ముందు హాజ‌రుకావాల‌ని ఇప్ప‌టికే దాదాపు 27 మందిపై కేసులు పెట్టిన పోలీసులు దానికి పరాకాష్ట‌గా వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యానికి వ‌చ్చి పార్టీ మీడియా వ్య‌వ‌హారాలు చూస్తే జ‌నర‌ల్ సెక్ర‌ట‌రీ పూడి సెక్ర‌ట‌రీకి నోటీసులు ఇచ్చి వెళ్లారు. న‌కిలీ మ‌ద్యం వ్య‌వ‌హారంలో ప్ర‌భుత్వం మీద వ్య‌తిరేక‌త వ‌స్తే దానికి స‌మాధానం చెప్పుకోలేక ప్ర‌శ్నించిన వారిపై కేసులు న‌మోదు చేసి డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ చేయ‌డమే ఈ ప్ర‌భుత్వం ప‌నిగా పెట్టుకుంది. ఈ కేసుతో ఏం సంబంధం ఉంద‌ని పూడి శ్రీహ‌రికి నోటీసులు ఇచ్చారో ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేయాలి. ఈ కేసులో నోటీసులు అందుకున్న అంద‌రూ ప‌త్రిక‌ల్లో వ‌చ్చిన క‌థ‌నాలనే పోస్ట్ చేశారు త‌ప్ప‌, ఎక్క‌డా అస‌భ్య ప‌ద‌జాలం వాడ‌లేదు. ఇవ‌న్నీ నేరం కిందికి కూడా రావు. పౌరుల‌కు రాజ్యాంగం ఇచ్చిన భావ‌ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌తో కేవ‌లం ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించినందుకు నోటీసులిచ్చారు. తెలుగుదేశం పార్టీకి ఎవ‌రు నోరుమెదిపినా వారిని బెదిరించి అరెస్ట్ చేసి క‌ల‌కాలం వాళ్లే రాజ్యం ఏలాల‌నే యావ‌లో ఉన్న‌ట్టున్నారు. ఇలాంటి విధానాలు ప్ర‌జాస్వామ్యంలో శాశ్వ‌తం కాదు. ఎంద‌రో నియంత‌లు చ‌రిత్రలో క‌లిసిపోయారు. 

● న్యాయ‌వాదుల‌ను సైతం బెదిరించే ప్ర‌య‌త్నం

క‌ర్నూలు బ‌స్సు ప్ర‌మాద దుర్ఘ‌ట‌న త‌ర్వాత ప్ర‌భుత్వం నిద్రమ‌త్తు వీడి హైవేలపై నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించి కొన‌సాగుతున్న మ‌ద్యం షాపులు, బెల్ట్ షాపుల‌ను మూసేయ‌కుండా దాన్ని ప్ర‌శ్నిస్తున్న వారిపైనే క‌క్ష‌సాధింపుల‌కు దిగుతోంది. ముల‌క‌ల‌చెరువులో న‌కిలీ మ‌ద్యం త‌యారీ యూనిట్ గుట్టు బ‌య‌ట‌ప‌డిన త‌ర్వాత కూడా నిందితుల‌పై చ‌ర్య‌లు తీసుకోలేదు. నిందితుడు తంబ‌ళ్ల‌ప‌ల్లె నియోజ‌క‌వ‌ర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి జ‌య‌చంద్రారెడ్డి, అత‌ని అనుచ‌రులు క‌ట్టా సురేంద్ర‌నాయుడు కావ‌డంతో వారిని అరెస్ట్ చేయ‌కుండా వ‌దిలేశారు. కానీ ఈ కేసుతో సంబంధం లేక‌పోయినా ఇబ్ర‌హీంప‌ట్నంలో త‌యార‌వుతున్న న‌కిలీ మ‌ద్యం రాకెట్‌ను వెలికితీసిన మాజీ మంత్రి, బీసీ నాయ‌కుడు జోగి ర‌మేశ్‌ను అక్ర‌మంగా అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో ఏ నేరం జ‌రిగినా, ఏ స్కాం బ‌య‌ట‌ప‌డినా అందులో కూట‌మి పార్టీల‌కు చెందిన నాయ‌కులే ఉంటున్నారు. వాటి నుంచి ప్ర‌జ‌ల‌ను దృష్టి మ‌ర‌ల్చేందుకు వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు, సోష‌ల్ మీడియా కార్య‌క‌ర్త‌ల‌పై  త‌ప్పుడు కేసులు న‌మోదు చేసి వేధించ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నారు. ఆఖ‌రుకి న్యాయ‌వాదుల‌ను సైతం వ‌ద‌ల‌కుండా అక్ర‌మ కేసుల‌తో బెదిరించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. 

