మెడిక‌ల్ కాలేజీలు ప్రైవేట్‌ప‌రం చేయ‌డం దుర్మార్గం

ఎమ్మెల్సీ డీసీ గోవింద‌రెడ్డి, ఎమ్మెల్యే డాక్ట‌ర్ దాసరి సుధ ఆగ్ర‌హం

బ‌ద్వేల్ ప‌ట్ట‌ణంలో కోటి సంత‌కాల సేక‌ర‌ణ‌కు విశేష స్పంద‌న‌

వైయ‌స్ఆర్ జిల్లా:  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తీసుకువ‌చ్చిన మెడిక‌ల్ కాలేజీల‌ను చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ప్రైవేట్‌ప‌రం చేయ‌డం దుర్మార్గ‌మ‌ని ఎమ్మెల్సీ డీసీ గోవింద‌రెడ్డి, ఎమ్మెల్యే డాక్ట‌ర్ దాసరి సుధ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  వైయ‌స్ జ‌గ‌న్ పిలుపు మేర‌కు మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బ‌ద్వేల్ ప‌ట్ట‌ణం 26వ‌ వార్డు , భావన నగర్‌లో చేప‌ట్టిన  కోటి సంతకాల కార్యక్రమానికి విశేష స్పంద‌న ల‌భించింది. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రాష్ట్రానికి 17 మెడిక‌ల్ కాలేజీలు తీసుకువ‌చ్చి..వాటిలో 7 మెడికల్‌ కాలేజీలో పూర్తి చేశార‌న్నారు. మరో 4 ప్రారంభం కావాల్సి ఉన్నాయన్నారు. మరో 6 కాలేజీలు వచ్చే ఏడాదికి అందుబాటులోకి తీసుకురావడానికి వైయ‌స్‌ జగన్‌ ప్రణాళిక రూపొందించారన్నారు. అయితే కూటమి ప్రభుత్వం మెడికల్‌ కాలేజీలను ప్రైవేటుపరం చేయడానికి సిద్ధపడుతోందని మండిపడ్డారు.  ఇది పేదలకు వైద్య విద్యను దూరం చేయడమే అన్నారు. లక్షల కోట్ల ఆదాయం వచ్చేలా చంద్రబాబు తన బంధువులు, పార్టీ వాళ్లకు కళాశాలలను హస్తగతం చేయడానికి కుట్ర చేస్తున్నార‌ని ఫైర్ అయ్యారు. కూటమి నిర్ణయంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతో పాటు పేదలకు వైద్య విద్య దూరం అవుతుంద‌న్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండాల్సిన కళాశాలలను ప్రైవేట్‌పరం చేస్తే ప్రజలకు వైద్యం కూడా దూరం అవుతుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. చంద్రబాబు తీరు, కూటమి ప్రభుత్వ వైఖరికి నిరసనగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామ‌ని తెలిపారు. ఈ ప్రజా ఉద్యమంలో మేధావులు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, యువత, రాజకీయాలకు అతీతంగా పార్టీలు పాల్గొనాలని కోరారు. అందరూ కలిసికట్టుగా పోరాటం చేసి కూట‌మి ప్రభుత్వం మెడలు వంచుదామని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ మాజీ ప్రభుత్వ సలహాదారులు నాగార్జున రెడ్డి, నాయ‌కులు లయన్ భాస్కర్ రెడ్డి,  వైయ‌స్ఆర్‌సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ, నియోజకవర్గ బూత్ కన్వీనర్ల సమన్వయకర్త కల్లూరు రమణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ సాయి కృష్ణ, గోపాలస్వామి, మున్సిపాలిటీ పార్టీ కన్వీనర్ సుందర్ రామిరెడ్డి,  త‌దిత‌రులు పాల్గొన్నారు.

Back to Top