● పోలీసులే ఆర్గ‌నైజ్డ్‌గా నేరాలు చేస్తున్నారు

మాల‌పాటి భాస్క‌ర్‌ రెడ్డి అనే ఎన్నారై త‌న తండ్రి చ‌నిపోతే క‌డ‌సారి చూపు చూసేందుకు ఏపీకి వ‌స్తే త‌ప్పుడు కేసులో అరెస్ట్ చేసిన పోలీసులు న‌డ‌వ‌లేని విధంగా దారుణంగా కొట్టారు. గ‌తంలో ఎప్పుడో ప‌దేళ్ల క్రితం తెలుగుదేశం పార్టీని తిడితే ఈ కేసులో బెయిల్ వ‌స్తుంద‌ని తెలిసి పోలీసుల‌నే కొట్టిన‌ట్టు త‌ప్పుడు కేసు పెట్టి ఆ వ్య‌క్తిని కాళ్లు వాచిపోయేలా కొట్టి వేధించారు. తండ్రి చ‌నిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నాడ‌ని కూడా ప్ర‌తీకార రాజ‌కీయాల‌కు పోలీస్ వ్య‌వ‌స్థ‌ను పావుగా వాడుకుంటున్నారు. ప్ర‌భుత్వాన్ని ఎవ‌రూ ప్ర‌శ్నించ‌కూడ‌ద‌ని పొలిటిక‌ల్ బాస్‌ల ఆదేశాల‌తో పైనుంచి కింది వ‌ర‌కు పోలీసులే ఆర్గ‌నైజ్డ్ గా నేరాలు చేస్తున్నారు. చివ‌రికి తెలుగుదేశం పార్టీ నాయ‌కులు పాల్ప‌డిన నేరాల్లో కూడా అద‌నంగా అక్రమంగా వైయ‌స్ఆర్‌సీపీ వారిని ఇరికిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో రెండు వ‌ర్గాలు ఆధిప‌త్య‌పోరుతో ఘ‌ర్ష‌ణ ప‌డి ఒక వ్య‌క్తిని చంపితే ఆ కేసులో పిన్నెళ్లి రామ‌కృష్ణారెడ్డి సోద‌రుల‌ను అక్ర‌మంగా ఇరికించారు. దాస‌రి వీర‌య్య అనే వైయ‌స్ఆర్‌సీపీ జెడ్పీటీసీ భ‌ర్త‌ను కేసులో అక్ర‌మంగా ఇరికించారు. న‌కిలీ మ‌ద్యం కేసులో నిందితులంతా తెలుగుదేశం పార్టీ నాయ‌కులేన‌ని ఆధారాల‌తో స‌హా దొరికిపోతే జోగి ర‌మేశ్‌ను అక్ర‌మంగా ఇరికించారు. ఆయ‌న నేరం చేసిన‌ట్టు ఎలాంటి ఆధారాలు లేక‌పోయినా ప్ర‌ధాన నిందితుడు అద్దేప‌ల్లి జ‌నార్ద‌న్‌రావు నుంచి వాంగ్మూలం తీసుకుని దాని ఆధారంగా కేసు న‌మోదు చేశారు. ఎప్పుడో ప‌దేళ్ల క్రితం జ‌రిగిన ఘ‌ట‌న‌ల్లో ఇప్పుడు కేసులు న‌మోదు చేసి వైయ‌స్ఆర్‌సీపీ సానుభూతిప‌రులైన వారిని వేధిస్తున్నారు. ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీలు అమ‌లు చేయ‌లేక 18 నెల‌ల పాల‌న‌కే చేతులెత్తేసిన ప్ర‌భుత్వం, ఇక‌పై కొన‌సాగ‌ద‌ని నిర్ణ‌యానికి వ‌చ్చి ఇలాంటి నియంత పోక‌డ‌ల‌కు పోతున్నారు. ఇది చాలా త‌ప్పు. చ‌రిత్ర‌లో ఎంతోమంది నియంత‌లే మ‌ట్టిక‌రిచిన ఘ‌ట‌న‌లున్నాయి. వాటి నుంచి ఈ ప్ర‌భుత్వం పాఠాలు నేర్చుకోవాలి. త‌క్ష‌ణం పూడి శ్రీహ‌రి మీద పెట్టిన కేసును ఉప‌సంహ‌రించుకోవాలి. ప్ర‌శ్నించేవారినంద‌ర్నీ అరెస్ట్ చేయ‌డం ప్ర‌భుత్వానికి మంచిది కాద‌ని గ్ర‌హించాలి.

Back to Top